Monday, 28 December 2009

భ్రష్టుపట్టిన గవర్నర్ల వ్యవస్థ

గవర్నర్ల వ్యవస్థ మరోసారి చర్చనీయాంశమయింది. ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఉండగా వాటిపైన కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేయడానికి ఉద్దేశించిన గవర్నర్ల వ్యవస్థ అవసరమా? దేనికీ జవాబుదారీ కాని గవర్నరు ఎందుకు? రాజభవన్‌లను గవర్నర్లు పార్టీ కార్యాలయాలుగా మార్చేస్తుంట,ే ఇతరత్రా కార్యకలాపాలకు ఉపయోగిస్తుంటే చూస్తూ భరించాల్సిందేనా? గవర్నర్‌ వ్యవస్థ అధికార పార్టీ రాజకీయ నాయకులకు పునరావాస కేంద్రంగా మారడమే కాదు. గవర్నర్లు కేంద్రంలో అధికార పార్టీకి తాబేదార్లుగా వ్యవహరించిన సంఘటనలు కొకొల్లలు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ రాజ్‌భవన్‌ మరో రూపంలో ప్రజల ముందుకొచ్చింది. గతంలో ఇలాంటి ఆరోపణలు ఎప్పుడూ లేవు. గవర్నర్‌ వ్యవస్థ దుర్వినియోగానికి ఇది ఒక పార్శ్వం మాత్రమే.



గవర్నర్లుగా నియమించబడే వారి గత చరిత్రను, పూర్వాపరాలను, అర్హతానర్హతలను పరిగణనలోకి తీసుకుంటున్న దాఖలాలు లేవు. కేవలం సంకుచిత రాజకీయ సర్దుబాట్లకు గవర్నర్ల నియామకాలు జరుగుతున్నాయి. ఇందుకు గౌరవప్రదమైౖన మినహాయింపులు కొన్ని ఉన్నా గవర్నర్‌ వ్యవస్థే దండగమారినదనే సహేతుక విమర్శకు కొందరు గవర్నర్ల ఆచరణ పదేపదే బలం చేకూర్చుతున్నది. ప్రజల సొమ్ముతో నడుస్తున్న గవర్నర్‌ వ్యవస్థ నిర్వహణకు, రాజభవన్‌ నిర్వహణకు ఎంత సొమ్ము, ఎందుకోసం ఖర్చవుతున్నదనేది ప్రశ్నించటానికి కూడా లేని ప్రత్యేక హక్కులు రక్షణగా ఉంటున్నాయి. గవర్నర్‌ పదవిలో ఉన్నవారి వ్యక్తిగత నడవడిక, వ్యవస్థాపరమైన పనితీరుపై విమర్శలు వచ్చిన సందర్భాలలో కూడా తీవ్రమైన పరిస్థితులలో తప్ప అలాంటి వారిని వెనుకకు పిలిపించిన సందర్భాలు అరుదు. ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా దీర్ఘకాలం పనిచేసిన ప్రస్తుత రాష్ట్ర గవర్నర్‌ వ్యవహారం అందుకు మినహాయింపుగా లేదు.



తివారి తన భర్త అని, తన తండ్రి అని తల్లీకొడుకులు ఇంతకుమునుపు న్యాయస్థానానికి వెళ్ళినా, రుజువులను వెల్లడించినా కేంద్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరించింది. న్యాయవ్యవస్థ కూడా గవర్నర్‌ పదవి హోదాను తక్కువ చేయరాదంటూ డిఎన్‌ఎ పరీక్షకు అనుమతించకుండా ఆ కేసు విచారణను పక్కన పెట్టింది. గవర్నర్‌ వ్యవస్థ గవర్నర్లకు కల్పిస్తున్న రక్షణ ఎలాంటిదో ఇది సూచిస్తున్నది. గవర్నర్‌ అనైతిక ప్రవర్తనను నిరసిస్తూ రాజ్‌భవన్‌ వద్ద ఆందోళన చేయడానికి శుక్రవారం పూనుకున్న మహిళా సంఘాల నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. రాజ్యాంగ పదవులు నిర్వహించే, రాజ ప్రతినిధి లాంటి గవర్నర్లకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడానికి అవకాశం లేదన్న ధోరణి ఇక్కడ కన్పిస్తోంది. గవర్నర్ల నియామకాలు ఏ ప్రాతిపదికన జరుగుతున్నాయో కళ్లెదుట స్పష్టంగా కన్పిస్తుండగా ఆ వ్యవస్థకు అంతటి ప్రత్యేక హోదా ఇవ్వడం అవసరమా? ఆలోచించాల్సిన విషయం.



అధికార వ్యవస్థ నాలుగు గోడల మధ్య జరుగుతున్న అనైతిక, అక్రమ, అవినీతి కార్యకలాపాలు కొన్ని అప్పుడప్పుడు వెల్లడవుతున్నా, అనేకం నిర్ధారించే అవకాశాలు, రుజువులు లేకుండా మరుగున పడిపోతున్నాయి. వ్యక్తిగత బలహీనతలకు, అధికార స్థానాలలో ఉండటానికి సంబంధం ఉండకపోవచ్చు. కాని అధికార బలంతో వచ్చే అవకాశాలకు వ్యక్తిగత బలహీనతలు, రాజకీయ, వ్యాపార స్వార్ధ ప్రయోజనాలు తోడైతే అనైతికత, అక్రమాలు, అవినీతి విశృంఖలంగా తయారవుతాయి. ఇవి వ్యవస్థాగత రుగ్మతలలో భాగమే. అధికార వ్యవస్థలో ఎవరి నుండి తమకు పనులు జరగాలనుకుంటారో వారి బలహీనతలను గుర్తించి వాటికి అనుగుణంగా బేరాలు, ప్రలోభాలతో ఎరవేయటం పైరవీకారులు, మోసకారులు సాధారణంగా అనుసరిస్తున్న మార్గమే.



ఈ బేరాలు రెండు వైపులా జరుగుతాయి. రాజకీయ, బ్యూరోక్రాటిక్‌, కార్పొరేట్‌ వ్యవస్థలకు మధ్య ఉన్న అపవిత్ర పొత్తు దీనికి పరాకాష్ట. ఈ అక్రమాల నుండి ఒకరినొకరు రక్షించుకునే ధోరణికి న్యాయంగా తమ పనుల కోసం వచ్చే వారి బలహీనతను, అవసరాలను ఆసరా చేసుకుని అవినీతి, అనైతిక చర్యలకు వారిని ఒత్తిడి చేసి, బెదిరించి, లొంగదీసుకునేందుకు అధికార స్థానాలలో ఉన్నవారిలో అవినీతిపరులు, వారి తైనాతీలుగా ఉన్నవారు నడుపుతున్న వ్యవహారాలు కూడా అప్పుడప్పుడు బయట పడుతున్నాయి. పైరవీలకు ముడుపులు తీసుకుని, బెదిరించి మహిళలను లొంగదీసుకున్న వ్యవహారాలలో ఇరుపక్షాల మధ్యగాని, భాగస్వాముల మధ్యగాని తీవ్ర విభేదాలు వచ్చి లుకలుకలు బయటపడుతున్న సందర్భాలు ఉంటున్నాయి. వ్యక్తులుగా ఎవరి బలహీనతలు ఏమైనా, ప్రజా జీవితంలో, అధికార స్థానాలలో ఉన్నవారి నడవడిక, వ్యవహారాలు సమాజం దృష్టిలో ఉంటాయి. వారు ప్రజలకు జవాబుదారీగా, ఆదర్శవంతంగా ఉండాలి.



అత్యున్నత స్థానాలలో ఉన్నవారి విషయంలో ఆ పదవుల స్థాయిని, గౌరవాన్ని, విశ్వసనీయతను నిలబెట్టే విధంగా వారి నడవడిక, వ్యవహారాలు ఉండాలి. కనుక నియామకం చేసేటప్పుడే కాదు, వారిపై ఆరోపణలు వచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. రాష్ట్రపతి తగిన నిర్ణయం చేయడానికి దోహదపడాలి. ఆరోపణల తీవ్రతను బట్టి గవర్నర్‌ను వెంటనే వెనుకకు పిలిచేందుకు, ఆ పదవి నుండి తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌పై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమయినవి. వీటిపై సమగ్ర విచారణ జరిపించాలి. తప్పుడు వ్యవహారాలు జరిగినట్లు తేలితే, తప్పు చేసిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. గవర్నర్‌ వ్యవస్థకున్న ప్రత్యేక హక్కులను రద్దు చేసి, జవాబుదారీతనానికి వీలు కల్పించాలి. అసలు గవర్నర్‌ వ్యవస్థనే రద్దుచేసే విషయాన్ని కూడా పరిశీలించాల్సిన ఆవశ్యకత నేడు ఎంతైనా ఉంది.

Thursday, 19 November 2009

అమెరికా దూకుడుకు పగ్గం వేసిన సంక్షోభం

కమ్యూనిస్టు చైనాను అమెరికా గుర్తించి మూడుదశాబ్దాలు గడిచింది. మొత్తంగా చూస్తే ద్వైపాక్షిక సంబంధాల త్రాసు చైనా వైపే మొగ్గిందని జర్మన్‌ పత్రిక డెర్‌స్పీగల్‌ వ్యాఖ్యానించింది. చైనా వద్ద ఉన్న విదేశీ కరెన్సీలో మూడింట రెండువంతులు అమెరికన్‌ డాలర్లే. అమెరికా గనుక తిక్క వేషాలు వేస్తే చైనా ప్రతిఘటనకు పూనుకుంటే డాలర్‌ అల్లకల్లోలం అవుతుంది. ఒక వేళ అమెరికా ఆర్థిక సంక్షోభం ముదిరి డాలర్‌ పతనమైతే చైనా కూడా భారీగా నష్టపోవటం అనివార్యం. అందుకే డాలర్‌ స్థానంలో మరో కరెన్సీని ఉనికిలోకి తెచ్చే యత్నాలను చైనా ప్రోత్సస్తున్నది.


గతంలో చైనా పర్యటించిన అమెరికా అధ్యక్షులు. మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌ మాఇంటికొస్తే మాకేం తెస్తావ్‌ అన్న రీతిలో వ్యవహరించేవారు. ప్రస్తుత అధ్యక్షుడు బరాక్‌ హుస్సేన్‌ ఒబామా పర్యటన మౌలికంగా కాకున్నా ఒక ఎత్తుగడగా గతానికి భిన్నం. చైనాను డిమాండ్‌ చేయగలిగిన స్థితి నేడులేదు. చైనాకు ఆగ్రహం కలిగించకుండా ఉండేందుకే గతనెలలో దలైలామా అమెరికా పర్యటన సందర్భంగా ఆయనతో భేటీకి సిద్ధం కాలేదు. ఆరురోజుల ఒబామా పర్యటన 13వ తేదీన జపాన్‌తో ప్రారంభమై 18న దక్షిణ కొరియాతో ముగుస్తుంది. ఆ సందర్భంగా చైనా తమకు ఒక కీలకమైన భాగస్వామిగా ఉండటంతో పాటు స్నేహపూర్వకమైన పోటీదారుగా కూడా ఉందని ఒబామా పేర్కొన్నాడు. చైనా పురోగమనాన్ని అడ్డుకోవాలని తాము అనుకోవటం లేదన్నారు. ఉభయదేశాల మధ్య ఉన్న ఆర్థిక అసమతూకాన్ని సరిచేయని పక్షంలో అనేక ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు. మూడురోజుల చైనా పర్యటనలో భాగంగా ఆదివారం నాడు షాంఘైకార్యక్రమాలలో పాల్గొన్న ఒబామా సోమవారం నాడు బీజింగ్‌ చేరుకున్నారు.



తామేంటో, తమశక్తేంటో చెప్పకుండానే చేసి చూపటంలో చైనీయులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. జూనియర్‌ బుష్‌ తాను అధికారంలో ఉన్న ఎనిమిది సంవత్సరాలూ ఓడిపోయినా తనదే పైచేయి అన్నట్లుగా నానా హంగామా చేశాడు. ఒబామా అలా చేయాలన్నా మారిన పరిస్థితులు అందుకు సహకరించేవిగా లేవు. అయితే సింహం దెబ్బతిన్నప్పటికీ దాని సహజలక్షణం కోల్పోదు. అమెరికా కూడా అంతే. తమ దగ్గర ప్రారంభమై ప్రపంచానికంతటికీ పాకించిన ఆర్థిక సంక్షోభంతో తాము ఒళ్లుదగ్గర పెట్టుకోకపోతే నష్టపోయేది తామే అని ప్రస్తుతానికి అమెరికన్లు తెలుసుకున్నట్లు ఈ పర్యటన సందర్భంగా ఒబామా చేస్తున్న ప్రకటనలు ఉన్నాయి. చైనా-అమెరికా విరోధులు కావని ఒకటికి రెండుసార్లు పేర్కొన్నారు. మాయలపకీరు ప్రాణం సప్త సముద్రాల అవతల మర్రి చెట్టు తొర్రలోని చిలకలో ఉందన్నట్లుగా ఇప్పుడు అమెరికా జీవనాడులు చైనా చేతుల్లో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అందుకే ఒక ఎత్తుగడగా అయినా స్నేహం కనపరుస్తున్నది. ఇదే సమయంలో చైనాకు ఉండే ప్రమాదాలు ఉన్నాయి.



చైనాలోని చాంగ్‌షాలో ఉన్న చైనా రక్షణ సాంకేతిక విశ్వవిద్యాలయం రూపొందించిన తైనహె అనే సూపర్‌ కంప్యూటర్‌ను ఒబామా పర్యటన సందర్భంగా విడుదల చేశారు. దాని శక్తి ఎంతంటే సెకనుకు లక్షకోట్లకు పైగా సమస్యలను పరిష్కరించగలుగుతుంది. ఓ అమెరికా నీవేకాదు, మేం కూడా నీవద్ద ఉన్న సూపర్‌ కంప్యూటర్లకు తీసిపోని వాటిని తయారు చేయగలం అని చెప్పటమే దీని ఉద్ధ్యేశం. అమెరికాతో సహా పశ్చిమ దేశాలు సంక్షోభం నుంచి ఎప్పటికి బయటపడతాయో తెలియని స్థితిలో ఉండగా చైనా మాత్రం ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో తొమ్మిదిశాతం అభివృద్ధిని నమోదు చేసింది. ఈ శతాబ్ది మధ్యనాటికి తాము ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టగలిగిన సైనికపాటవాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించుకోగలమని కూడా ఒబామా పర్యటనకు ముందు చైనా వైమానిక దళాధిపతి క్జు క్విలాంగ్‌ రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ఇది చైనా దౌత్యానికి నిదర్శనం.



కమ్యూనిస్టు చైనాను అమెరికా గుర్తించి మూడుదశాబ్దాలు గడిచింది. మొత్తంగా చూస్తే ద్వైపాక్షిక సంబంధాల త్రాసు చైనా వైపే మొగ్గిందని జర్మన్‌ పత్రిక డెర్‌స్పీగల్‌ వ్యాఖ్యానించింది. చైనా వద్ద ఉన్న విదేశీ కరెన్సీలో మూడింట రెండువంతులు అమెరికన్‌ డాలర్లే. అమెరికా గనుక తిక్క వేషాలు వేస్తే చైనా ప్రతిఘటనకు పూనుకుంటే డాలర్‌ అల్లకల్లోలం అవుతుంది. ఒక వేళ అమెరికా ఆర్థిక సంక్షోభం ముదిరి డాలర్‌ పతనమైతే చైనా కూడా భారీగా నష్టపోవటం అనివార్యం. అందుకే డాలర్‌ స్థానంలో మరో కరెన్సీని ఉనికిలోకి తెచ్చే యత్నాలను చైనా ప్రోత్సస్తున్నది. ఈ ఏడాది సెప్టెంబరు నెలలో అమెరికా టైర్ల కంపెనీల యాజమాన్యాలు చైనా నుంచి దిగుమతి అవుతున్న టైర్లపై ధ్వజమెత్తాయి. వారి వత్తిడికి లొంగి 35శాతం దిగుమతి పన్ను విధించటానికి సిద్ధపడ్డాడు. మాటైర్లపై పన్ను వేస్తే మీ ఆటోమొబైల్స్‌, కోడిమాంసం సంగతి ఒక్కసారి ఆలోచించుకోండని చైనా హెచ్చరించటంతో తోకముడవక తప్పలేదు.



చైనా వద్ద ఉన్న డాలర్లను అప్పుగా తీసుకోకపోతే అమెరికాకు నేడు గడిచే స్థితిలేదు. అమెరికా జారీ చేసిన సెక్యూరిటీలలో నాలుగోవంతు చైనా వద్ద ఉన్నాయి. చైనా విదేశీ కరెన్సీ నిల్వలు రెండులక్షల కోట్ల డాలర్లకు పెరిగాయి. దీనికంటే చైనాలో తయారయ్యే వస్తువులు చౌకగా ఉన్నందున అమెరికాకు ద్రవ్యోల్బణం సమస్యలు పరిమితంగా ఉన్నాయి. చైనా తన స్థూలజాతీయోత్పత్తిలో 13శాతం ఉద్దీపన పథకాలకింద ఖర్చు చేస్తున్నది. ఇది అమెరికా చేసిన ఖర్చు కంటే రెండింతలు, జర్మనీ కంటే ఐదురెట్లు ఎక్కువ.అమెరికా ఉద్దీపన అంటే దివాళాతీసిన బ్యాంకులను ఆదుకోవటమే. నిరుద్యోగులైన కోట్లమంది గురించి పట్టించుకోవటం లేదు. పర్యావరణం పేరుతో అమెరికా గనుక రాయితీలను డిమాండ్‌ చేస్తే తాము ప్రపంచంలో డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మరొక కరెన్సీని ఉనికిలోకి తెచ్చేందుకు మద్దతు ఇస్తామని చైనీయులు పరోక్షంగా హెచ్చరించారు.



అందువలన గతం కంటే ఇప్పుడు చైనాపై అమెరికా ఆధారపడటం మరింత పెరిగింది. అమెరికా జీవన విధానం చైనాలో తయారవుతున్నదని యూరోపియన్లు అమెరికన్లపై జోకులేస్తున్నారు. అమెరికా ప్రపంచ పెట్టుబడిదారీ విధానానికి ఇంజను వంటిది. విశ్వ శాంతి, సంపదలకు తాము చెబుతున్న మార్కెట్‌ ఆర్థిక విధానమే శరణ్యమని అమెరికన్లు దశాబ్దాల తరబడి చెబుతున్నదంతా తాజా ఆర్థిక సంక్షోభంతో కొట్టుకుపోయింది. మరోవైపు చైనా తన విధానాలతో ఐరోపాలో అనేక మంది అభిమానులను సంపాదించుకోవటమే కాదు, ఆఫ్రికాలో తన పలుకుబడిని పెంచుకుంది. లాటిన్‌ అమెరికాలో దాని ప్రభావం నానాటికీ పెరుగుతున్నది. ఆ ప్రాంత దేశాలలో పెద్దదైన బ్రెజిల్‌ ప్రధాన వాణిజ్య భాగస్వామిగా నేడు చైనా అవతరించింది.



ఇదే సమయంలో చైనా ఇప్పటికీ అమెరికాతో పోలిస్తే ఇంకా ఎంతో వెనుకబడి ఉందన్న విషయాన్ని విస్మరించరాదు. ప్రపంచంలో అమెరికా అతిపెద్ద మిలిటరీ శక్తిగా ఉంది. చైనాలోని తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌కు ఏటా ఆధునిక ఆయుధాలను సమకూర్చుతున్నది. టిబెట్‌ వేర్పాటువాదులకు మద్దతునిస్తున్నది. చైనాలో మానవ హక్కుల గురించి మాట్లాడుతూనే ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తాజాగా ప్రకటించినదాని ప్రకారం 1990 నుంచి 2009 వరకు చైనా జిడిపి 536శాతం పెరగ్గా ఇదే కాలంలో అమెరికాలో పెరుగుదల 61శాతమే. అయినప్పటికీ తలసరి ఆదాయంలో 46,443డాలర్లతో అమెరికా ఎంతో ముందుంది. చైనాలో 3,566 డాలర్లు ఉంది. ఇదే సమయంలో అమెరికాలో వృద్దిరేటు సగటున 2.8, అప్పు 3.4లక్షల కోట్ల డాలర్ల విదేశీ అప్పుతో సహా మొత్తం అప్పు 13లక్షల కోట్ల డాలర్లు, చైనాకు చేస్తున్న ఎగుమతులు 69.7 బిలియన్‌ డాలర్లు, చైనాతో వాణిజ్యలోటు 268 బిలియన్‌ డాలర్లు ఉంది.



మరోవైపున చైనాలో అభివృద్ధిరేటు తొమ్మిదిశాతం, విదేశీ మారకద్రవ్యనిల్వలు 2.3లక్షల కోట్ల డాలర్లు, అమెరికాతో వాణిజ్యమిగులు 268 బిలియన్‌ డాలర్లు ఉంది. రానున్న కొద్ది రోజుల్లో రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్‌ స్థానాన్ని చైనా ఆక్రమించనుందని కొందరు చెబుతున్నారు. ఈ కారణంగానే చమురు సంపదలున్న అరబ్బు దేశాలతో సహా ప్రపంచదేశాల రాజధానుల్లో అమెరికా కంటే చైనాతో కరచాలనం చేయటమే ఎక్కువ లాభమనే వాతావరణం క్రమంగా పెరుగుతున్నది.

Wednesday, 18 November 2009

శాస్త్రవేత్తలలో అశాస్త్రీయతం ఎందుకుంటోంది?




•పాలకవర్గాలలో మార్పు వచ్చేటందుకు పోరాడుతూనే, తక్షణ చర్యగా విద్యార్థులకు మూఢనమ్మకాల వెనుకనున్న అశాస్త్రీయతను వివరించి, వాటిని పోగొట్టే శాస్త్రీయ అవగాహనను విడమర్చి చెప్పాలి. శాస్త్రీయతను పెంచే పుస్తకాలు కూడా కథలు, సంఘటనలతో కూడి ఆసక్తికరంగా వస్తున్నాయి. అలాంటి పుస్తకాలను చదవమని వారిని ప్రోత్సహించాలి. ఆ పుస్తకాలు విద్యార్థుల పాలిటి బి కాంప్లెక్స్‌ మాత్రలుగా పనిచేస్తాయి. పై కార్యక్రమాన్ని సైన్సు కార్యకర్తలైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, దీక్షతో ఆచరిస్తే కనీసం భావితరాన్నైనా కాపాడుకోగలం.

.''రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ'' (డిఆర్‌డిఓ)లో సీనియర్‌ శాస్త్రవేత్తలు ఎం కామేశ్వరరావు, ఎ ఎస్‌ఎస్‌వీ భాస్కర్‌లు నరబలిపేరిట జూనియర్‌ శాస్త్రవేత్త సుశీల్‌ కుమార్‌ను హత మార్చేందుకు ప్రయత్నించారు. అయితే సుశీల్‌కుమార్‌ తప్పించుకున్నారు. సీనియర్‌ శాస్త్రవేత్తలపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.


(ఆంధ్రజ్యోతి 13.10.09)


''హైదరాబాద్‌ నగరంలో జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయంలో, సాంకేతిక విద్యాధికులందరి సమక్షంలో, పరిపాలనా భవనం నాలుగుమూలలా నాలుగు జంతువలను బలి ఇవ్వడం జరిగింది''


(ఈనాడు 16-10-94)


పై రెండు వార్తలే కాదు. పత్రికలలో శాస్త్రవేత్తలు, సాంకేతిక విద్యావేత్తల అశాస్త్రీయ చర్యలను గూర్చిన అనేక దిగ్భ్రాంతికరమైన వార్తలు నెలకొకటైనా వింటున్నాము. ఎందుకిలా జరుగుతోంది? నిరక్షరాస్యులు చేతబడులు నమ్ముతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. వారి నిరక్షరాస్యతే ఈ అజ్ఞానానికి దారితీసిందని సమాధానపడవచ్చు. కాని శాస్త్రాలను ఔపోసన పట్టినవారు, విద్యావికాసంతో పదిమందికీ తోవ చూపవలసిన వారు నరబలివంటి అమానుష చర్యలను ఎలా నమ్మి ఆచరిస్తున్నారు? వాటికి కారణాలేమిటి? ఈ అంశాలను పరిశీలిద్దాం.



మన రాజ్యాంగం-51ఎ (హెచ్‌) ఆర్టికల్‌ ప్రకారం ప్రజలలో శాస్త్రీయ అవగాహనను పెంపొందించడం ప్రతి ఒక్క పౌరుని బాధ్యత. అలాంటి అవగాహనను పెంపొందించడానికి ఉత్తమ సాధనం విద్య, ''జాతి నిర్మాణం తరగతి గదిలోనే జరుగుతుందని'' కోఠారి సెలవిచ్చారు. అలాంటి తరగతి గదుల్లో ఎక్కడా శాస్త్రీయ అవగాహనను పెంపొందించే విధానాలు అమలు కావడం లేదు. 1వ తరగతి నుండి పదవ తరగతి వరకూ ఏ క్లాసులోనూ, సిలబస్‌లో సమాజంలో నెలకొని ఉన్న మూఢ నమ్మకాలను ఖండించి శాస్త్రీయ అవగాహనను పెంపొందించే ఒక్క అంశం కూడా చేర్చడం జరగలేదు. పైగా మానవ పరిణామాన్ని గూర్చిన శాస్త్రీయ అవగాహనను పెంపొందించే ''డార్విన్‌ పరిణామవాదం వంటి పాఠాలు 10వ తరగతిలోపు ప్లిలలకు అందకుండా, సిలబస్‌ ఉండి తీసివేయడం జరిగింది. దానితో ఇంటర్‌లో బయాలజీ సబ్జెక్టు తీసుకోని విద్యార్థులు భవిష్యత్తులో పెద్ద ఇంజనీర్లయినా, ఛార్టర్‌ ఎకౌంటెంట్లయినా, గణితశాస్త్ర పార్టంగతులయినా సృష్టి, పరిణామం వంటి అంశాలకు సంబంధించినా శాస్త్రీయ వివరణలు తెలియకుండానే పెద్దవారౌతున్నారు. ఇక రెండో పక్క జ్యోతిష్యం, వాస్తుల వంటి అశాస్త్రీయ అంశాలలో డిగ్రీలు, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులు, డాక్టరేట్లు విశ్వవిద్యాలయాలలో కోట్లాది రూపాయల ప్రభుత్వ ఖర్చుతో ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. జ్యోతిష్య శాస్త్రం కాదని స్టీఫెన్‌ హాంకింగ్‌ వంటి ప్రముఖ శాస్త్రజ్ఞునితో సహా ఈ ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు వందలాది మంది బహిరంగ ప్రకటనలు చేసినా, వివేకానందుడు, దయానంద సరస్వతి, పోప్‌జాన్‌ పాల్‌ వంటి మత నాయకులు ''జ్యోతిషం ఒక మార్మిక కళ, దానిని నమ్మవద్దు'' అని హెచ్చరించినా జ్యోతిష్యం ఒక పాఠ్యాంశంగా విశ్వవిద్యాలయాల్లో రోజురోజుకూ బలంగా పాదుకుంటోంది. అలాగే వాస్తు కూడా. వాస్తు ఫలితాన్ని గూర్చి రాస్తూ పండింతులేమన్నారంటే ''పక్షేన, మాసేర, రుతుక్రమేణా, సంవత్సరేణా పిఫలం విధత్తే'' అని. అంటే వాస్తు ఫలితం ''పక్షం రోజుల్లో (అంటే 15 రోజుల్లో) గాని, నెల రోజుల్లో గాని, 6 నెలల్లో గాని, సంవత్సరంలో గాని సిద్ధిస్తుంది. ''అని అర్థం. ఎప్పుడో ఒకప్పుడు కీడు మూడుతుందని చెప్పడం శాస్త్రమా? ఫలానా వాస్తు దోషం వల్ల ఫలానా కీడు కచ్చితంగా ఫలానా కాలంలో జరుగుతందని చెప్పడం శాస్త్రమా? ఇలాంటి అశాస్త్రీయ అంశాలన్ని ''వాస్తు శాస్త్రం''గా పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టడం జాతి భవిష్యత్తుకు ఎంత కీడును కలిగిస్తుంది? పాలకులకు ఇలాంటి అశాస్త్రీయ విషయాలపైన నమ్మకముండటమే దేశానికి ప్రమాదకరం. వారు రాజ్యాంగాన్ని గౌరవించే రైతే ప్రజాశ్రేయస్సును కాంక్షించే వారైతే ఇలాంటి అశాస్త్రీయ విషయాలను నేరుగా డిగ్రీస్థాయిలో ప్రవేశపెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేయరు. దానికంటే, 1,2 కోట్లయినా సరే వెచ్చించి, కొందరు పరిశోధకులను నియమించి 5 సంవత్సరాలపాటు జ్యోతిష్య వాస్తు పండితుల జ్యోష్యాలన్నింటినీ పరిశోధించి, వాటిలో కనీసం 90శాతం సరైనవేనని తేలితే ఆ అంశాలను శాస్త్రీయ అంశాలుగా భావించి బోధించవచ్చు. (అసలు సైన్సు అంశం అంటే పరిశోధనా ఫలితాలు నూటికి నూరు సరైన, ముందుగా ఊహించిన ఫలితాలు వస్తేనే శాస్త్రీయ విషయం అంటాం) అలా కాకుండా ఏమిటీ ప్రజాధన దుర్వినియోగం? రాజ్యాంగ వ్యతిరేక భావజాల ప్రచారం?



కౌటిల్యుడు తన అర్థంశాస్త్రంలో ''రాజుకు మూఢ నమ్మకాలుండకూడదు గాని ప్రజలలో మూఢ నమ్మకాలు పెంచడానికి తీవ్రంగా యత్నించా''లంటాడు. 'దానికై రాజు గూఢచారుల ద్వారా ఏమేమి చర్యలు చేపట్టాలో'' సూచిస్తాడు. మన పాలకవర్గాలు దానిని బాగా వంట బట్టించుకుని అమలు చేస్తుండటం ప్రజలలో అశాస్త్రీయ భావాలు పెరగడానికి రెండో కారణం. కాకపోతే రాష్ట్రపతి, ముఖ్యమంత్రుల నుండి డి.జి.పిల వరకూ వివాదాస్పదులుగా, మేజిక్‌ నిపుణులుగా, భూకబ్జాదారులుగా పేరొందిన స్వామిజీలు, బాబాలకు పాదాభివందనాలు ఎందుకు చేస్తారు?



మూఢ నమ్మకాల పెంపులో పాలవర్గాలకు చెందిన ప్రచార, ప్రసార సాధనాల వాటా కూడా చాలా ఉంది. మూఢ నమ్మకాలకు సంబంధించిన వార్తలను బాక్సులు కట్టి మరీ ప్రచురించిన పత్రికలు, వాటిపై పరిశోధన చేసి వాస్తవాల్ని వివరిస్తూ రాసిన లేఖలను, వ్యాసాలను బుట్టదాఖలు చేయడం ఈ రచయిలతో సహా అనేకమంది సైన్సు ప్రచారకుల అనుభవం. ఇక టి.వి ఛానళ్లు దయ్యాలు, చేతబడులు, అతీతశక్తుల కథలతోను, వారంవారం వచ్చే జ్యోతిష్య విశేషాలతోనూ, పసివారి నుండి వృద్ధుల వరకు ప్రజల మనస్సులను ఆక్రమిస్తున్నాయి. వాటి ప్రభావం ప్రజలు తేరుకోలేకపోతున్నారు. ఇన్ని రకాల ప్రభావాల కారణంగా సైన్సులో డాక్టరేట్‌లు సంపాదించిన వారు కూడా అశాస్త్రీయ భావజాలం నుండి బయటపడలేకపోతున్నారు. అందుకే నరబలి, జంతుబలులకు కూడా పూనుకుంటున్నారు.


ఈ పరిస్థితుల్లో సైన్సు కార్యకర్తలేం చేయాలి?


సిలబస్‌లో అశాస్త్రీయ అంశాలను ఉపసంహరించి, శాస్త్రీయ అంశాలను జొప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడం, ఉద్యమించడం, దానిని సాధించడం దీర్ఘకాలిక కార్యక్రమం. అప్పటిదాకా కార్యకర్తలు ఏమి చెయ్యకుండా ఊరకుండకూడదు. అన్నంలోకి దంపుడు బియ్యం దొరకకపోతే బి విటమిన్‌ చాలక అనేక జబ్బులు వస్తాయి. అందుకని దంపుడు బియ్యం దొరికే వరకు వేచి ఉండక, రోజుకొక్క బి కాంప్లెక్స్‌ మాత్రను వేసుకుంటాం. అదేరకంగా పాలకవర్గాలలో మార్పు వచ్చేటందుకు పోరాడుతూనే, తక్షణ చర్యగా విద్యార్థులకు మూఢనమ్మకాల వెనుకనున్న అశాస్త్రీయతను వివరించి, వాటిని పోగొట్టే శాస్త్రీయ అవగాహనను విడమర్చి చెప్పాలి. శాస్త్రీయతను పెంచే పుస్తకాలు కూడా కథలు, సంఘటనలతో కూడి ఆసక్తికరంగా వస్తున్నాయి. అలాంటి పుస్తకాలను చదవమని వారిని ప్రోత్సహించాలి. ఆ పుస్తకాలు విద్యార్థుల పాలిటి బి కాంప్లెక్స్‌ మాత్రలుగా పనిచేస్తాయి. పై కార్యక్రమాన్ని సైన్సు కార్యకర్తలైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, దీక్షతో ఆచరిస్తే కనీసం భావితరాన్నైనా కాపాడుకోగలం.

Note:Article took from Prajasakti paper Written by kantharao

Tuesday, 10 November 2009

బెర్లిన్‌ గోడతో పాటు బతుకఁలూ కూలాయి

ఇల్లలకగానే పండగ కాదు అన్నట్లుగా బెర్లిన్‌ గోడను కూల్చగానే పెట్టుబడిదారీ విధానం జయించినట్లు కాదని ఆ విధానాన్ని సమర్ధించేవారే చెబుతున్నారు. బెర్లిన్‌ గోడతో పాటు తూర్పుఐరోపా వాసుల బతుకులు కూడా కూలిపోయాయి. తెల్లవారే సరికి అనేక మంది దరిద్రులయ్యారు. తామొక మానవ సమాజంలో ఉన్నామన్న స్పృహను జనం కోల్పోయారని, కుటుంబవిలువలు దిగజారాయాని, చివరికి మతాన్ని కూడా పట్టించుకోకుండా వినిమయతత్వానికి గురయ్యారని చింతిస్తున్నారు. బెర్లిన్‌ గోడను కూల్చివేసి తూర్పు జర్మనీని పశ్చిమజర్మనీ కబళించి సోమవారం నాటికి ఇరవై సంవత్సరాలు నిండాయి. ఈ సందర్భంగా జర్మనీ ప్రభుత్వం గోడకూల్చివేత ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించింది. జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌, అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌, ఫ్రెంచి అధ్యక్షుడు సర్కోజీ, బ్రిటన్‌ ప్రధాని గార్డన్‌ బ్రౌన్‌ ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు.



సోవియట్‌ మాజీ అధ్యక్షుడు గోర్బచెవ్‌, మెర్కెల్‌ చెట్టాపట్టాలేసుకొని కూల్చివేసిన గోడ ప్రాంతంలో కొంతదూరం నడిచే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. తమ దేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంద్యాన్ని పరిష్కరించటంలో విఫలమై దిక్కుతోచని నాయకులు జనం దృష్టిని కొద్దిసేపైనా మళ్లించేందుకు దీనిని ఒక అవకాశంగా తీసుకున్నారు. అయితే వారి సంతోషంపై బ్రిటీష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌(బిబిసి) సంస్థ నిర్వహించిన సర్వే అంశాలు నీళ్లుపోశాయి. ప్రపంచవ్యాపితంగా 27 దేశాల పౌరులనుంచి సేకరించిన అభిప్రాయాలు వారికి వణుకు పుట్టించేవిగా ఉన్నాయి. ఎనభైతొమ్మిది శాతం పెట్టుబడిదారీ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యధికులు ఇప్పటికీ సోషలిస్టు విధానమైన సంపదలను సమంగా పంపిణీ చేసే ప్రభుత్వ విధానం కావాలని కోరుతున్నట్లు స్పష్టం చేశారు.



ఈ సర్వేలో భాగస్వామి అయిన గ్లోబ్‌స్కాన్‌ అధ్యక్షుడు డౌగ్‌ మిల్లర్‌ సర్వే ఫలితాల గురించి వ్యాఖ్యానిస్తూ '' అప్పుడు అందరూ అనుకున్నట్లుగా, ముఖ్యంగా గత ఏడాదికాలంలో జరిగిన పరిణామాలను చూస్తే 1989లో బెర్లిన్‌ గోడ కూల్చివేత స్వేచ్ఛామార్కెట్‌ పెట్టుబడిదారీ విధానానికి ఘనవిజయంగా కనపడటం లేదు.'' అన్నారు. సోషలిస్టు విధానంలోని సంపదలను సమంగా పంపిణీ చేయటం వంటి అంశాలు ఇప్పటికీ ప్రపంచంలో ఎందరినో ఆకర్షిస్తున్నాయని మరో భాగస్వామ్య సంస్థ 'పిపా' ప్రతినిధి స్టీవెన్‌ కుల్‌ వ్యాఖ్యానించారు. కేవలం పదకొండుశాతం మాత్రమే పెట్టుబడిదారీ విధానంగా బాగా పనిచేస్తున్నదని చెప్పారు. అమెరికాలో 25శాతం, పాకిస్తాన్‌లో 21 మంది అత్యధికంగా సమర్థించిన వారున్నారు. మార్కెట్‌ పెట్టుబడిదారీ విధానంలోప భూయిష్టమైనదని దాన్ని సంస్కరించటం, అదుపులో ఉంచాలని అత్యధికులు అభిప్రాయపడ్డారు.



ప్రభుత్వం మరింత చురుకైన పాత్ర వహించాలని లేదా పెద్దపరిశ్రమలకు యజమానిగా ఉండాలని 15దేశాల వారు చెప్పటం విశేషం. ఇలా చెప్పిన వారిలో పూర్వపు సోషలిస్టు రిపబ్లిక్‌లైన రష్యా, ఉక్రెయిన్‌తో బ్రెజిల్‌, ఇండోనేషియా, ఫ్రాన్స్‌కు చెందిన వారు 77 నుంచి 57శాతం వరకు ఉన్నారు. ఇరవైరెండు దేశాలకు చెందిన వారిలో మూడింట రెండువంతుల మంది ప్రభుత్వాలు సంపదలను సమంగా పంపిణీ చేయాలని చెప్పారు. సోవియట్‌ కూలిపోవటం చెడుపరిణామమని 22శాతం చెబితే తమకు దాని గురించి తెలియదని 24శాతం పేర్కొన్నారు. ధనిక దేశాలైన అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడాలకు చెందినవారు మాత్రమే మంచిపరిణామం అని ఎక్కువ మంది చెప్పారు. ఈజిప్పు వంటి దేశాలలో 69శాతం మంది హానికరమని తెలిపారు. ఈ సర్వే నిర్వహించిన బిబిసి గానీ, దానికి సహకరించిన వారు గానీ సోషలిజం, కమ్యూనిజాన్ని సమర్థించేవారు కాదని గ్రహించాలి.



తూర్పు ఐరోపాలో సోషలిస్టు వ్యవస్థలను కూల్చేందుకు పెద్ద కుట్ర జరిగిందని, దానిలో అమెరికాతో పాటు వాటికన్‌ చర్చి కీలకమైన పాత్ర నిర్వహించిందని అప్పుడు కమ్యూనిస్టులు చెబితే నిరాకరించిన వారు ఇప్పుడు పునరాలోచించుకోవాలి. బెర్లిన్‌ గోడ కూల్చివేత 20వ వార్షికోత్సవం సందర్భంగా జర్మన్‌ పత్రిక 'డెర్‌స్పీగల్‌' పోలెండ్‌ సాలిడారీటీ నాయకుడు లెచ్‌వాలేసాను ఇంటర్వ్యూ చేసింది. తమకు అనేక ఇతర దేశాల నుంచి మద్దతు లభించిందని ముఖ్యంగా పోప్‌ కీలకమైన పాత్ర వహించాడని ఒక్క పోలాండ్‌లోనే గాక అనేక చోట్ల ప్రార్ధనల ద్వారా సమీకరణ చేశాడని వాలేసా చెప్పాడు. మేం ఆందోళన ప్రారంభించేటపుడు ఇప్పుడు మనం చూస్తున్న పోలాండ్‌, ఐరోపాను చూడగలమని చెబితే నేనసలు నమ్మలేదు. అయినప్పటికీ ఇప్పుడు వెనుదిరిగి చూసుకుంటే మేం కోల్పోయిన అవకాశాలన్నీ కనిపిస్తున్నాయి. నాకు సంతృప్తిగా లేదు, నేనెప్పుడూ చెబుతుంటాను నేను జరిగిందానికి అనుకూలం ఇదే సమయంలో దానికి వ్యతిరేకం కూడా అని.



మేం కోల్పోయిన అవకాశాల గురించి చెబుతాను. ప్రజాస్వామ్యం మూడు అంశాలతో కూడుకున్నది. ఒకటి బహుళత్వ సిద్ధాంతాలకు చట్టాలు మద్దతు ఇస్తున్నాయా లేదా అన్నది, రెండవది ఈ చట్టాలను పౌరులు ఉపయోగించుకోగలుగుతున్నారా లేదా? మూడవది ఈ ప్రజాస్వామ్యం ద్వారా జనం తమ పర్సులు నిండుగా ఉండటానికి తోడ్పడిందా లేదా అన్నది చూడాలి. పోలండ్‌లో ప్రజాస్వామ్యానికి చట్టపరమైన పునాది ఉంది. అయితే ఇంతవరకు దానిని పూర్తిగా వినియోగించుకున్నట్లు మేం రుజువు చేయలేదు. ఇక మా పర్సుల విషయానికి వస్తే గతం కంటే పరిస్థితి ఘోరంగా దిగజారింది. సోషలిస్టు వ్యవస్థలను కూలదోయటంలో ముఖ్యపాత్ర వహించిన విద్రోహి లెచ్‌వాలేసాయే స్వయంగా ఇలా చెప్పిన తరువాత సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాలలో ఇప్పటి పరిస్థితి ఎలా ఉందో చెప్పనవసరం లేదు. సామ్రాజ్యవాదులు తమ ప్రయోజనాలను నెరవేర్చుకొనేందుకు ఎవరినైనా పావులుగా వాడుకోవటానికి వెనకాడరు.



తూర్పు ఐరోపాలో కమ్యూనిజాన్ని కూలదోసిన పోప్‌ను, తమ సాలిడారిటీని గానీ ఎవరూ ఇప్పుడు కనీసం ప్రస్తావన కూడా చేయటం లేదని వాలేసా ఉక్రోషం వెలిబుచ్చాడు. ప్రజాస్వామ్యం పేరుతో తాను రాజకీయ ఓటమికి అంగీకరించకతప్పలేదని, అది నా తలరాత.... నిజమైన విప్లవకారుడి తలరాత కూడా అని చరిత్ర చెత్తబుట్టలో ఉన్న వాలేసా తన ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు.


అమెరికాతో సహా ఐరోపా ధనికదేశాలన్నీ సోవియట్‌, తూర్పు ఐరోపాలో సోషలిస్టు వ్యవస్థలను కూల్చివేయటంలో ఏకాభిప్రాయంతో ఉన్నాయి. అయితే బెర్లిన్‌ గోడ కూల్చివేత పేరుతో తూర్పు జర్మనీని పశ్చిమ జర్మనీ ఆక్రమించకూడదని ఆ దేశాలన్నీ కోరుకున్నాయి. అది విడిగానే ఉండేట్లు చూడాలని ఆ దేశాల వారు స్వయంగా గోర్బచెవ్‌కు సలహాయిచ్చినట్లు సోమవారం నాడు అమెరికా విడుదల చేసిన నాటి సిఐఏ ఇతర పత్రాలు వెల్లడించాయి. బెర్లిన్‌ గోడను నవంబరు తొమ్మిదిన కూల్చివేయటం ప్రారంభిస్తే అంతకు ముందే పశ్చిమదేశాల వారు జర్మనీ ఐక్యం కాకుండా చూడాలని గోర్చచెవ్‌ను కోరారు.



అప్పటి బ్రిటన్‌ ప్రధాని మార్గరెట్‌ థాచర్‌ 1989 సెప్టెంబరు 23న ' నాటో ప్రకటనలో తామేమి పేర్కొన్నప్పటికీ తూర్పు ఐరోపాను అసిరపరచాలని, బ్రిటన్‌, పశ్చిమ ఐరోపా కూడా జర్మనీ ఐక్యతను కోరుకోవటం లేదని గోర్బచెవ్‌తో థాచర్‌ చెప్పారని తమ సంభాషణను రికార్డు చేయవద్దని థాచర్‌ కోరారని అయితే తాను వెంటనే బయటకు వచ్చి వాటిని గుర్తుకు తెచ్చుకొని తన డైరీలో రాసుకున్నట్లు నాటి గోర్బచెవ్‌ సహాయకుడు చెర్నయెవ్‌ పేర్కొన్నాడు. ఇలాగే ఇతర అగ్రనాయకులతో గోర్బచెవ్‌ జరిపిన సంభాషణల వివరాలను కూడా అమెరికా బయట పెట్టింది. ఒకవైపు గోడను కూల్చివేస్తుండగా అదే సమయంలో సమావేశమైన సోవియట్‌ కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో అసలు దాని గురించి పట్టించుకోలేదంటే ఆ పార్టీ ఏ స్థితిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.చివరగా చెప్చొచ్చేదేమంటే తూర్పు జర్మనీని ఆక్రమించిన పశ్చిమ జర్మనీ ఒకే దేశంగా ఉన్నప్పటికీ రెండు దశాబ్దాల తరువాత కూడా తూర్పు జర్మన్లు పశ్చిమ జర్మన్లతో సమంగా లేరు.



ఆ ప్రాంతంలో నిరుద్యోగం, దారిద్య్రం ఎక్కువగా ఉంది. జర్మనీ ఐక్యతకంటే గర్వంగా చెప్పుకోవటానికి మరొకటి లేదని నాడు ఛాన్సలర్‌గా ఉన్న హెల్మట్‌ కోల్‌ అంటున్నారు. అయితే దీనివలన తమకెలాంటి లబ్ది కలగలేదని 34 శాతం మంది పశ్చిమ జర్మన్లు చెప్పినట్లు తాజా సర్వే వెల్లడించింది. తమను రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నారని 42శాతం మంది తూర్పు జర్మన్లు భావిస్తున్నారు. మాకు ప్రత్యేకతంటూ లేకుండా చేశారు. మా విద్యావ్యవస్థను మార్చివేశారు, జాతీయ పతాకం, గీతాన్ని రద్దు చేశారు, చివరికి ఉద్యోగాలను కూడా పోగొట్టారు. ఒకే తరహా ఉద్యోగం చేస్తున్న మాకు పశ్చిమ ప్రాంతంకంటే 20శాతం తక్కువ వేతనం ఇస్తున్నారు. పదిహేను లక్షల మంది తూర్పువారు పశ్చిమ ప్రాంతానికి వెళ్లి చిన్న చిన్న పనులు చేస్తున్నారు. వారికి అక్కడి వారికి ఇచ్చే దానిలో మూడోవంతు మాత్రమే చెల్లిస్తున్నారు. ఐక్యత పేరుతో తమ దేశాన్ని ఆక్రమించి తమను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారని తూర్పు జర్మన్లు భావిస్తున్నారు.

Monday, 12 October 2009

భారత్‌-చైనా మైత్రిని చెడగొట్టే ప్రయత్నాలు

మన పత్రికల్లోనూ, టివీ చానళ్లలోనూ ఇటీవల చైనా నుండి మనకు పెద్ద ప్రమాదం వస్తున్నదనే ప్రచారం ఊపందుకున్నది. సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌, లడక్‌ సరిహద్దుల్లో అనేక చోట్ల చైనా సైన్యాలు సరిహద్దులు దాటి భారత్‌ లోకి చొరబడుతున్నాయన్న వార్తలు మీడి యాలో ముప్పిరిగొంటున్నాయి. విశేషమే మంటే ఇటు భారత ప్రభుత్వమూ, భారత సైన్యంలోని ఉన్నతాధికారులూ, అటు చైనా అధికారులూ ఈ వార్తలను ఖండిస్తున్నా ఇటు వంటి వార్తలు రావడం ఆగడం లేదు. నిప్పు లేకుండా పొగరాదంటారు. కాని మన మీడి యాలో మాత్రం నిప్పులేకుండానే పొగవ స్తోంది. సెప్టెంబర్‌ రెండో వారంలో సిక్కింలోకి చొచ్చుకు వచ్చిన చైనా సైన్యానికీ, భారత్‌ టిబెట్‌ సరిహద్దు భద్రతా దళాలకూ (ఐటిబిపి) మధ్య కాల్పులు జరిగాయినీ, కాల్పుల్లో ఇద్దరు ఐటిబిపి జవాన్లు గాయపడ్డా రని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలో ఒక వార్త వచ్చింది. వెను వెంటనే 'టైమ్స్‌ నౌ' ఛానల్‌ ఒక ప్రత్యేక స్టోరీ ప్రసారం చేసింది.



దాంతో ఇతర పత్రికలూ, చానళ్లూ వార్తా కథనాలూ, విశ్లేషణలూ అందు కున్నాయి. కాని అటువంటి కాల్పులు జరగడం గాని, భారతీయ జవాన్లు గాయపడడం గాని జరగలేదని భారత సైనికాధికారులు, విదే శాంగ శాఖ మంత్రి కూడా ప్రకటించారు. అంతేకాదు గౌహతి, కొల్‌కొతా నుండి ఈ తప్పుడు వార్తలు ఇచ్చిన విలేకరులపై సరిహద్దు భద్రతా అధికారుల కేసులు పెట్టారు. వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయనున్నట్లు హౌమ్‌శాఖ కూడా ప్రకటించింది. హౌమ్‌ శాఖ, విదేశాంగ శాఖ అధికారులు, ఉన్నత స్థాయి సైనికాధికారులు పదేపదే ఈ వార్తలను ఖండించిన తరువాతగాని పరిస్థితి కొంతమేరకు సద్దుమణగలేదు. భారత్‌-చైనా సంబంధాలు గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత పటిష్టంగా, సుహ్రుద్భావంగా ఉన్న తరుణంలో ఇటువంటి వస్తున్నాయని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సిద్ధార్ధ వరదరాజన్‌ పేర్కొన్నారు.



భారత దేశం బయటివారు ఎవరైనా ఈ వార్తలు చూస్తే రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చేస్తోందని అనుకుం టారు అని బిబిసి హిందీ బ్యూరో ఎడిటర్‌ అమిత్‌ బారువా రాశారు. నిజంగానే చైనా నుండి చొరబాట్లు జరిగితే భారత ప్రభుత్వం వాటిని ధీటుగా ఎదుర్కొనాలి. అలాగే మన సరిహద్దులను శత్రు దుర్భేద్యంగా ఉంచడానికి సకల చర్యలూ తీసుకోవాలి. కాని అటువంటి ఘటనలేవీ జరగడం లేదని ప్రభుత్వ నేతలూ, ఉన్నత సైనికాధికారులూ ప్రకటిస్తున్నా పదేపదే ఇటువంటి ప్రచారం ముందుకు రావడమే నేటి విశేషం.


మీడియా అత్యుత్సాహమా?


అకస్మాత్తుగా దేశంలో ఇటువంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి? ఎవరు పుట్టిస్తున్నారు? ఇదంతా మీడియా అత్యుత్సాహమనీ, రేటింగ్స్‌ పెంచుకోడానికి సంచలనాత్మకవార్తలకోసం జరుగుతున్న పోటీవల్ల ఇలా అవుతోందనీ కొందరంటున్నారు. మీడియా అత్యుత్సాహం, సంచలనాలకోసం దాని తాపత్రయం కొంతమే రకు కారణం కావచ్చు కాని పనిగట్టుకుని జరుగు తున్న 'చైనాచొరబాటు' ప్రచారం వెనుక మీడియా అత్యుత్సాహానికి మించిన అనేక కారణాలు న్నాయని పరిశీలకులు చెబుతున్నారు. సరిగ్గా ఇదే కాలంలో మన దేశంలో జరిగిన మరికొన్ని పరిణామాలును పరిశీలిస్తే ఈ ప్రచారం ఎవరు, ఎందుకు చేస్తున్నారో అర్ధం చేసుకోడానిక తోడ్ప డతాయి.


హైడ్రొజన్‌ బాంబు వివాదం


1998లో బిజెపి నాయకత్వంలోని ప్రభు త్వం రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో వరుసగా జరిపిన అణుపరీక్షల్లో హైడ్రొజన్‌ బాంబు పరీక్ష విఫలమయిందని పోఖ్రాన్‌-2లో రక్షణ పరిశో ధనా సంస్థ (డిఆర్‌డిఓ) తరఫున పాల్గొన్న శాస్త్ర వేత్త కె. సంతానం ఆగస్టు 16న ప్రకటించారు. హైడ్రొజన్‌ బాంబు పరీక్షలో అనుకున్న శక్తి ఉద్భ వించలేదని, కనుక ఈ ప్రయోగం విఫలమయి నట్లేనని ఆయన చెబుతూ ఈ ప్రయోగం ఆధా రంగా మన దేశం తయారుచేస్తున్న హైడ్రొజన్‌ బాంబులు అనుకున్న ఫలితాలను ఇవ్వబోవని చెప్పాడు. సంతానం చెప్పింది తప్పు, పోఖ్రా న్‌-2 పరీక్ష పూర్తిగా విజయవంతమైందని భారత అణుఇంధన కమిషన్‌ అధికారికంగా స్పష్టం చేసింది. కాని వివాదం ఆగలేదు. సంతానం వ్యాఖ్యానాల ఆధారంగా మీడియా అనేక కథనాలు ప్రసారం చేసింది. పరీక్ష విజయ వంతమైందని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ చెప్పారు.



సంతానం ప్రకటనను అణుఇంధన కమిషన్‌ మాజీ అధ్యక్షుడు చిదంబరం, బాబా అణుపరిశోధనా సంస్థ మాజీ అధ్యక్షుడు, హైడ్రొ జన్‌ బాంబు రూపకర్త అనిల్‌ కాకోద్కర్‌ ఖండిం చారు. అయినా సంతానం ప్రకటనలు ఆగలేదు. శాస్త్రవేత్తల్లో కొంతమంది సంతానానికి మద్దతు గా ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించారు. ఎప్పు డో పదకొండేళ్ల క్రితం జరిగిన అణు పరీక్షల గురించిన చర్చ మళ్లీ ఇప్పుడు ముందుకు తీసుకురావడానికి కారణమేమిటి? అంటే వాళ్లదగ్గర సరైన సమాధానం లేదు. కాని ఈ హైడ్రొజన్‌ బాంబు వివాదం కూడా చైనా కేంద్రంగా నడిచిన విషయాన్ని మనం పరిశీలిస్తే లింకులు అర్థమవుతాయి. తన మొదటి పత్రికా ప్రకటన తరువాత ఒక నెలరోజులకు సంతానం అక్టోబర్‌ 21న ఢిల్లీలో పత్రికలవారితో మాట్లా డుతూ ''చైనా నుండి దేశాన్ని రక్షించుకోవాలంటే మన దేశం వరుసగా అనేక హైడ్రొజన్‌ బాంబు పరీక్షలు జరపాలి'' అని కోరారు. చైనా వద్ద 200 అణుబాంబులున్నాయి. వాటిలో అనేక హైడ్రొజన్‌ బాంబులు. వాటిని ఎదుర్కోవాలంటే భారత్‌కూడా పెద్దఎత్తున హైడ్రొజన్‌ బాంబుల తయారీని చేపట్టాలని ఆయన పేర్కొన్నాడు.



పోఖ్రాన్‌-2 పరీక్ష హైడ్రొజన్‌ బాంబుల తయా రీకి సరిపోదనేది ఆయన అభియోగం. దేశ రక్షణను పటిష్ట పరుచుకోడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే. తీసుకుంటుంది కూడా. అయితే ప్రస్తుత ప్రచారం వెనుక దేశ రక్షణ సమస్యకాదు, చైనాను ప్రధాన శత్రువుగా చూపించడం అనే లక్ష్యం ఇమిడి ఉందనేది నిపు ణుల అభిప్రాయం.


శాంభవి ఉదంతం


సెప్టెంబర్‌ నెలలోనే మీడియాలో మరో చర్చ పెద్ద ఎత్తున సాగింది. ఏడేళ్ల శాంభవి అనే అమ్మాయి ఢిల్లీలో దలైలామాను కలుసుకుని చర్చలు జరిపిందనీ, తానూ, దలైలామా గత జన్మలో స్నేహితలమనే విషయాన్ని ఆమె దలైలా మాతో చెప్పగా ఆయన కూడా అంగీకరించా డనేది వార్త సారాంశం. పత్రికలూ, వార్తా ఛాన ళ్లూ ఈమె మాటలకు బాగా ప్రాచుర్యం కల్పిం చాయి. భారత దేశంలో దలైలామా కార్యకలాపాల గురించి తెలియని వారు ఎవరూ లేరు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలను కేంద్రంగా చేసుకుని ఆయన ఆధ్యాత్మకత ముసు గులో చైనా వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తున్నారు. దలైలామా మూడేళ్లకొకసారి నిర్వహించే కాలచక్ర సభలుగాని, ఆయన ఇతర కార్యకలా పాలుగాని చైనా వ్యతిరేక ప్రచారవేదికలుగా ఉంటాయనేది మనకు అనుభంలోని విషయమే. ఇప్పుడు శాంభవి నోటితో అదేవిధమైన ప్రచా రానికి పూనుకున్నారు.



2012 నాటికి చైనా నాశనమై పోతుందనీ, టిబెట్‌కు స్వాతంత్య్రం వస్తుందనీ శాంభవి మీడియాముందు చెప్పింది. టిబెట్‌ను చైనా అక్రమంగా ఆక్రమించుకున్నదని ఆమెచెప్పిన మాటలు ఆమెవి కావనీ, ఆమెచేత చెప్పించారనీ తేలికగానే అర్థమైపోతోంది. శాంభవి కర్నూలు జిల్లా నంద్యాలకు సమీపం లోని సూర్యనంది ఆశ్రమంలో అకస్మాత్తుగా ప్రత్యక్షమై ఈ విషయాలు చెప్పింది. అయితే ఆమెది మన రాష్ట్రం కాదు. ఆమె తల్లిదండ్రులు వారణాసిలో ఉంటున్నారు. మూడేళ్లుగా ఆమె ఉషారాణి అనే సంరక్షకురాలి పర్యవేక్షణలో సూర్యనందిలో ఉంటున్నట్లు చెబుతున్నారు. ఆ పాపకు సంబంధించిన మొత్తం వ్యవహారం ఒక మిస్టరీగానే సాగింది. ఆమె దలైలామా యొక్క చైనా వ్యతిరేక ప్రచార యంత్రాంగంలో భాగ మా అనేది పలువురు వ్యక్తపరిచిన సందేహం. ఇటీవల 'సాక్షి' పత్రికలో దాని న్యూఢిల్లీ విలేకరి వాసదేవన్‌ ఇటువంటివే అనేక సందేహాలు లేవనెత్తడంతోబాటు శాంభవిఉదంతం, ధర్మశా లలో దలైలామా కార్యకాలపాలను భారత- చైనాల మధ్య చిచ్చుపెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలుగా పేర్కొన్నాడు.



''అసలు ధర్మశా లలో ఏం జరుగుతోంది? గతజన్మల కోలా హలం హఠాత్తుగా ఈరోజే ధర్మశాలను ఎందు కు చుట్టుముట్టింది? భౌద్ధ భిక్షువుల మదిలో శాంభవి ఎందుకు ఆరాధనీయ స్థానం సంపా దించింది?'' అని వాసుదేవన్‌ ప్రశ్నిస్తూ ధర్మ శాలను గురించిన అనేక విషయాలు వెల్లడించారు. ఆయన ఇలా రాశారు: ''అసలు ధర్మశాలలో జరుగుతున్న విషయాలు బయటి ప్రపంచానికి ఇంతవరకూ తెలియకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులోనూ సాం స్కృతిక పరంగా భారతీయ జీవన శైలిపై టిబెటన్లు చేస్తున్న మెత్తటి దాడుల్లో భాగంగానే, ధర్మశాలలో క్రమక్రమంగా 'భారతీకరణ' అదృశ్య మైతోందనడానికి ప్రబల సాక్ష్యాలు ఇటీవల కాలంలో బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ధర్మశాలలోని దలైలామా అంతర్జాతీయ ఆధ్యా త్మిక కేంద్రం వద్ద, ఆశ్రమనియమాల పేరిట భారతీయుల రాకను క్రమబద్దీకరించే విషయం లోనూ, ప్రవాసంలో ఉన్న టిబెట్‌ ప్రభుత్వ పార్లమెంట్‌ ప్రాంగణంలోకి భారతీయులను అనుమతించే విషయంలో దలైలామా సెక్యూరిటీ అనుసరించే విధానాలూ ఏ సగటు భారతీయు డినైనా గాయపరుస్తాయి.



అయితే సెక్యూరిటీ సిబ్బంది విదేశీయలను అనుమతించే విషయం లో ఉదారంగా ఉంటున్న విషయం ఎవరికంటా పడటంలేదని వారనుకుంటున్నారు.''ధర్మశాల వ్యవహారాలు మొత్తం చాలా రహస్యంగా అక్కడి భారతీయ అధికారుల కళ్లుగప్పే పద్ధతిలో సాగుతున్నాయని వాసుదేవన్‌ రాశారు. శాంభవి ఉదంతం వెనుకనున్న చైనా వ్యతిరేక ప్రచారాన్ని గురించి ప్రస్తావిస్తూ ఆయన ఇలా రాశారు: ''అసలు శాంభవి పుట్టుపూర్వో త్తరాలేమిటి? ఆమెకు కేర్‌టేకర్‌గా వ్యవహరిస్తున్న ఉషారాణి అనే మహిళకూ, టిబెట్‌ ప్రవాస ప్రభుత్వ డిప్యూటీ స్పీకర్‌ దోల్మ గ్యారీకి ఉన్న అనుబంధమేమిటి? శాంభవిని డిప్యూటీ స్పీకర్‌ 'ఆచార్య శాంభవి'గా ప్రకటించడం వెనుక ఉన్న మతలబు ఏమిటి? అనే దిశగా మన నిఘా సంస్థలు దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. చైనాతో మన సంబంధాలు ఆందోళన కలిగించే దిశగా ప్రయనిస్తున్న సమయంలో ఒక చిన్నారి నోట పలికిస్తున్న చైనా వ్యతిరేక వ్యాఖ్యలు మన రెండు దేశాల నడుమ సాంస్కృతిక పరమైన ఉద్రిక్తతలు తలెత్తడానికి కారణమవుతాయనే ఇంగితం మన నిఘా సంస్థలకు కొరవడటమే దురదృష్టకరం.



మతపరంగా టిబెటన్లకు ఉన్న పునర్జన్మ, గతజన్మ అంశాలపై మనం స్పృశించ కపోవడం మన సంస్కారం కాబట్టి ఇన్నాళ్లుగా శాంభవి నెపంతో టిబెటన్లు అధికారికంగా నడిపిస్తున్న ఈ చైనా వ్యతిరేక ప్రచారానికి మన మద్దతు ఉందనే అపోహను టిబెటన్లు విదేశీ పర్యాటకుల మెదళ్లలోకి చాలా జాగ్రత్తగా ఎక్కించగలిగారు.''దలైలామా భారత దేశంలో ఎవరికి వ్యతి రేకంగా ఎవరికోసం పనిచేస్తున్నారో మనకు తెలియంది కాదు. ఆయనకు అంతర్జాతీయంగా అమెరికా, ఇతర సామ్రాజ్యవాద శక్తులనుండి లభిస్తున్న మద్దతుగురించి కూడా అందరికీ తెలుసు. నిజానికి దలైలామాకు భారత్‌ ఇస్తున్న మద్దతు, ఆయనా, ఆయన అనుయాయులూ సామ్రాజ్యవాదుల మద్దతుతో చైనాపై కుట్రలకు భారత భూభాగాన్ని ఉపయోగించుకుంటున్న వైనం భారత్‌-చైనాల మధ్య మొదటినుండీ సమస్యలు తెస్తూనే ఉన్నాయి. భారత్‌లో నడు స్తున్న టిబెట్‌ ప్రవాస ప్రభుత్వ కార్యకలాపాలు మన దేశానికి మేలు చేయకపోగా కీడు తెస్తున్నాయి.


ఎందుకీ ప్రచారం?


మన అణ్వస్త్ర కార్యక్రమాన్ని చైనాకు వ్యతిరేకంగా తిప్పడం, దలైలామా కార్యకలా పాలను అడ్డుపెట్టుకుని చైనా వ్యతిరేక ప్రచారానికి సరికొత్తగా తెరతీయడం, అదే సమయంలో భారత్‌లోకి చైనా చొచ్చుకు వస్తున్నదన్న ప్రచారం అందుకోవడం ఇవన్నీ ఒకేసారిగా ఎవరో వెనక ఉండి నడుపుతున్నట్లు ఒక్కసారిగా జరగడం విశేషం. చివరికి ప్రధాన మంత్రితో సహా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈ కుట్రపూరిత ప్రచారానికి తెరదించడానికి రంగంలోకి దిగాల్సి వచ్చింది. చైనా-భారత్‌ సరిహద్దులు సురక్షి తంగా ఉన్నాయని ప్రధాన మంత్రి దేశ ప్రజల నుద్దేశించి ప్రకటించారు. మొత్తంగా చూసిన ప్పుడు ఈ ప్రచారాలన్నిటి వెనుక ఒక్కటే లక్ష్యం కనిపిస్తోంది. భారత్‌-చైనాలు దగ్గర కాకుండా, రెండు దేశాల మధ్య సాధారణమైన సంబం ధాలు ఏర్పడకుండా అడ్డుకోవడమే ఆ లక్ష్యంగా కనిపిస్తోంది.



ఒకవైపు అమెరికాలోని పిట్స్‌ బర్గ్‌లో జి20 దేశాల శిఖరాగ్ర సదస్సు జరుగనున్న తరుణం లో, బ్రెజిల్‌తో కలిసి భారత్‌-చైనాలు ఈ సమావేశంలో కీలకమైన పాత్ర నిర్వహించే సమయంలో రెండు దేశాల మధ్య చిచ్చురేపడా నికే ఈ ప్రచారం జరుగుతోందన్నది పరిశీలు కుల భావన. ఇటీవల హిందూ పత్రికలో భారత మాజీ దౌత్యవేత్త ఎం.కె. భద్రకుమార్‌ ఒక వ్యాసం రాస్తూ భారత్‌ - చైనాల మధ్య యుద్ధం వస్తోందన్న వాతావరణాన్ని కల్పిస్తున్నవాళ్లెవరో చెప్పారు. ఆయన అభిప్రాయం ప్రకారం కేవలం మీడియాలోని ఒక సెక్షనే కాకుండా భారత ప్రభుత్వంలో కీలక పాత్ర నిర్వహించిన అమె రికా అనుకూల అధికారులు, మాజీ దౌత్య వేత్తలు, వ్యూహకర్తల పాత్ర ఉంది. థింక్‌ ట్యాంక్‌ పేరుతో వీళ్లు అభిప్రాయాలను మలిచే పనిచేస్తున్నారు.



న్యూఢిల్లీలో ప్రయివేటు నిధులతో నడుస్తున్న విధాన పరిశోధనా కేంద్రంలో వ్యూహాత్మక అధ్యయనాల ప్రొఫెసర్‌ అయిన బ్రహ్మ చెల్లయ్య, బిజెపి నాయకుడు అరుణ్‌ శౌరి వంటివారు భారత్‌-చైనాల మధ్య అగ్గి రగల్చడమే పనిగాపెట్టుకుని రచనలు చేస్తున్నారు. ఈ ప్రచారంలో మీడియాలోని ఒక భాగం కూడా పాత్ర వహిస్తోంది. ముఖ్యంగా మన దేశంలో విదేశీ నిధులతో నడుస్తున్న మీడియా ఈ విషయంలో చాలా చురుకుగా పనిచేస్తోంది. రెండోది, సైన్యంలోని ఒక సెక్షన్‌, చైనా మన దేశంమీద దాడికి వస్తోందన్న పద్దతిలో వార్తలను లీక్‌ చేస్తున్నారు. అనేక చోట్ల చైనా చొరబాట్ల వర్తాలు నేరుగా కాకుండా మీడియాకు లీకుల రూపంలో వస్తున్నాయి. దేశ ప్రజల్లో ఆ విధమైన భయోత్పాతం ఏర్పడితే సైన్యానికి ప్రభుత్వం నిధులు పెంచుతుందన్న భావం ఈ సెక్షన్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది.



ఇక మూడోది, మన దేశంలో బిజెపి-సంఫ్‌ు పరివార్‌లు బాహా టంగా, సైన్యంలోనూ, అధికార యంత్రాంగం లోనూ ఉన్న వారి అనుయాయులు లోపాయి కారీగా భారత్‌-చైనా సంబంధాలు చెడగొట్టడా నికి ప్రయత్నిస్తున్నారు. వారి అమెరికా అనుకూల, మితవాత ఎజెండాలో 'చైనాతో వైరం' అనేది ఒక భాగంగా ఉన్నది. అందుకే బిజెపి నాయకులు ప్రసుత ఎన్నికల్లో 'చైనా పట్ల భారత్‌ మెతక వైఖరి' అనే ప్రచారాస్త్రాన్ని చేపట్టారు.



హిందూ వ్యాసంలో భద్రకుమార్‌ ఒక ప్రశ్న లేవనెత్తారు. భారత్‌-చైనాల మధ్య యుద్ధాన్ని ఎవరు కోరుకుంటున్నారు? రెండు దేశాలు ఘర్షణ పడితే ఎవరికి లాభమో వారుకోరుకుంటున్నారు. ప్రపంచంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందు తున్న, ఇరుగుపొరుగు దేశాలైన భారత్‌-చైనాలు ఘర్షణ పడితే భారత్‌కూ లాభం ఉండదు, చైనాకూ లాభం ఉండదు. పైగా రెండు దేశాలూ చాలా తీవ్రంగా నష్టపోతాయి. కాని ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో భారత్‌-చైనాలు ఘర్షణ పడితే అమెరికా లాభపడుతుందని ఆయన నిర్ధారిస్తూ ఈ నాడు మన దేశంలో జరుగుతున్న ఈ చైనా వ్యతిరేక ప్రచారం వెనుక అమెరికా ప్రయోజనాలు కాపాడే శక్తుల ప్రమేయం ఉందని తేల్చారు.


అమెరికా వ్యూహం


ప్రపంచ పరిణామాలు నేడు అమెరికా స్వార్ధ ప్రయోజనాలకు వ్యతిరేక దిశలో పయని స్తున్నాయి. తన నాయకత్వంలో ఏకధృవ ప్రపంచాన్ని నిర్మించడానికి అమెరికా ప్రయత్ని స్తుంటే దానికి విరుద్ధంగా ప్రపంచం బహుళధృవ రాజకీయాలవైపు నడుస్తోంఇ. రష్యా, చైనాలు ఒకవైపు, లాటిన్‌ అమెరికాలో వామపక్ష ప్రభు త్వాలు మరోవైపూ అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్నాయి. ఇంకోవైపు వర్ధమాన దేశాలనుండి బ్రెజిల్‌, భారత్‌, చైనాలు కలిసి కట్టుగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాల ఏకపక్ష ధోరణులను ప్రతిఘటిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థికవ్యవస్థగా ఆవిర్భవించి మొదటి స్థానంవైపు శరవేగంగా దూసుకుపోతున్న చైనా, మూడో స్థానంలోకి త్వరలోనే చేరుకోబోతున్న భారత్‌ల మధ్య ఆర్థిక వాణిజ్య సంబంధాలు పెరిగితే అమెరికా సామ్రా జ్యవాద ఆధిపత్యానికి గండిపడినట్లే అవుతుంది.



ఇరుగుపొరుగున ఉన్న ఈ రెండు దేశాల మధ్య పూర్తి స్థాయిలో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు ఏర్పడితే ఆ బంధం ప్రపంచ శాంతికీ, సుస్థిర తకూ దోహదపడుతుంది. అమెరికాకు సరిగ్గా అదే ఇష్టం లేదు. భారత స్వతంత్ర అభివృద్ధి కాకుండా తన ప్రపంచాధిపత్య వ్యూహంలో దాన్ని జూనియర్‌ భాగస్వామిగా చేసుకోడానికి అది శతవిధాలా ప్రయత్నిస్తోంది. భారత్‌తో రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడం, అణు ఒప్పం దం, వ్యూహాత్మక సైనిక విన్యాసాలు నిర్వహిం చడం వగైరాలన్నీ ఇందులో భాగమే. మన దేశంలోని పాలకవర్గంలో ఒక సెక్షన్‌ దీనికి మద్దతుగా నిలబడింది.



కాని అమెరికా ప్రయత్నాలకు విరుద్ధంగా మరోవైపు భారత్‌-చైనాల మధ్య ఈ కాలంలో వాణిజ్య, దౌత్య సంబంధాలు వేగంగా పెరుగు తున్నాయి. 2008లో రెండు దేశాల మధ్య వాణిజ్యం 5,100 కోట్లడాలర్లకు (2,505,000 కోట్ల రూపాయలకు) చేరుకుంది. 2007తో పోలిస్తే 34 శాతం పెరిగింది. 2009లో ఇది 6,000 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. 1999లో రెండు దేశాలమధ్య వాణిజ్యం కేవ లం 33 కోట్ల డాలర్లు మాత్రమే ఉండేదంటే ఈ 15 ఏళ్లలో వాణిజ్య సంబంధాలు ఎంతగా పెరిగాయో అర్ధం చేసుకోవచ్చు. 1990 నుండి ప్రతిఏటా 30 శాతం వృద్ధి చెందుతోంది. అమె రికా-భారత్‌ల మధ్య జరుగుతున్న వాణిజ్యాన్ని నేడు భారత్‌ - చైనామధ్య వాణిజ్యం మించి పోయింది. 2000 సంవత్సరంలో అమె రికా-భారత్‌ల మధ్య 1,400 కోట్ల డాలర్ల వాణిజ్యం జరగ్గా 2007-08 నాటికి అది 4,200 కోట్ల డాలర్లకు పెరిగింది. అంటే 2000 నాటికి భారత్‌-చైనాల మధ్య జరిగిన వాణిజ్యం కన్నా భారత్‌-అమెరికాల మధ్య వాణిజ్యం అధికంగా ఉండేది, కాని ఇప్పుడది రెండో స్థానంలోకి పోయింది. నేడు భారత్‌కు అదిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా మాత్రమే.



రెండోవైపు 1985లో రాజీవ్‌ గాంధీ చైనా పర్యటన తరువాత ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు బాగా వృద్ధి చెందుతూ వచ్చాయి. 1962 యుద్ధానికి దారితీసిన సరిహద్దు సమస్యను పక్కనబెట్టి రెండు దేశాలూ వాణిజ్య, ఆర్థిక, ఇతర సంబంధాలు పెంచుకోవాలని నిర్ణయానికి రావడం రెండు దేశాల సంబంధా లలో పెద్ద మార్పుకు దారితీసింది. 1962 తరువాత ఈనాటివరకూ భారత్‌-చైనాల మధ్య 3.500 కిలోమీటర్ల పైగా ఉన్న సరిహద్దుల్లో ఎటువంటి ఘర్షణా లేదు. ఈ ప్రాంతంలో ఘర్షణలో ఒక్క మరణమూ సంభవించలేదు. ఇటీవలెనే సిక్కింలో భూమార్గం ద్వారా వాణి జ్యానికి ఆరంభం పలికారు. ఇంకా అనేక సెక్టార్లలో వాణిజ్య మార్గాలు తెరిస్తే రెండు దేశాల సరిహద్దులు అభివృద్ధి మార్గలుగా మారిపోయే అవకాశం ఉంది.



అన్నిటికీ మించి నేడు అంతర్జాతీయంగా భారత్‌-చైనాలు తమ రెండు దేశాలకూ, వర్ధ మాన దేశాలకూ ప్రయోజనం చేకూర్చే అనేక అంశాలపై పరస్పర సమన్వయంతో వ్యవహ రిస్తూ పశ్చిమ దేశాల ఒత్తిళ్లను ప్రతిఘటించ గలుగుతున్నాయి. భూగోళ తాపాన్ని తగ్గించే వాయువుల అదుపు విషయంలో భారత్‌ - చైనాలు ఇటీవల అనేక వేదికల మీద సమన్వ యంతో వ్యవహరించి అమెరికా, ఇతర పశ్చిమ దేశాల ఒత్తిళ్లను తిప్పికొట్టగలిగాయి. డబ్ల్యుటివో దోహా దఫా వాణిజ్య చర్చల్లో కూడా రెండు దేశాలు కలిసి కట్టుగా అమెరికాకు చెక్‌ పెడుతున్నాయి. అలాగే అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పశ్చిమ దేశాలు తమపై సంక్షోభ భారాలు నెట్టివేయకుండా అడ్డుకుంటు న్నాయి. ఈ క్రమంలోనే పిట్స్‌ బర్గ్‌లో జరిగిన జి20 సమావేశంలో బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా (బ్రిక్‌)లు ప్రముఖ పాత్ర పోషించాయి. వీటితోబాటు ఇటీవలి కాలంలో భారత్‌-చైనా సైన్యాల మధ్య కూడా సంయుక్త విన్యాసాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు పెరుగుతున్నాయి. దాంతో రెండు దేశాల సైన్యాల మధ్య సహృద్భావం రోజురోజుకీ పెరుగుతోంది.



ఈ విధంగా భారత్‌-చైనా మధ్య వాణి జ్యం, ఇతర సంబంధాలు పెరగడం, అంతర్జా తీయ వేదికల మీద రెండు దేశాల మధ్య సమన్వ యం పెరగడం భారత్‌ను తన జూనియర్‌ భాగ స్వామిగా చేసుకోవాలనుకుంటున్న అమెరికా వ్యూహానికి హానికరం. కనుకనే రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టడానికి అది అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. మన వ్యవస్థలో చొచ్చుకుపోయిన అమెరికా అనుకూల శక్తులు దానికి ఈ ప్రయ త్నంలో అన్నివిధాలా సహకరిస్తున్నాయి. దీని గురించి హిందూ వ్యాసంలో భద్రకుమార్‌ ఇలా పేర్కొన్నారు: ''విశేషమేమంటే మన ప్రాంతంలో పాకిస్థాన్‌ సహకారంతో తన సైనిక ఉనికిని పెంచుకుంటున్న అమెరికా విధానాలనుండి ప్రజల దృష్టిని ఈ (చైనా వ్యతిరేక) యుద్ధ ఉన్మాదం పక్కకు మళ్లించింది. అదేవిధంగా ఆఫ్ఘనిస్థాన్‌ సమస్యపైనా, ఉగ్రవాదం సమస్యపైనా ఏవిధంగా సహకరించుకోవాలి అని భారత్‌, రష్యా, చైనాలు మార్గాన్వేషణ చేస్తున్న సమయంలో ఇది ఈ ప్రాంతంలో గందరగోళం నెలకొల్పింది.


ఈ ఉన్మాదాన్ని గనుక మరింత పెరగనిస్తే అప్పు డు చైనా బూచిని ఎదుర్కొనేందుకు భారత దేశం అమెరికాతో అనివార్యంగా సైనిక సహకారాన్ని విస్తరించుకోవలసి వస్తుంది...''

Note :Article from Prajasakti.com

ఒబామా మాట నిలుపు కుంటారా ?

శాస్త్రసాంకేతిక రంగాలలో మానవాళి అభ్యుదయానికి కృషి చేసిన వారికి ప్రకటిస్తున్న నోబెల్‌ బహుమతుల విషయంలో ఎలాంటి విభేదాలు లేవు. వచ్చిన చిక్కల్లా శాంతి బహుమతుల ప్రకటనతోనే నోబెల్‌ ఫౌండేషన్‌, బహుమతుల నిర్ణాయక కమిటీలు తీవ్ర విమర్శల పాలౌతున్నాయి. సామ్రాజ్యవాదులు ముఖ్యంగా అమెరికన్ల కనుసన్నలలో మెలిగేవారికి అవసరమైతే శాంతి బహుమతులు ఇప్పించే పలుకుబడి అమెరికన్లకు ఉందని అనేక సందర్భాలలో వెల్లడైంది. ఇప్పుడు జరిగిందదే. అధ్యక్షుడిగా పదవీస్వీకారం చేసిన పదిహేనురోజుల్లోనే నోబెల్‌ బహుమతి ప్రతిపాదన గడువు ముగిసింది. అంటే కనీసం ఆయన విధానాలు ఎలా ఉంటాయో తెలియకముందే పేరును ప్రతిపాదించటాన్ని బట్టి ముందస్తు ఏర్పాటుగా భావిస్తున్నారు. అందుకే అది తెలియని వారిని ఒబామాకు 2009 సంవత్సరానికి అంతర్జాతీయ శాంతి నోబెల్‌ బహుమతి ప్రకటించటం ఆశ్చర్య పరిచింది. మీడియా, రాజకీయ పరిశీలకులు ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రిపబ్లికన్లు, ఇతర మితవాదులు అవార్డు ఇవ్వటంపై విమర్శలు గుప్పిస్తుండగా అంతే మోతాదులో సమర్థిస్తున్నారు. పాలస్తీనాలో యూదుల అక్రమనివాసాల నిర్మాణాన్ని నిలిపివేయించటంలో విఫలమై, ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధం కొనసాగిస్తున్న వ్యక్తికి శాంతి బహుమతి ఇవ్వటం ఏమిటని యుద్ధ వ్యతిరేకులు ప్రశ్నిస్తున్నారు.


నోబెల్‌ శాంతి బహుమతులు వివాదాస్పదం కావటం ఆదినుంచీ ఉంది.అధికారంలో ఉండగా నోబెల్‌ శాంతి బహుమతులు పొందిన తొలి అమెరికా అధ్యక్షుడు థియోడర్‌ రూజ్‌వెల్ట్‌. ఆయన రష్యా-జపాన్‌ మధ్య రాజీకుదిర్చినందుకు 1906లో అవార్డును ప్రకటించారు. ఇది ఒకవైపు మాత్రమే. స్పానిష్‌-అమెరికా యుద్ధానికి తోడ్పడినందుకు, ఫిలిఫ్పైన్స్‌లో రక్తం ఏరులుగా పారించినందుకు బహుమతిగా ఈ అవార్డు వచ్చిందన్న విమర్శలకూ ఆధారాలు లేకపోలేదు. బహుమతి ప్రకటన వెలువడగానే అమెరికా సైనిక బలప్రదర్శన ద్వారా ప్రపంచాన్ని భయపెట్టేందుకు గ్రేట్‌ వైట్‌ ఫ్లీట్‌( 16 నౌకాదళ నౌకలు)ను అట్లాంటిక్‌ సముద్రంలోకి నడిపించిన అపర 'శాంతి' ప్రియుడు రూజ్‌వెల్ట్‌. ఈ పూర్వరంగంలోనే బహుమతికోసం ఒబామా ఆఫ్ఘనిస్తాన్‌కు అదనపు సైన్యాలను పంపటం వాయిదావేశారని అమెరికాలో విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు ఒబామా యంత్రాంగంలో ఒకసారి ప్రపంచానికి అమెరికా అంటే ఏమిటో తెలియచెప్పాలంటే మన వద్ద ఉన్న ఆధునిక ఆయుధాలన్నింటినీ ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రయోగించాలని జనరల్‌ స్టాన్లీ క్రిస్టల్‌ ఇప్పుడు లాబీయింగ్‌ నిర్వహిస్తున్నాడు. అంతకు ముందున్న కమాండర్‌ను మార్చి స్టాన్లీని ఒబామా కొత్త కమాండర్‌గా నియమించారు. మరో 17వేల మంది కొత్త సైనికుల తరలింపునకు ఆజ్ఞలు జారీ చేశారు. ఒకవైపు ఒబామా పేరును నోబెల్‌ కమిటీకి ప్రతిపాదించిన సమయంలోనే మరోవైపు అఫ్ఘనిస్తాన్‌కు మరింతగా మరో 40వేల అదనపు బలగాలను పంపటం గురించి ఒబామా సర్కార్‌ కసరత్తు చేస్తున్నది. నోబెల్‌ బహుమతి ప్రకటన గురించి ముందుగా తెలిసిన కారణంగానే బలగాలను పంపటంపై నిర్ణయాన్ని వాయిదా వేశారన్న విమర్శలు కూడా వచ్చాయి. మొదటి ప్రపంచ యుద్దంలోకి అమెరికాను లాగను అన్న ఎన్నికల వాగ్దానంతో రెండవసారి 1916లో గెలిచిన ఉడ్రోవిల్సన్‌ మరుసటి ఏడాదే అమెరికాను యుద్దంలో దించిన పెద్దమనిషి. వర్సెయిల్స్‌ సంధితో నానాజాతి సమితి ఏర్పాటుకు కారకుడయ్యాడనే పేరుతో ఆయనకూ 'శాంతికాముకుడు' ముద్రవేసి నోబెల్‌ బహుమతి ఇచ్చారు. ఫిలిప్ఫైన్లు, పాలస్తీనియన్లు, వియత్నామీయులు,


ఇప్పుడు ఆప్ఘనిస్తానీయులపై రోబోట్‌, క్షిపణి దాడులు జరుపుతూ వివాహవిందుల్లో ఉన్నవారిని, నిరాయుధులను విచక్షణా రహితంగా సంహరిస్తున్న వారందరికీ నోబెల్‌ శాంతి బహుమతులు రావటం రాజకీయం, అమెరికా తన అక్రమాలకు ముసుగువేసుకోవటం తప్ప మరొకటి కాదు. నోబెల్‌ శాంతి తాజాగా పొందిన ఒబామా, అంతకు ముందు అందుకున్న మార్టిన్‌ లూధర్‌కింగ్‌ జూనియర్‌, దలైలామా, అంగ్‌సాన్‌ సూకీ, నెల్సన్‌ మండేలా అందరూ తాము మహాత్మాగాంధీని చూసి స్ఫూర్తి పొందామని చెప్పుకున్నవారే. ఇంతమందికి ఆరాధ్యుడైన మహాత్మాగాంధీకి మాత్రం శాంతి బహుమతి ఇవ్వటానికి నోబెల్‌ కమిటీకి మనస్కరించకపోవటం వెనుక కూడా రాజకీయమే అని చెప్పకతప్పదు. ఎందుకంటే ఆయన బ్రిటీష్‌వారికి వ్యతిరేకంగా పోరాడటమే. అనేకసార్లు గాంధీపేరును ప్రతిపాదించినా తిరస్కరించిన కమిటీ తీరా ఆయన మతోన్మాదుల చేతిలో హత్యకు గురికాబోయే కొద్ది రోజుల ముందు ఆయనను జాబితా నుంచి తొలగించటం విచారకరమే అని ప్రకటించింది. ఆతరువాత 1948లో శాంతి బహుమతికి అర్హులైన సజీవులెవరూ లేనందున ఆ సంవత్సరానికి బహుమతిని ఇవ్వటం లేదని పేర్కొన్నది. వివాదం ఎలా ఉన్నా తనకు వచ్చిన బహుమతిని కార్యాచరణకు పిలుపుగా భావించి తాను స్వీకరిస్తున్నానని ఒబామా పేర్కొన్నారు. అయితే అది ప్రపంచశాంతిని ఒక్క అడుగు ముందుకు తీసుకుపోయినా సంతోషమే. అమెరికాలో మార్పు తీసుకువచ్చేందుకే నాకు అనుకూలంగా తీర్పు ఇవ్వమనే నినాదంతో ఎన్నికలలో పోటీ చేసిన ఒబామా తాను వాగ్దానం చేసిన ఆరోగ్యబీమా సంస్కరణలను అమలు జరపటానికి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటున్నారు. అటువంటిది ప్రపంచంలో ఏదో ఒకమూల అశాంతి, యుద్ధాలు లేకపోతే నిదురపట్టని ఆయుధలాబీ ఒబామాను శాంతికాముడిగా వ్యవహరించనిస్తుందని ఆశించటం అత్యాశే అవుతుంది. అయితే ఒబామాకు ఒకవేళ విఫలమైనా అన్నమాటను నిలబెట్టుకొనేందుకు చిత్తశుద్దితో ప్రయత్నిస్తే చరిత్ర బ్రహ్మరథం పడుతుంది, లేకుంటే చెత్తబుట్టలోకి నెడుతుందని ఒబామా గ్రహిస్తారా?

Note:Article from prajasakti Desk

Thursday, 8 October 2009

పెట్టుబడిదారీ వ్యవస్థకు స్పష్టమైన ప్రత్యామ్నాయం ఉంది

పెట్టుబడిదారీ వ్యవస్థ పనికిమాలినదని తేలిపోయింది కాబట్టి ఇప్పుడు మన ముందున్న ప్రత్యామ్నాయమేమిటి?.....ఈ ప్రశ్న నేడు ప్రపంచ ఆర్థిక రంగంలో జరగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న లక్షలాదిమంది ప్రజల, ఇంకా చెప్పాలంటే కోట్లాది మంది ప్రజల మెదళ్లు తొలుస్తున్నది. గత కొన్ని నెలలుగా కనిపిస్తున్న రుణ సంక్షోభం, ఆర్థిక పతనం, మాంద్యం....వంటి వాటిని చూసేవారిలో ఇటువంటి ప్రశ్న ఉదయించడం సహజం. కాని సమస్యేమంటే ఈ ప్రశ్న ఉదయించిన కోట్లాది మంది ప్రజల ముందు మన రాజకీయ నాయకులు, మీడియా, విద్యా వ్యవస్థ, ఇంకా వారి అనుభవాల్లోని ఇతర అంశాలు ఉంచుతున్న సమాధానం ఏమిటంటే 'ప్రత్యామ్నాయం లేదు' అని. ఇప్పుడున్న స్థితిలో పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం ఏ విధంగానూ లేదు, ప్రత్యామ్నాయంటూ ఉంటే గింటే అది మార్పు చేయబడిన పెట్టుబడిదారీ వ్యవస్థే మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. మార్పు చేయబడ్డ పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే కొత్త కీనీసియనిజం, లేదా గార్డన్‌ బ్రౌనిజం (బ్రిటన్‌ ప్రధాని సూత్రం), లేదా బరాక్‌ ఒబామాయిజం (అమెరికా అధ్యక్షుల వారి సూత్రం) మాత్రమే.


కాని ఇది వాస్తవం కాదు. పెట్టుబడిదారీ వ్యవస్థకు నిశ్చితమైన, స్పష్టమైన ప్రత్యామ్నాయం ఉంది. 160 ఏళ్లనుండి (1848లో కారల్‌ మార్క్స్‌, ఫ్రెడరిక్‌ ఏంగెల్స్‌ కమ్యూనిస్టు మ్యానిఫెస్తో రాసినప్పటినుండి) ఈ ప్రత్యామ్నాయం మన ముందుంది. ఆ స్పష్టమైన ప్రత్యామ్నాయమే సోషలిజం. సోషలిజం చాలా సూటైన వ్యవస్థ. పెట్టుబడిదారీ వ్యవస్థతో పోలిస్తే చాలా సరళతరమైన వ్యవస్థ. ప్రధాన ఉత్పత్తి సాధనాలు (భూమి, పరిశ్రమలు, వ్యాపారాలు, బ్యాంకులు వగైరాలు)పై సామాజిక (లేదా సమిష్టి) యాజమాన్యం, అదుపు కలిగి ఉండడమే సోషలిజం అంటే. ఈ వ్యవస్థలో ఉత్పత్తి లాభాలకోసం కాకుండా మానవ అవసరాల ప్రాతిపదికగా జరుగుతుంది. దానివల్ల సమాజంలో వర్గ విభజనలు అంతమవుతాయి.


.............


సోషలిజం సమాజంలో చాలా మార్పులు తెస్తుంది. ప్రజలందరికీ అవసరమైన ఆహారం, గృహవసతి అందిస్తుంది. మానవుల మధ్య అసమానతలు, వర్గవిభజన తొలగిస్తుంది. ఆర్థికవ్యవస్థలో ప్రజాతంత్ర యుతమైన ప్రణాళికను ప్రవేశపెడుతుంది. వాతావరణంలో వినాశకరమార్పులను అరికడుతుంది. ప్రపంచ శాంతి, సమైక్యత నెలకొల్పుతుంది. కాని సోషలిజం ఈ మార్పులన్నీ తేవాలంటే ముందుగా కార్మికవర్గం పెట్టుబడిదారీ వ్యవస్థను తొలుత ఒక దేశంలోనూ, తరువాత మొత్తం ప్రపంచమంతటానూ, కూకటివేళ్లతో పెకిలించి పారేయ్యాల్సి ఉంటుంది. దీనికి కార్మిక మండళ్లు ఏర్పాటు కావడం చాలా కీలకమైన అంశం. ఈ మండళ్ల ఏర్పాటు పెట్టుబడిదారీ వ్యవస్థలోనే ప్రారంభమవుతుంది. యజమానులకు వ్యతిరేకంగా కార్మిక సమ్మెలు నిర్వహించే క్రమంలోనూ, సార్వత్రిక సమ్మెలు, ఫ్యాక్టరీల ఆక్రమణలు వంటి పోరాటాల నిర్వహణ క్రమంలోనే ఇటువంటి కార్మిక మండళ్లు ఏర్పడతాయి. ఇవి క్రమంగా పాత పెట్టుబడిదీరీ రాజ్యానికి ప్రత్యామ్నాయ అధికార కేంద్రాలుగా మారుతాయి. ఆ క్రమంలో జరిగే నిర్ణయాత్మక విప్లవంలో వారు పెట్టుబడిదారులను అధికారం నుండి తొలగించి కార్మికుల అధికారాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆధునిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కార్మికుల విశిష్ట స్థానాన్ని బట్టి వారికా అధికారం చేకూరుతుంది. ఈ క్రమంలోనే వారు కోట్లామంది ప్రజల సృజనాత్మక శక్తినీ, సామర్ధ్యాలనూ విముక్తి చేస్తారు. అది ఒకసారి జరిగితే ఇప్పటికన్నా ఉన్నతమైన, చాలా చాలా ఉత్తమమైన ప్రపంచం 'సాధ్యం' అనే స్థితినుండి వాస్తవ రూపానికి వస్తుంది.

Note: Written By
(జాన్‌ మోలినాక్స్‌ బ్రిటిష్‌ సోషలిస్టు వర్కర్స్‌ పార్టీ సభ్యుడు. రచయిత. పోర్ట్స్‌మౌత్‌ విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా పనిచేస్తున్న ఈయన మార్క్సిస్టు సిద్ధాంతం, కళల మీద అనేక వ్యాసాలు, పుస్తకాలు రాశాడు. 'సోషలిస్టు రివ్యూ' 2009 జనవరి సంచికలో ఆయన రాసి వ్యాసం నుండి ఈ వాక్యాలు గ్రహించబడ్డాయి.)

Friday, 2 October 2009

బోఫోర్స్‌కు సమాధి

అనుకున్నట్టే జరిగింది. కాంగ్రెస్‌కు పర్యాయపదంగా మారిన బోఫోర్స్‌ కుంభకోణంలో దోషులెవరో తేలకుండానే కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం దీనిని శాశ్వతంగా సమాధి చేసింది. 1437 కోట్ల రూపాయల హోవిట్జర్‌ తుపాకుల కొనుగోలుకు సంబంధించి భారత ప్రభుత్వానికి, స్వీడిష్‌ కంపెనీ బోఫోర్స్‌కి మధ్య కుదిరిన ఒప్పందంలో కొందరు రాజకీయపెద్దలకు, అధికారులకు పెద్దయెత్తున ముడుపులు ముట్టినట్లు 1987లో స్వీడిష్‌ రేడియో వెల్లడించడంతో దేశం ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. రక్షణ కొనుగోళ్లలో ఇంతటి భారీ కుంభకోణాన్ని దేశం అదివరకెన్నడూ కనీవినీ ఎరుగదు. పైగా ఈ కుంభకోణంతో కాంగ్రెస్‌లోని కొందరు పెద్దలకు ప్రమేయమున్నట్లు జర్నలిస్టుల పరిశోధనాత్మక వార్తా కథనాలు రావడంతో దేశంలో ఇది పెను ప్రకంపనలు సృష్టించింది. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయానికి ఇది దారితీసింది. ఆ తరువాత కూడా ఆ పార్టీని ఇది నీడలా వెంటాడుతూనే వస్తోంది. ఈ కుంభకోణంలో తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించాల్సిన పెద్దలు ఇందులో నిజాలు బయటకు రానీయకుండా తొక్కిపట్టడానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. మధ్య మధ్యలో ఎన్డీయే, కాంగ్రెస్‌ మద్దతుపై ఆధారపడిన ప్రభుత్వాలు వచ్చినా ఈ కేసుపై దర్యాప్తు ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగానే సాగింది.


ఈ కేసు దర్యాప్తును ప్రహసనంగా మార్చడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేయని ప్రయత్నమంటూ లేదు. బోఫోర్స్‌ కుంభకోణం బయటపడగానే పార్లమెంటులోపల, వెలుపల ప్రతిపక్షాల నుంచి, ప్రజానీకం నుంచి పెద్దయెత్తున వ్యతిరేకత రావడంతో అయిష్టంగానే సంయుక్త పార్లమెంటరీ సంఘం(జెపిసి) ఏర్పాటుకు ఆనాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం అంగీకరించింది. కానీ, ఆ కమిటీ విచారణను ఒక తంతుగా మార్చడంతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ఆ కమిటీని బహిష్కరించారు. 1987లో ఈ కుంభకోణం వెలుగు చూసినా, విపి సింగ్‌ నేతృత్వంలో నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే దీనిపై సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది. ఆ తరువాత తొమ్మిదేళ్లకు అంటే 1999లో సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం స్విస్‌ బ్యాంకు విడుదల జేసిన 500 డాక్యుమెంట్ల ఆధారంగా విన్‌ ఛద్దా, ఖత్రోచి, కీ.శే. రాజీవ్‌ గాంధీలపై సిబిఐ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. అప్పటికే రాజీవ్‌ చనిపోయినందున ఆయన పేరును విచారించాల్సిన నిందితుల జాబితా నుంచి తప్పించింది. ఆ తరువాత కొన్నాళ్లకు హిందూజా సోదరుల పేర్లను చేర్చుతూ అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. కానీ, దర్యాప్తు సంస్థ సరైన ఆధారాలు చూపకపోవడం వల్ల 2004లో హిందూజా సోదరులను ఢిల్లీ హైకోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. యుపిఏ-1 ప్రభుత్వం అధికారంలో వుండగా ఈ కేసులో కీలక నిందితుడైన ఇటాలియన్‌ ఆయుధ వ్యాపారి, రాజీవ్‌ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన ఒట్టావియో ఖత్రోచిని ఇంటర్‌పోల్‌ రెడ్‌ అలెర్ట్‌ నోటీసు ఆధారంగా అర్జెంటీనా ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. అయితే సిబిఐ గట్టిగా వాదించకపోవడం వల్ల ఆ ఖత్రోచిని భారత్‌కు అప్పగించేందుకు అర్జెంటీనా కోర్టు తిరస్కరించింది. మలేసియాలో ఖత్రోచి బహిరంగంగా సంచరించినా అతన్ని పట్టుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకుండా నాన్చింది. 2005లో ఖత్రోచి బ్యాంకు అకౌంట్లపై వున్న స్తంభనను ఎత్తివేయవచ్చని భారత ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు సలహా ఇచ్చినప్పుడే ఈ కేసును సమాధి చేయడానికే ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని విదితమయింది. ఖత్రోచిపై వున్న రెడ్‌ అలర్ట్‌ నోటీసును ఉపసంహరించాలని ఇంటర్‌పోల్‌ను సిబిఐ కోరడంతో ఇది మరింత బలపడింది. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కేసును మూసేయాలన్న ప్రభుత్వ ప్రకటన ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్‌ పాలకులు వ్యవహరించిన తీరు చాలా జుగుప్స కలిగిస్తోంది. ఈ కేసులో నిజాలు బయటకు రావాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేశమాత్రం కూడా లేదని ఈ పరిణామాలన్నీ స్పష్టం చేస్తున్నాయి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే ఇంతకాలం చట్టానికి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఖత్రోచిని పట్టుకుని మక్కెలిరగ్గొట్టి అతనిచే నిజం కక్కించాలి. కానీ, కేంద్రంలో పాలించిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగనీయకుండా సిబిఐని అడ్డుకున్నాయి. నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాల్సిన సిబిఐని కాంగ్రెస్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌గా మార్చాయి. కేరళలో మార్క్సిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పినరయి విజయన్‌పై అక్రమంగా కేసును బనాయించడంలోను, యుపిలో ములాయం సింగ్‌పై కేసుల విషయంలోనూ సిబిఐని యుపిఏ ప్రభుత్వం ఎలా సాధనంగా వాడుకున్నదీ చూశాము.ఒకవైపు సిబిఐని ఆధారాలు సేకరించకుండా కాళ్లు చేతులు కట్టిపడేసి మరో వైపు సరైన ఆధారాలు లేకుండా ఎంతకాలం నిందితులను వేధిస్తామంటూ అధికారంలో వున్న పెద్దలు అమాయకత్వం ఒలకబోయడం వారి నయవంచనకు పరాకాష్ట. ఖత్రోచి అమాయకుడని కాంగ్రెస్‌ నమ్మవచ్చుగాక. కానీ, దేశ ప్రజలచేత అలా నమ్మింపజేయాలని చూడడం దాని అవివేకం. ఖత్రోచి ఏ తప్పు చేయకపోతే గత పందొమ్మిదేళ్లుగా చట్టానికి, న్యాయానికి చిక్కకుండా ఎందుకు తప్పించుకు తిరుగుతున్నట్లు? బోఫోర్స్‌ కుంభకోణంలో చేతులు మారిన అరవై నాలుగు కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి చేరినట్లు? వీటికి సమాధానం లభించాలంటే ఈ కుంభకోణంలో కీలక పాత్రధారి ఖత్రోచిని ప్రాసిక్యూట్‌ చేయాలి. అందుకు ప్రయత్నించకుండా, కేసును మూసేయడమే దీనికి పరిష్కారం అన్నట్లుగా వ్యవహరించడం దారుణం.


దేశ భద్రతకు సంబంధించిన రక్షణ కొనుగోళ్లలో బయటపడిన అతిపెద్ద కుంభకోణంలో ఎవరినీ శిక్షించకుండా ఇలా వదిలేయడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు ఏ రకమైన సందేశాన్ని ఇవ్వదలచుకున్నది? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ఉన్నతాధికారులు, రాజకీయ బ్రోకర్లు అవినీతికి పాల్పడినా దానిని పట్టించుకోకూడదని చెప్పదలచుకున్నదా? అన్ని రకాల అవినీతికి మూలమైన రాజకీయ అవినీతిని ఉపేక్షించినా తప్పు కాదని చెప్పదలచుకున్నదా? అదే ప్రభుత్వ ఉద్దేశమైతే ఆ మాటే చెప్పాలి. అంతేకానీ, ఈ విధమైన ద్వంద్వ ప్రమాణాలతో అవినీతిపై అది పోరాడలేదు. ఇప్పటికైనా ఈ కపట నాటకాన్ని కట్టి పెట్టి బోఫోర్స్‌ కేసులో నిజాలను బయటపెట్టాలి. ఇందుకు కారకులైనవారు ఎంతటివారైనా శిక్షించాలి.

Thursday, 1 October 2009

ఆరుదశాబ్దాల జన చైనా అప్రతిహత పురోగమనం

october 1st 2009
నేటికి సరిగ్గా అరవై ఏళ్ల క్రితం చైనా రాజధాని బీజింగ్‌లోని తియాన్మెన్‌ స్క్వేర్‌లో మావో సేటుంగ్‌ జనచైనా ఆవిర్భవించిందని అశేష ప్రజానీకం మధ్య ప్రకటించాడు. అప్పటివరకు ప్రజలు ఎన్నెన్నో కష్టాల పాల్జేసిన యుద్ధం ముగిసిందనడానికి అది సంకేతం. కమ్యూనిస్టుపార్టీ నాయకత్వాన సాగిన విప్లవపోరాటం విజయవంతం అయిన రోజు అది. లక్షలాదిమంది కార్యకర్తలు, సాధారణ ప్రజానీకం లెక్కలేనన్ని త్యాగాలు చేసి, రక్తం ధారవోసి ఆ విప్లవాన్ని సాధించారు. ఇది సామ్రాజ్యవాదుల దోపిడీనుండి, జపాన్‌ దురాక్రమణదారుల దురాగతాల నుండి విముక్తి అని, దశాబ్దాలుగా యుద్ధ ప్రభువుల చేతిలో తాము అనుభవిస్తున్న అంతులేని కష్టాలకు చరమగీతం అని చైనా ప్రజలు విశ్వసించారు.


చైనా కమ్యూనిస్టు పార్టీ వారి విశ్వాసాన్ని వమ్ముచేయలేదు. వారి అశలను, ఆకాంక్షలను నెరవేర్చడానికి శాయశక్తులా కృషిచేసింది.



దాని ఫలితమే నేటి నవ చైనా. తరతరాల వలస పాలకుల దోపిడీ వల్ల ఒక నాడు అత్యంత వెనుకబడిన దేశంగానూ, ప్రజలు దుర్భర దారిద్య్రంలో మగ్గుతున్న దేశంగానూ ఉన్న చైనా నేడు ప్రపంచంలోనే అగ్రదేశాలలో ఒకటిగా అభివృద్ధి చెందింది. ప్రపంచంలోనే అమెరికా, జపాన్‌, జర్మనీల తర్వాత నాల్గవ ఆర్థిక వ్యవస్థగా రూపుదాల్చింది. ఒకప్పుడు తనపై పెత్తనం చేసిన గ్రేట్‌ బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ లాంటి సామ్రాజ్యవాద దేశాలను వెనక్కి నెట్టివేసింది. గత రెండు దశాబ్దాల కాలంలో చైనా దాదాపు ఏడాదికి 10 శాతం చొప్పున ఆర్ధికాభివృద్ధి సాధిస్తూ వచ్చింది. మరింత కచ్చితంగా చెప్పాలంటే 1979-2007 మధ్య కాలంలో చైనా సగటు వార్షికాభివృద్ధి రేటు 9.8 శాతం. ఇది అదే కాలంలో ప్రపంచ సగటు వార్షికాభివృద్ధితో పోల్చుకుంటే 6.8 శాతం అధికం. అంతేకాదు ప్రపంచ జిడిపిలో చైనా వాటా కూడా ఇంతే వేగంగా పెరిగింది.



1978లో ఇది 2.3 శాతం అయితే, 2006 నాటికి 14.5 శాతానికి పెరిగింది. జిడిపి పరిమాణం రీత్యా పోల్చుకున్నపుడు అమెరికా జిడిపి 12 ట్రిలియన్‌ డాలర్లు (ట్రిలియన్‌ అంటే లక్ష కోట్లు) అయితే, చైనా జిడిపి 4 ట్రిలియన్‌ డాలర్లు. ఇటీవల కాలంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పుకుంటున్న భారత దేశం జిడిపి 1 ట్రిలియన్‌ డాలర్లు మాత్రమే. 1 ట్రిలియన్‌ డాలర్ల క్లబ్బులో చేరామని మనం గొప్పగా సైతం చెప్పుకున్నాం. ప్రపంచ జిడిపిలో ి వాటా రీత్యా చూసుకుంటే 2000 నాటికి అమెరికా వాటా 27 శాతం, చైనా వాటా 12 శాతం, భారత దేశం వాటా కేవలం 5 శాతంవంద కోట్లకు పైగా జనాభా కలిగిన చైనాను 2050 నాటికల్లా మధ్య శ్రేణి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం తమ లక్ష్యమని 1980ల ఆరంభంలో చైనా కమ్యూనిస్టుపార్టీ నాయకత్వం ప్రకటించింది. కాని చైనా ఈ లక్ష్యాన్ని అనుకున్న సమయం కన్నా ఎంతో ముందుగానే సాధించే దిశగా పయనిస్తున్నది. 1980- 2000 మధ్య కాలంలో చైనా జిడిపి నాలుగు రెట్లు అధికమయింది.



చైనా తలసరి ఆదాయం 2020 నాటికి 3200 డాలర్లు కావాలన్నది లక్ష్యం. కాని 2008 నాటికే 3000 డాలర్ల తలసరి ఆదాయాన్ని చైనా సాధించింది. చైనా సాధించిన అభివృద్ధి గురించి మరింత సూటిగా చెప్పుకోవాలంటే 1952తో పోల్చుకున్నపుడు చైనా జిడిపి 400 రెట్లు పెరిగింది.


ఇంతటి అభివృద్ధిని చైనా తేలిగ్గా సాధించలేదు. అంతర్గతంగాను, బయటినుండి అనేక సవాళ్లను, అవరోధాలను ఎదుర్కొని విజయవంతంగా అధిగమించింది. ఈ అద్భుత అభివృద్ధి కమ్యూనిస్టుపార్టీ నాయకత్వాన స్థూలంగా సోషలిస్టు సూత్రాలకు కట్టుబడి సాగించిన పయనం మూలంగానే సాధ్యమయింది. చైనా విప్లవ అరవయ్యో వార్షికోత్సవం సందర్భంగా క్యూబాలో చైనా రాయబారి జావో రియాంగ్జి క్యూబా న్యూస్‌ ఏజన్సీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ ఇలా చెప్పారు:''చైనా చారిత్రక పురోగమన క్రమానికి అనుకూలమైన, అవసరమైన మార్గం సోషలిజమే అని గట్టిగా విశ్వసించిన చైనా ప్రజలు ఆ మార్గాన్ని ఎన్నుకున్నారు. సోషలిజం మాత్రమే అభివృద్ధిని కాపాడుతుంది, సాధిస్తుంది. సుసంపన్నమైన, నాగరిక, ప్రజాతంత్ర, సామరస్య దేశాన్ని సాధించడం మా లక్ష్యం.''



విప్లవం అనంతరం మొట్టమొదట కమ్యూనిస్టు పార్టీ చేపట్టిన ప్రధాన చర్య భూసంస్కరణలు. 1949-50లో అమలు జరిగిన భూసంస్కరణలు భూస్వాములనుండి స్వాధీనం చేసుకొని 40 శాతం భూమిని పేదలకు పంచి పెట్టింది. దీనిమూలంగా 60 శాతం మంది ప్రజలకు ప్రయోజనం కలిగింది. కొత్తగా భూమిని పొందిన రైతాంగం ఎంతో ఉత్సాహంగా పంటలు పండించారు. ఆ తర్వాత రైతులు సమిష్టి వ్యవసాయ క్షేత్రాలను కూడ అభివృద్ధి చేశారు. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులు ఎంతో వేగంగా పెరిగాయి. అదే సమయంలో అప్పటి సోవియట్‌ యూనియన్‌ పారిశ్రామికాభివృద్దికి అవసరమైన యంత్రాలను, నిపుణులను కూడ పంపించి సహకరించడంతో చైనా ఈ రంగంలోనూ పురోగతి సాధించింది. సరిగ్గా ఇలాంటి దశలోనే ఒక్కసారిగా ఆర్థికాభివృద్ధిని అధికం చేయాలన్న పేరుతో చైనా పార్టీ నాయకత్వం ''పెద్ద అంగతో ముందుకు'' (గ్రేట్‌ లీప్‌ ఫార్వర్డ్‌) అనే విధానాన్ని చేపట్టింది.



1958-62 మధ్య కాలంలో ఈ విధానం అమలు జరిగింది. పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన స్టీలు, బొగ్గు, విద్యుత్తు లాంటి వాటి ఉత్పత్తికి వూహకందని రీతిలో లక్ష్యాలను నిర్దేశించి వాటికోసం తీవ్రమైన వత్తిడికి ప్రభుత్వం పాల్పడింది. దీనితో నాణ్యతతో నిమిత్తం లేకుండా పరిమాణం మాత్రమే పెంచడంతో పెరిగిన ఉత్పత్తిలో వృధా వాటా అధికం అయ్యే పరిస్థితి ఏర్పడింది. మరోవైపున రైతులు స్వచ్ఛందంగా సమిష్టి క్షేత్రాలను ఏర్పాటుచేసుకోవడానికి బదులు, వారిని బలవంతంగా కమ్యూన్లుగా మార్చివేసింది. అందరూ కలిసి పనిచేయడం, ఒకేచోట తినడం లాంటి పద్ధతుల వల్ల వ్యక్తిగత ప్రోత్సాహకాలకు అవకాశం లేకపోవడంతో ఉత్పత్తి క్షీణించింది. ఇలాంటి మార్పులతో గొప్ప ముందడుగు అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయింది. ఎన్నో అనర్ధాలు కూడ సంభవించాయి. దీని తర్వాత అంతకన్నా పెద్ద పొరపాటుకు చైనా కమ్యూనిస్టు పార్టీ పూనుకుంది. అదే 1966 నుండి పదేళ్ల పాటు కొనసాగిన ''సాంస్కృతిక విప్లవం''.



భౌతిక ఉత్పత్తిని పెంచేశాము కాబట్టి ఇక మిగిలింది ప్రజల చైతన్యాన్ని పరివర్తన చేయడం మాత్రమే అన్న పేరుతో ఇది సాగింది. ఈ కాలంలో జరిగిన తప్పిదాలకు లెక్కేలేదు. లీ షావ్‌చీ, డెంగ్‌ సియావో పింగ్‌ లాంటి పార్టీ అగ్రనేతలను పెట్టుబడిదారీ మార్గానికి అనుకూలురని ముద్రవేసి వేధింపులకు, నిర్బంధాలకు గురిచేశారు. వయసు మీరిన మావోను అడ్డం పెట్టుకొని ఆయన భార్య జియాంగ్‌ కింగ్‌ నాయకత్వాన ''దుష్ట చతుష్టయం'' రాజ్యమేలింది. ఎంతో మంది మేధావులను శారీరక శ్రమ చేయాలనే పేరుతో విద్యాలయాలనుండి తొలగించి పంటపొలాలలోకి పంపడం లాంటి విపరీత చర్యలు ఈ కాలంలోనే చోటుచేసుకున్నాయి. విప్లవంలోను, అనంతర కాలంలోను పార్టీకి ఎంతో విశ్వాసంతో సేవలందించిన ఎందరో ఈ విధమైన నిర్బంధచర్యలకు గురయ్యారు. 1976 నాటికి చైనా కమ్యూనిస్టు పార్టీయే ఈ ఘోర తప్పిదాన్ని గుర్తించి, సవరించుకుంది. దాని ఫలితంగానే డెంగ్‌ సియావో పింగ్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.



డెంగ్‌ నేతృత్వంలో చైనా పార్టీ సంస్కరణల బాటను చేపట్టింది. అదే సమయంలో బారత్‌తో సహా ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థిక సంస్కరణలను చేపట్టాయి. నయా ఉదారవాద బాటలో చేపట్టిన ఈ చర్యలకు, చైనాలో సంస్కరణలకు కొన్ని పోలికలు ఉన్నప్పటికీ ఈ రెండు తరహాల నేపధ్యం మాత్రం పూర్తి భిన్నమైనది. విదేశీ పెట్టుబడులకు స్వేచ్ఛగా ప్రవేశించే అవకాశం కల్పించిన చైనా, తన దేశంలో అపారంగా లభించే మానవవనరులతో వాటిని సద్వినియోగం చేసుకొని తన ఉత్పత్తిని విపరీతంగా పెంచుకున్నది. సంపన్న దేశాలతో పోల్చుకున్నపుడు ఎంతో చౌకగా తయారయిన ఈ ఉత్పత్తులను ఆయా దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా తన విదేశీ మారక నిల్వలను బ్రహ్మాండంగా పెంచుకున్నది. ఈ సరళీకృత విధానాల వల్ల అనివార్యంగానే ప్రాంతీయ అసమానతలు, వ్యక్తుల ఆదాయాల మధ్య అసమాతనలు చోటుచేసుకున్నాయి. వాటిని గుర్తించి సరిచేసుకొని తనదైన రీతిలో చర్యలు చేపడుతున్నది. ప్రజాస్వామ్యం కోసం అంటూ తియాన్మెన్‌ స్క్వేర్‌లో విద్యార్థులు, యువకులు సమీకృతులైన ఘటనను ఆసరాగా చేసుకుని చైనాను అస్థిరత్వం పాల్జేయాలని పశ్చిమ దేశాలు ఎన్ని కుతంత్రాలకు పాల్పడినప్పటికీ చైనా ప్రభుత్వం దానిని సమర్ధవంతంగా అధిగమించింది.



ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలను పెంచుకున్న చైనా ఇటీవల సంభవించిన ప్రపంచ పెట్టుబడి దారీ సంక్షోభం ప్రభావానికి సహజంగానే గురయింది. అయినప్పటికీ, ఈ ప్రభావం నుండి బయట పడడానికి ఎంచుకున్న మార్గంలోనూ చైనా తన విశిష్టతను నిలుపుకున్నది. పెట్టుబడిదారీ దేశాలన్నీ ఈ సంక్షోభానికి కారణమయిన ఆర్ధిక సంస్థలు, పారిశ్రామిక సంస్థలకే సహాయాన్ని అందచేసి ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. సంక్షోభం మూలంగా ఉపాధి కోల్పోయి వీధులపాలయిన లక్షలాది సాధారణ ప్రజానీకాన్ని పట్టించుకోవడం లేదు. దీనికి పూర్తి భిన్నంగా చైనా ఇప్పటి వరకు విదేశీ మార్కెట్లను దృష్టిలో పెట్టుకొని సాగించిన ఉత్పత్తిని దేశీయ మార్కెట్‌లో విక్రయించడానికి, ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి అనేక చర్యలు తీసుకుంటున్నది. ప్రజల ఉపాధిని పరిరక్షించడానికి నేరుగా చర్యలు గైకొంటున్నది. ఇదే చైనా మార్గం ప్రత్యేకత. చైనా ఆర్థిక సంస్కరణలను చేపడుతున్నది, మేమూ చేపడుతున్నాము అని చెప్పే వారికి ఈ చర్యలు సమాధానం చెబుతాయి.



చైనా అనుసరిస్తున్న సంస్కరణల మార్గము, దాని ద్వారా సాధించిన అభివృద్ధి ఫలితాలు, కొన్ని ప్రతికూల ఫలితాలు మన ముందున్నాయి. ఏదేమయియినప్పటికీ చైనా సాధించిన అపారమైన ఆర్థికాభివృద్ధి తిరుగులేని వాస్తవం. అందుచేత సాధించిన విజయాలను పరిగణనలోకి తీసుకుంటూ, అది అనుసరించిన మార్గంలోని తప్పొప్పులను తులనాత్మకంగా అంచనా వేయవలసిన అవసరం ఉంది. అలాంటి విశ్లేషణ, గుణపాఠాలు మాత్రమే ప్రపంచ దేశాల ప్రజానీకానికి ఉపయోగపడతాయి.

Monday, 28 September 2009

దేవుడనేవాడు నాకెదురుపడితే!!

దేవుడే సృష్టికి కారణమన్న ఈశ్వర వాదాన్ని సాంఖ్యం తుత్తునియలు చేసింది. దేవుడికి ఏ గుణమూ లేదని మీరంటారు. ఏ గుణమూ లేనిదాని నుంచి గుణాలున్న ప్రపంచం ఎలా వచ్చింది? తెల్లదారంతో వస్త్రంచేస్తే తెలుపు రంగు గల వస్త్రం వస్తుంది. అదే నల్లదారం తోనైతే నలుపు వస్త్రం తయారౌతుంది. దారం రంగును బట్టి వస్త్రం రంగు నిర్ణయించబడినట్టే ప్రపంచంలోకి వస్తువుల గుణాలు అవి దేని నుంచి ఉద్భవించాయో దాని గుణాల నుండే సంక్రమిస్తాయి. ఒక వేళ దేవుడి నుండే ప్రపంచం ఏర్పడితే ఈ ప్రపంచానికున్న గుణాలన్నీ ఆ దేవుడి నుండి సంక్రమించినవేగదా. అంటే దేవుడికి గుణాలు ఉన్నట్టే గదా? దేవుడు నిర్గుణుడు అని మీరు చెప్పింది తప్పు అని తేలింది గదా!... ఈ విధంగా ఈశ్వరవాదులను సాంఖ్యం తన తర్కంతో ఎదుర్కొన్నది.


''ఓ దేవుడా! నువ్వు నన్ను డిపెం డెంటుగా సృష్టించావా? లేక ఇండిపెండెంటుగా సృష్టించావా? డిపెండెంటుగా ఐతే నేను చేసే పనులన్నిటికీ బాధ్యత నాదే. కనుక నేను సమాధానం చెప్పనక్కరలేదు. కాదూ, ఇండిపెం డెంటుగా సృష్టించానంటావూ! అలాగైతే నేను నీకు ఎందుకు సమాధానం చెప్పాలి? అని అడుగుతున్నాను.'' - అంటాడు గిరిశం కన్యాశుల్కం నాటకంలో. ఒక వికట హాస్య పాత్ర ధారి చేత ఈ డైలాగులు పలికించినా గురజాడ గిరీశం ద్వారా ఒక కీలకమైన ప్రశ్నను లేవ నెత్తాడు. దేవుడికీ, మనిషికీ సంబంధ ఏమిటన్నదే ఆ ప్రశ్న? భావవాదులు దేవుడే ప్రకృతిని సృష్టించాడని వాదిస్తారు. దాని నుంచి ఓ అడుగు ముందుకు పోయి దేవుని నిర్ణయాను సారమే అంతా జరుగుతుందని అని అంటారు. మరి ఆ దేవుడెలా వుంటాడు? ఎక్కడుంటాడు? ఉన్నా డని ఎలా చెప్పగలరు? అని అడిగితే దేవుడు ఆదిమధ్యాంత రహతుడని, సర్వశక్తి మంతుడని, నిరాకారుడు, నిర్గుణుడు అని సమాధానం చెప్తారు. ఏ ఆకారమూ లేని, ఏ లక్షణమూలేని దేవుడిని ఉన్నాడని ఎలా చెప్పగలరు? ఉన్నట్టు తెలుసుకోవటం ఏలా? ''ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు'' అని ప్రహ్లాదుడిచేత పోతన పలికిస్తాడు భాగవతంలో. వెదకి చూసినపుడు కంటికి కనపడాలంటే ఆకారం ఉండాలి. మరి దేవుడు నిరాకారుడన్నాడు కదా! ఎలా చూడటం? పోనీ ఆకారంలేకుంటేనే ఏ లక్షణమైనా ఉంటే తెలుసుకోవచ్చు. గాలికి ఆకారం లేదు గాని మన చర్మానికి తెలుస్తుంది గాలి ఉన్నట్టు. విద్యుత్తుకి ఆకారంలేదు కాని టెస్టర్‌ ప్లగ్గులో పెడితే కరెంటు ఉన్నదీ పోయినదీ తెలుస్తుంది. అలా దేవుడి గురించి తెలియాలంటే ఏదో లక్షణం ఉండాలి గదా. ఏ లక్షణమూలేక, ఏ గుణమూలేక, ఏ ఆకారమూ లేక - ఇక ఉన్నట్లు భావించడమెలా? ఉన్నాడన్న విషయాన్ని నిర్ధారించలేని పరిస్థితి ఉన్నపుడు ఇక ఆ దేవుడికీ, మనిషికీ సంబంధం ఏమిటి?


దేవుడే ప్రపంచాన్ని సృష్టించాడు అన్న వాదాన్ని చీల్చి చెండాడిన వారిలో పెద్దపీట వేయాల్సినది సాంఖ్యులకు. సాంఖ్యవాదాన్ని అతి ప్రాచీనమైనదిగా చరిత్ర కారులు గుర్తిం చారు. ఉపనిషత్తుల కాలానికి ముందే సాంఖ్యం ఉనికిలోకి వచ్చింది. బౌద్ధం క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలం నాటిది. దానికి ముందే సాంఖ్య వాదం ఉంది. అంటే నేటికి సుమారు 2700 సంవత్సరాల క్రితమే సాంఖ్యవాదం ప్రాచుర్యం లో ఉందన్నమాట. ఈ సాంఖ్యాన్ని తొలుత ప్రతిపాదించిన వాడు కపిలుడు. ఉపనిషత్తులలో (భాందోగ్యోపనిషత్‌, కఠోపనిషత్‌, శ్వేతాశ్వతా రోపనిషత్‌, వగైరాలలో) మహాభారతంలో, భగవద్గీతలో సాంఖ్యం గురించిన ప్రస్తావనలు, చర్యలు ఉన్నాయి. ఉపనిషత్తుల కాలంనుంచి శంకరుని వరకూ గల భావవాదులందరూ సాంఖ్యా వాదాన్ని ఖండించటానికి ఎంతో ప్రధా న్యత నిచ్చారు. దానిని బట్టి సాంఖ్యం ఆనాటికి చాలా శక్తివంతమైన భౌతికవాదంగా ప్రాచుర్యం పొందినట్టు తేలుతోంది.


సాంఖ్యులు ప్రతిపాదించిన వాదాన్ని స్వభావ వాదం అంటారు. ప్రకృతి అనాదిగా ఉన్నది. ఈ ప్రకృతికి స్వతహాగా ఉన్న స్వభావం వల్లనే నిరంతరం మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులలో భాగంగానే ప్రస్తుతం ఉన్న ప్రపంచం ఏర్పడింది. ఇందులో దేవుని ప్రసక్తే లేదు. ఆవు గడ్డితిని నీరు తాగుతుంది. అది దాని స్వభావం. అదే సమయంలో దాని శరీర స్వభావం వలన పొదుగులో పాలు ఏర్పడ తాయి. అవుదూడ ఆ పాలను తాగుతుంది. ఇదే విధంగా ప్రకృతి స్వభావం వల్లనే ఈ ప్రపంచం ఏర్పడింది. ఎగువ నుంచి పల్లానికి ప్రవహించడం నీటి స్వభావం. ఆ నీటికి ఎటువంటి చైతన్యమూ లేదు. కాని నీరు మానవులకి ఉపయోగపడుతుంది. చెట్లు, చేమలు నీటిపై ఆధారపడి బతుకుతాయి. నీటికున్న స్వభావం రీత్యానే ఇదంతా జరుగుతోంది. తప్ప వేరే ఇరత కారణం (దేవుడు) ఏదీలేదు.


దేవుడే సృష్టికి కారణమన్న ఈశ్వర వాదాన్ని సాంఖ్యం తత్తునియలు చేసింది. దేవుడికి ఏగుణమూ లేదని మీరంటారు. ఏ గుణమూలేని దాని నుంచి గుణాలున్న ప్రపంచం ఎలా వచ్చింది? తెల్లదారంతో వస్త్రంచేస్తే తెలుపు రంగు గల వస్త్రం వస్తుంది. అదే నల్లదారం తోనైతే నలుపు వస్త్రం తయారౌతుంది. దారం రంగుని బట్టి వస్త్రం రంగు నిర్ణయించబడినట్టే ప్రపంచంలోకి వస్తువుల గుణాలు అది దేని నుంచి ఉద్భవించాయో దాని గుణాల నుండే సంక్రమిస్తాయి. ఒక వేళ దేవుడి నుండే ప్రపం చం ఏర్పడితే ఈ ప్రపంచానికున్న గుణాలన్నీ ఆ దేవుడి నుండి సంక్రమించినవేగదా. అంటే దేవుడికి గుణాలు ఉన్నట్టే గదా? దేవుడు నిర్గుణుడు అని మీరు చెప్పింది తప్పు అని తెలింది గదా!... ఈ విధంగా ఈశ్వర వాదు లను సాంఖ్యం తన తర్కంతో ఎదుర్కొన్నది. ఈ ప్రపంచం పదార్ధమయం. పదార్ధానికి గుణాలుంటాయి. ప్రపంచాన్ని సృష్టించాడని మీరు చెబుతున్న దేవుడు నిర్గుణుడు. అంటే పదార్థరహితం. మూలకారణం పదార్ధరహితం అయితే అందులోనుంచి వచ్చిన ప్రపంచం కూడా పదార్ధరహితంగానే ఉండలి గదా. పదార్ధ రహితమైన దైవం నుంచి పదార్ధమయమైన ప్రపంచం ఎలా వస్తుంది? కార్యానికీ కారణానికీ మధ్య మూలకంగా ఉమ్మడిలక్షణం ఉండాలి. కారణంగా మీరు చెప్పే దేవుడికీ, కార్యంగా ఏర్పడిన ప్రపంచానికీ ఆ ఉమ్మడి లక్షణం ఏది? కనుక దేవుడు సృష్టికి మూల కారణం కాలేడు. తాను చెప్పిన దానిలోనే ఒకదానికొకటి పొసగకపోతే దానిని తర్కంలో స్వచోవ్యాఘాతం అంటారు. ఈశ్వరవాదం అంతా స్వవచోవ్యా ఘాతమేనని సాంఖ్యం రుజువు చేసింది.


దేవుడు సృష్టికర్తే అయితే ఎందుకోసం సృష్టించాడు? తన ఆనందం కొరకా? తన ఆనందం కోసం చేసేవాడు స్వార్ధపరుడు. దేవుడిని స్వార్ధపరుడు అని ఒప్పుకుంటారా? ఒప్పుకోలేరు. కనుక దేవుడు దయతో సృష్టించివుండాలి. ఎవరిపైన ఈ దయ? నిర్జీవ పదార్దాలపై దయ అంటే అర్ధంలేదు. సజీవ పదార్ధాలపై దయ అంటారా? అలాంటి దయ కలగాలంటే ముందు సజీవ పదార్ధాలు ఉండలిగదా? జీవపదార్ధాన్ని సృష్టించాక దయ కలిగిందా లేక దయ కలిగి సృష్టించాడా? ఏది ముందు? జీవాన్ని సృష్టించ కుండానే దయ ఎలా కలిగింది?


పోనీ, దయ ఏదో విధంగా ఎప్పుడో ఒకప్పుడు కలిగింది అనుకుందాం. ఈ దయ ఎందుకోసం? జీవుల బాధలు తొలగించ డానికా? అసలు బాధలు ఎందుకొచ్చాయి? బాధలుండాలంటే శరీరం ఉండాలి. దానిని దేవుడు ముందు సృష్టించాలి. అంటే దేవుడు బాధలకు నిలయమైన శరీరాన్ని సృష్టించా డన్నమాట. అంటే బాధలకు మూలకారణం దేవుడే అన్నమాట. దీనికి ఈశ్వర వాదులు అంగీకరిస్తారా?


ముందు దేవుడు శరీరం సృష్టిస్తే అప్పుడు బాధలు కలిగాయి. బాధలను తొలగిం చాలనే దయ దేవుడికి కలిగింది. అని అను కుంటే అసలు సృష్టికి మునుపు బాధలు కలిగే ఆస్కారం లేదు అని అర్ధం అవుతుంది. అప్పుడు దయ కలగాల్సిన అవసరం లేదు. అటువం టప్పుడు సృష్టి చేయాల్సిన అవసరమే లేదు.


అబ్బెబ్బే, అలాకాదు, సృష్టి తర్వాతనే దేవుడు దయామయుడైనాడని అంటారా? అంటే ముందు ప్రాణులను సృష్టించి, వారికి బాధలు కలిగించి ఆ తర్వాత దయతో ఆ బాధలను తొలగించేందుకు దేవుడు పూనుకున్నాడని ఒప్పుకుంటారా?


ఈశ్వరవాదులు తాము చెప్పిన దానిలో దేనినీ తామే ఒప్పుకోజాలని ఇరకాటం లో పడిపోయేంతగా సాంఖ్యం తన తార్కిక వాదనలను ప్రతిభావంతంగా ప్రయోగించింది. ఇంత ప్రతిభావంతమైన ప్రాచీనమైన సాంఖ్యం తర్వాతకాలంలో బలహీనపడింది. క్రీస్తుపూర్వం నాటి సాంఖ్యవాదానికి సంబంధించి క్రీస్తుశకం 11వ శతాబ్దానికి చెందిన ఈశ్వర కృష్ణ రచించిన 'సాంఖ్య కారిక' 14వ శతాబ్దం నాటికి చెందిన సాంఖ్య సూత్రాలు మాత్రమే లభ్యమౌ తున్నాయి. ఈశ్వర కృష్ణ ఆస్తికుడు. అతడు రచించాడన్న దానినిబట్టి సాంఖ్యం యొక్క మూలసిద్ధాంతం ఎంతగా పలుచనై పోయి వుంటుందో ఎంతగా వక్రీకరించే అవకాశం వుందో ఊహించుకోవచ్చు. సాంఖ్య సూత్రాలు కూడా ఆ విధంగా రూపొందినవే.


ఈశ్వరవాదాన్ని చెండాడడంపై కేంద్రీకరించినంతగా సాంఖ్యం సమాజంలోని వర్గ వైరుధ్యాలపై దృష్టి సారించలేదు. లోకాయతానికి, సాంఖ్యానికి ఇదే ప్రధానమైన తేడా. అందుకు భావవాద తత్వవేత్తలు లోకాయతాన్ని శత్రుపూరిత దోరణితో నాశనం చేస్తే కపిలుడికి అమితమైన గౌరవం ఇచ్చారు. దేవుడి అవతారం అని అభివర్ణించారు. అదే సమ యంలో సాంఖ్యం యొక్క ఆయువు పట్టయిన స్వభావ వాదాన్ని నామమాత్రంగా మిగిల్చి వుంచారు.


తర్వాత కాలంలో వేదాలను ప్రమా ణంగా సాంఖ్యులు అంగీకరించడంతో దాని ప్రగతిశీలత కనుమరుగైంది. పశ్చిమదేశాలలో భౌతిక వాదులందరిలోకి ప్రాచీనుడు హిరాక్లిటస్‌. ఇతడు క్రీ.పూ. 550-480 సంవత్సరాల మధ్య జీవించిన గ్రీకుతత్వవేత్త. అంతకన్న దాదాపు 400-500 సంత్సరాలకు మనుపే మనదేశంలో సాంఖ్యం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇదీ దీని చారిత్రక ప్రాధాన్యత.

written by ఎం.వి.ఎస్‌.శర్మ in prajasakti paper

స్వైన్‌ ఫ్లూ వ్యాప్తికి కారకులెవరు?

స్వైన్‌ఫ్లూ మహమ్మారి భయం, ఆ వ్యాధి కారక వైరస్‌ కంటే వేగంగా ప్రపంచ మంతటా వ్యాపించింది. ఒక వారం రోజులు మీడియా గగ్గోలు పెట్టింది. తరువాత ప్రచా రోధృతి తగ్గిపోయింది. వైరస్‌ మాత్రం ప్రపం చంలో చాలా చోట్లకు వ్యాపించింది. అయితే ఆ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య, చనిపోయినవారి సంఖ్య మొదట్లో అంచనా వేసిన దానికంటే చాలా తక్కువగా వున్నట్లు కనిపిస్తోంది.


మామూలు ఫ్లూ వ్యాధికి భిన్నమైన ఈ కొత్త ఫ్లూ వ్యాధి ప్రపంచంలోని ఏఏ ప్రాంతాలకు విస్తరించిందీ, ఎంతటి ప్రాణాంతక మైనది ఇప్పుడు చెప్పబూనటం తొందరపాటే అవుతుంది. ఈ క్రొత్త వైరస్‌ ఎలా మొదల యిందనే దానిపై మాత్రం వివాదం ముదురు తోంది.


ఈ కొత్త వైరస్‌ యొక్క ప్రస్తుత జన్యురూపం మొట్ట మొదటగా 1998లో అమెరికాలోని పందుల ఫారాల్లో కనిపించిందని వ్యాధి నివారణ, నిరోధం కోసం ఏర్పాటు చేసిన అమెరికన్‌ కేంద్రాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వైరస్‌ విజృంభణ మాత్రం మెక్సికోలో జరిగింది. అమెరికా బడా కంపెనీ స్మిత్‌ ఫీల్డుకు చెందిన పందులఫారాలు, పందిమాంసం ఫ్యాక్టరీలు ఉన్న మెక్సికన్‌ పట్టణాల్లో ఈ వ్యాధి బాగా ప్రబలింది. స్మిత్‌ ఫీల్డ్‌ అనుబంధ కంపెనీ అయిన గ్రంజాస్‌ కార్రోల్‌ డి మెక్సికో అనే సంస్థ మెక్సికోలో ఈ పారిశ్రామిక కార్యకలాపాలను నిర్వహిస్తోంది. స్మీత్‌ఫీల్డు కంపెనీ ఒకటే ఏడాదికి 1100 కోట్ల డాలర్లకు పైగా పంది మాంసం విక్రయాలు జరుపుతుంది. పంది మాంసం వుత్పత్తిక్రమంలో 2.6 కోట్ల టన్నల మేరకు జంతు సంబంధమైన వ్యర్ధ పాదార్థాలు అక్కడపోగుబడతాయని ''రోలింగ్‌స్టోన్‌'' పత్రిక 2006లో ప్రచురించిన ఒక వ్యాసంలో అంచనా వేసింది.


మెక్సికోలోని వెరాక్రజ్‌ రాష్ట్రంలోనూ, లాగ్లోరియా, పెరోట్‌ ప్రాంతాల్లోనూ నివసించే ప్రజలు అనేక సంవత్సరాలుగా ఈ రాకాసి పరిశ్రమ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే వున్నారు. 'ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం' అమల్లోకి వచ్చీరాగానే 1994లో ఈ భారీస్థాయి పందిమాంసం కర్మాగారం, దానికి అవసరమైన పందులను పెంచే ఫారాలు నెలకొల్పబడినాయి. సరిహద్దుల ఆవలినుంచి ఆమెరికా పెట్టుబడులు ''స్వేచ్చగా'' మెక్సికోలో ప్రవేశించటానికి ఈ ఒప్పందం ద్వారాలు తెరిచింది. అంతేకాదు అమెరికా కంపెనీలు మెక్సికోలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకో వటానికీ, ఎలాంటి అదుపూ లేకుండా శ్రమ దోపిడి చేయటానికీ, మొక్కజొన్న తదితర సరుకుల దిగుమతులతో మెక్సికో ఆర్థిక వ్యవస్థను ముంచెత్తటానికీ ఈ ఒప్పందం ద్వారా అమెరికన్‌ కంపెనీలకు అవకాశం లభించింది. అమెరికా లోని కొన్ని కఠినతర నిబంధనలనుండి తప్పు కోవడం కోసమే స్మిత్‌ ఫీల్డ్‌ కంపెనీ తన పందిమాంసం ఫ్యాక్టరీలను మెక్సికోలో నెల కొల్పిం దన్న అభిప్రాయం కూడా చాలా మందిలో వుంది. మాంసం కోసం పెంచే లక్ష లాది పందుల పెంటను ఎరువుగా నిలవ చేయటానికి కంపెనీ అక్కడ పెద్ద పెద్ద చెరువులు ఏర్పాటుచేసింది. మాంసం కోసం కోత దశకు చేరటానికి ముందుగానే చనిపోయే పందులను కుళ్లబెట్టటం కోసం బహిరంగ ప్రదేశంల్లోనే గుట్టలు గుట్టలుగా పడేసి వుంచటం జరుగుతోంది. ఈ వ్యర్ధ పదార్థాల నుంచి వచ్చే కంపుతో మైళ్లతరబడి వాయు కాలుష్యం జరుగుతోంది. అనేక మెక్సికన్‌ పట్టణాల భూగర్భజాలలు కూడా కలుషితమైనాయని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. పంది ఎరువు కుప్పలమీద జీవించే ఈగలు పరిసరా ల్లోని జనావాసాల్లో ముసురుతుంటాయి.


ఫ్లూ వ్యాధి బారిన పడిన పక్షుల రెట్టలను ఒక చోట నుంచి - వేరొక చోటకు చేరవేయటం ద్వారా ఈగలు బర్డ్‌ ఫ్లూ వ్యాధిని వ్యాప్తి చేయగలవనే విషయం అందరికీ తెలిసిందే. పందుల ఎరువులో పెరిగి పెద్ద వయిన ఈగలు, పక్షుల రెట్టల మీద కూడా వాలే అవకాశం వుంది. అందువల్ల, అవి పందులనుంచి, పక్షుల నుంచి, మనుషుల నుంచీ వైరస్‌ జన్యువులను కలగలిపే సాధనాలుగా తయారయినాయి. కొత్త వ్యాధి విజృంభణకు అదొక కారణమయ్యే అవకాశం వుంది.


స్మిత్‌ ఫీల్డ్‌ కంపెనీ పందుల ఫారం ఏర్పాటు చేయటాన్ని 2005లోనే స్థానిక ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు మెక్సికన్‌ వార్తాపత్రిక ''లాజొర్నాడా''లో ప్రచురితమైన వార్తలు తెలుపుతున్నాయి. భారీ స్థాయిలో పందుల పెంపకం, పందిమాంసం వుత్పత్తి కార్యకలాపాలు చేపట్టటాన్ని స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలే నడిచాయి. అయితే 'గ్రంజా కర్రోల్‌' కంపెనీతో కుమ్మక్కయిన వెరాక్రజ్‌ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు 2008లో అనేక మంది ఉద్యమ కారులను అరెస్టుచేసి జైళ్లలో కుక్కారు. స్వైన్‌ ఫ్లూ విజృంభణ అంతర్జాతీయ వార్తాంశం కావటానికి చాలా కాలం ముందే వందలాది మంది లాగ్లోరియా పట్టణ ప్రజలు శ్వాస సంబంధమైన వ్యాధులకు లోనైట్లు, అనేక మందిలో ఇది న్యూమోనియో రూపం దాల్చినట్లు వార్తలు వచ్చాయి. ఫ్లూ బారిన పడితే వచ్చే సమస్యల్లో న్యూమోనియా ఒకటి. 'వెరా టెక్ట్‌' అనే పేరుగల ప్రయివేటు కంపెనీ ఒకటి అమెరికాలో ఉంది. ప్రపంచం అంతటా ఎక్కడెక్కడ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నదీ గమనిస్తూ, నిర్ణీత రుసుము చెల్లించి తమ ఖాతాదారులుగా నమోదు చేసుకున్నవారికి సమాచారం అందించటమే ఈ కంపెనీ పని. వెరాక్రజ్‌ పట్టణంలో స్వైన్‌ ఫ్లూ ఉనికిని ఆ కంపెనీ ఒక నెల ముందుగానే గమనించింది. వ్యాధి నిరోదక కేంద్రానికి తెలియపరచింది. అయితే బయో టెర్రరిజం బూచిపైనే దృష్టినంతా కేంద్రీకరించి వున్న వ్యాధి నిరోధక కేంద్రాలు ఈ విషయాన్ని అనేక వారాలపాటు పట్టించుకో కుండా మూలపడేశాయి.


స్వైన్‌ ఫ్లూ వైరస్‌ బారిన పడినట్లు నిర్థారితమైన మొట్టమొదటి కేసు లాగ్లోరియా పట్టణ ప్రాంతంలోని ఒక యువకునిలో కనిపించింది. అతను తర్వాత కోలుకున్నాడు. తరువాత ఈ వైరస్‌ మెక్సికో సిటీకి, మెక్సికోలోని ఇతర ప్రాంతాలకూ వ్యాపించింది. వాటితో పాటే అమెరికాలోని న్యూయార్కు, కాలిఫో ర్నియా, టెక్సాస్‌ తదితర ప్రదేశాలకూ, ప్రపం చంలోని ఇతర ప్రదేశాలకూ వ్యాప్తి చెందింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మే మూడో తేదీన చేసిన ప్రకటన ప్రకారం ప్రపంచం మొత్తం మీద తొమ్మిది వందలకు పైగా స్వైన్‌ఫ్లూ కేసులు నిర్థారితమైనాయి. అందులో సగానికిపైన మెక్సికో లోనే నమోదయినాయి. జబ్బుసోకిన వారిలో ఇరవై మంది మృతి చెందారు. వారిలో పంతొమ్మిది మంది మెక్సికోవాసులు ఒక్కరు అమెరికా వాసి.


ప్రస్తుతం చెప్పుకుంటున్న ఈ స్వైన్‌ ఫ్లూ వైరస్‌, పందులను, పక్షులను, మానవులనూ ఆశించే వైరస్‌ల యొక్క జన్యు మిశ్రమం వల్ల కొత్తగా అభివృద్ధి చెందినదని ఆరోగ్య అధి కారులు తెలియజేశారు. అమెరాకాకు చెందిన ఆరోగ్య అధికారులు, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు కూడా దాదాపు ఒక దశాబ్ద కాలంపాటు 'హెచ్‌ 5 ఎన్‌-1' గా పిలవ బడుతున్న బర్డ్‌ ఫ్లూ వ్యాధి పైనే తమ దృష్టినంతా కేంద్రీకరించారు. బర్డ్‌ ఫ్లూ ప్రపం చం అంతటా వ్యాప్తి చెందింది. కాని ఎక్కడా మనుషుల జోలికి మాత్రం పోలేదు. కోళ్ళతోనూ, జలచర పక్షులతోనూ మమేకమై పనిచేస్తుండిన కొంత మందికి బర్డుఫ్లూ సోకినప్పటికీ ఒక మనిషి నుండి మరో మనిషికి బర్బుఫ్లూ సోకినదాఖలాలు లేవు.


కొత్తగా ముందుకొచ్చిన ఈ స్వైన్‌ ఫ్లూ భిన్నమైనది. హెచ్‌1 ఎన్‌1గా వ్యవహరిం చబడుతున్న ఈ వైరస్‌కు మనుషులకు సోకే ఫ్లూతో సామీప్యత ఉంది. ఒక మనిషి నుండి వేరొక మనిషికి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌ మనిషి నుండి - పందికి సోకిన సందర్భం ఒకటి కెనడాలో కనిపించింది. మెక్సికోలో ఉండి వచ్చిన కార్మికుడు కెనడా లోని ఈ పందుల ఫారాన్ని సందర్శించిన మీదట ఆ ఫారంలోని చాలా పందులకు ఈ వైరస్‌ సోకినట్లు గమనిం చటం జరిగింది.


వాస్తవం ఏమిటంటే - అమెరి కాలో కనిపించిన స్వైన్‌ ఫ్లూ కేసులు టూరిస్టుల్లోనూ, టూరిస్టులతో సన్నిహితంగా ఉన్నవారిలోనూ మాత్రమే గమనించ బడినాయి. అందువల్ల వలసవచ్చిన వారిపై దాడి చేయటం ఇప్పటికింకా పరిమిత స్థాయిలోనే ఉంది. అయితే బడా వాణిజ్య వర్గాల అధీనంలోని మాస్‌ మీడియా మాత్రం స్మిత్‌ఫీల్డ్‌ కంపెనీ ప్రమేయాన్ని గురించిగాని, నార్త్‌ కరోలినా, ఉంటా తదితర ప్రదేశాల్లోని భారీస్థాయి హాని కరమైన బహుళ జాతి మాంసం కర్మా గారాల ప్రమేయాన్ని గురించి గాని ఏమాత్రం ప్రస్తావించటం లేదు. పర్యా వరణానికీ, ప్రజారోగ్యానికీ ప్రమాదం తెచ్చిపెడుతూ లాభాలు గడిస్తున్న బడా బహుళజాతి కంపెనీలే అసలు నేరస్తులు. స్వైన్‌ ఫ్లూ నేరస్తులు వారే కనుక వారినే ప్రపంచం శిక్షిం చాలి.

note article took from the Markist Paper markist

'అణు'మానాలు తొలగించాలి

అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి)పై భారత్‌ సంతకం చేయాలన్న వత్తిడిని మరోసారి అమెరికా ప్రారంభించిందంటే కేంద్రంలోని యుపిఏ సర్కార్‌ను మరోసారి అనుమానించకతప్పటం లేదు. ఇటువంటి వత్తిళ్లు వస్తాయని గతంలోనే సిపిఎం ఇతర వామపక్షాలు కేంద్ర సర్కార్‌ను హెచ్చరించాయి. ఇప్పుడది నిజమని రుజువైంది. బుష్‌ విధానాల నుంచి మార్పుకు ప్రయత్నిస్తానని చెప్పి గద్దె నెక్కిన అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఇప్పుడు అదే బుష్‌ బూట్లలో కాళ్లుపెట్టి నడిచేందుకు పూనుకున్నారని వెల్లడైంది. అణ్వస్త్రాలు కలిగిన, లేని దేశాల పట్ల వివక్ష చూపుతున్న ఈ ఒప్పందాన్ని ఇంతవరకు అంగీకరించని నాలుగు దేశాలలో భారత్‌ ఒకటి. పాకిస్తాన్‌, ఇజ్రాయెల్‌, ఉత్తరకొరియా మిగిలిన మూడు. వీటిలో ఉత్తర కొరియా గతంలో ఒప్పందంపై సంతకం చేసింది.



అయితే అమెరికా తాను ఇచ్చిన హామీల నుంచి వైదొలగటంతో దానికి నిరసనగా ఉత్తర కొరియా ఎన్‌పిటి నుంచి వైదొలగింది. తన ప్రయోజనాలకోసం అమెరికా ముందుకు తెచ్చిన ఎన్‌పిటి ఒప్పందంతో తాము కూడా లబ్దిపొందే అవకాశం ఉంది కనుక అణుదేశాలుగా గుర్తింపు పొందిన బ్రిటన్‌,ఫ్రాన్స్‌,చైనా, రష్యా కూడా దానిని బలపరిచాయి. పాకిస్థాన్‌, ఇజ్రాయెల్‌ తన కనుసన్నలలో మెలిగే దేశాలే కనుక వాటి గురించి అమెరికా నోరెత్తదు. తాము అణ్వస్త్రాల వ్యాప్తికి వ్యతిరేకమేనని, అదే సమయంలో ముందుగా తాము వాటిని వినియోగించబోమని ఏకపక్షంగా ప్రకటించిన భారత్‌ తమ రక్షణ అవసరాల రీత్యా ఎన్‌పిటిపై సంతకం చేసేది లేదని గత నాలుగు దశాబ్దాలుగా చెబుతోంది. ఈ విధానం నుంచి వైదొలగబోమని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ గతంలో ప్రకటించారు.



ఇదే సమయంలో మన దేశాన్ని అణుదేశంగా గుర్తిస్తే ఎన్‌పిటిపై సంతకం చేయటానికి అభ్యంతరం లేదని తొలిసారిగా చెప్పటంతో ప్రధాని రెండునాలుకలతో మాట్లాడుతున్నారని, ఇంతకాలంగా అనుసరిస్తున్న విధానం నుంచి వైదొలగేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని వెల్లడైంది.


అమెరికాతో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందం(123 ఒప్పందం)లో ఎన్‌పిటిపై మనం సంతకాలు చేయాలన్న నిబంధనలేవీ లేవని 2006 ఆగస్టు17న, ఆతరువాత 2007లో కూడా పార్లమెంట్‌ ఉభయసభలలో చేసిన ప్రకటనలో కూడా నమ్మబలికారు. అయితే వామపక్షాల వత్తిడి మేరకు పార్లమెంట్‌కు సమర్పించిన 123 ఒప్పందంలో ఎన్‌పిటి గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఇదే సమయంలో మనదేశం దానిపై సంతకం చేయాలన్న మినహాయింపు ఇచ్చినట్లు కూడా లేదు. అయితే ప్రధాని పార్లమెంట్‌కు ఇచ్చిన హామీకి విరుద్ధంగా దానిలో ఒక మెలిక ఉంది.



అమెరికాతో కుదుర్చుకున్న 123 ఒప్పందానికి అణునిరాయుధీకరణ ఇరుసువంటిది. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకోవాలి. 1968లో ఉనికిలోకి వచ్చిన ఎన్‌పిటి ఒప్పందంలో ప్రొలిఫరేషన్‌ అనే పదానికి ఎలాంటి స్పష్టమైన నిర్వచనం ఇవ్వలేదు. దానికి విస్తరణ, వ్యాప్తి, పునరుత్పాదన అనే అర్ధాలున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం గుర్తింపు పొందిన అణు దేశాలు అప్పటికే తమ వద్ద ఉన్న అణ్వాయుధాల సంఖ్యను, వాటి విధ్వంసక శక్తిని పెంచుకోవచ్చు. మనం కుదుర్చుకున్న 123 ఒప్పందంలో కూడా ఈ పదం ఉంది గాని దానికి ఇక్కడ కూడా నిర్వచనాన్ని విస్మరించారు. అందువల్లనే మనకు ఎన్‌పిటి వర్తించదని యుపిఏ సర్కార్‌ భాష్యం చెప్పింది. అయితే 123 ఒప్పందంలో చెప్పిందేమిటి? అంతర్జాతీయ అణుశక్తి సంస్థ లక్ష్యాలు, రక్షణ వ్యవస్థకు అనుగుణంగా ఆధునిక అణుపరిజ్ఞానం పొందిన దేశాలు దానిని అణ్వాయుధాల తయారీకి వినియోగించ కూడదు.



అలా చేయాలంటే రెండు పక్షాలూ అందుకు అంగీకరించాలి. కనుక మనదేశం ఎన్‌పిటిపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ డొంకతిరుగుడు హామీల గురించి చెప్పకుండా తక్కువ చేసి చూపటం, విస్మరించినట్లు వ్యవహరించటంతో యుపిఏ సర్కార్‌ విశ్వసనీయతపై అనుమానాలు తలెత్తాయి. వామపక్షాలు దీనికి వ్యతిరేకంగానే యుపిఏ సర్కార్‌కు మద్దతు ఉపసంహరించాయి. సమాజవాదిపార్టీ మరికొన్ని పార్టీల మద్దతుతో యుపిఏ సర్కార్‌-1 విశ్వాసపరీక్షలో గట్టెక్కింది. ఆ తరువాత ఒప్పందం కుదిరే వరకు దాని గురించి పట్టుబట్టని అమెరికా ఇప్పుడు దాన్ని మళ్లీ ముందుకు తెచ్చింది కనుక అనుమానించాల్సి వస్తోంది.పిట్స్‌బర్గ్‌లో జరిగిన జి-20 సమావేశాలకు ముందుగా భద్రతా మండలిలో అమెరికా ప్రతిపాదించి ఆమోదం పొందిన తీర్మానంలో నేరుగా భారత్‌ పేరెత్తకపోయినా వచ్చే ఏడాది జరిగే ఎన్‌పిటి సమీక్షా సమావేశాలలోగా అన్ని దేశాలూ ఒప్పందాన్ని ఆమోదించాలని, అణ్వస్త్రవ్యాప్తి నిరోధానికి సహకరించాలని కోరింది.



తాము కూడా సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిరోధ ఒప్పందం(సిటిబిటి)పై సంతకం చేస్తామని ఇప్పుడు ఒబామా సర్కార్‌ నమ్మబలుకుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఇప్పటివరకు ఎందుకు ఆమోదించలేదంటే సాంకేతికంగా తామాపని చేయకపోయినా పరీక్షలను నిలిపివేశాము కదా అని అడ్డగోలు వాదనకు దిగుతోంది. అదే వాదన తమకు మాత్రం ఎందుకు వర్తించదని ప్రశ్నించకుండా ముందు జాగ్రత్తగా తాము కూడా ఆమోదిస్తామని చెబుతోంది. అయితే అందుకు అవసరమైన మూడింట రెండువంతుల మెజారిటీ అమెరికా పార్లమెంట్‌లో ఒబామాకు లేదన్నది గమనించాలి. అవసరం లేకుండానే జపాన్‌పై అణుబాంబులను ప్రయోగించి మారణకాండకు పాల్పడటమేగాక ప్రపంచాన్ని భయపెట్టిన అమెరికానే ఈ అణ్వాయుధపోటీకి ఆజ్యం పోసింది.



ఇంతజరిగినప్పటికీ మరోసారి తాము ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోమని చెప్పటానికి అమెరికా సిద్దం కావటం లేదు. భద్రతా మండలి తీర్మానంపై మనదేశం స్పందించిన తీరు హర్షణీయమే. అందుకు కట్టుబడి ఉంటుందా అన్నదే అనుమానం. ఇరాన్‌ ఎన్‌పిటిపై సంతకాలు చేసినప్పటికీ రహస్యంగా అణ్వాయుధాల తయారీకి పూనుకుందన్న తప్పుడు ప్రచారంతో దానిని సాధించేందుకు పూనుకుంది. అందువలన అమెరికాను నమ్మటానికి వీలులేదు. ప్రపంచవాణిజ్య సంస్థలో వ్యవసాయసబ్సిడీలపై అమెరికా, ఇతర ధనికదేశాల వైఖరిని ఇంతకాలం వ్యతిరేకించిన మనదేశం ఇప్పుడు దోహాదఫా చర్చలకు ముగింపు పలికే చొరవకు పూనుకుందంటే మనం లొంగిపోయామా? ధనిక దేశాలు దిగివచ్చాయా అంటే రెండవదానికి ఎలాంటి రుజువు లేదు. అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం విషయంలో కూడా ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా మన దేశాన్ని అణుదేశంగా గుర్తించినా లేకున్నా ఆ ఒప్పందాన్ని అంగీకరించేదిలేదని పార్లమెంటుకు, దేశ ప్రజలకు విస్పష్ట హామీ ఇవ్వాలి. దీనిపై తలెత్తిన అన్ని అనుమానాలను తొలగించాలి.

Note:article took from prajashakti paper

Friday, 25 September 2009

మేధో సంపత్తి హక్కులపై కపట నాటకం

మేధో సంపత్తి హక్కుల వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. గతంలో సమర్పించిన నివేదికనే కమిటీ 2009 ఏప్రిల్‌లో తిరిగి సమర్పించింది. పార్లమెంటు సమావేశాలు వాయిదా పడిన తరుణంలో దీనిని సమర్పించడంలో ఉద్దేశం దేశంలో ప్రజలచే ఎన్నుకోబడిన అత్యున్నత పార్లమెంటు పరిశీలన నుంచి తప్పించుకోవడమేనని స్పష్టమవుతోంది. దీనిని ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించరాదు.


ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యుటిఓ) ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందంపై పద్నాలుగేళ్ళ క్రితం భారతదేశం సంతకం చేసింది. దానిపైనే కాకుండా దానికి అనుబంధంగావున్న పలు ఒప్పందాలపై కూడా సంతకాలు చేసింది. ఇలాంటి వాటిల్లో వాణిజ్య సంబంధింత మేధో సంపత్తి హక్కుల (ట్రిప్స్‌) ఒప్పందం ఒకటి. ట్రిప్స్‌ ఒప్పందం 'మేధో సంపదకు' రక్షణ కల్పిస్తుంది. అంటే, మనకున్న సరికొత్త ఆలోచనలు నూతన సృష్టికి దారితీసినట్లయితే పేటెంట్లు, కాఫీరైట్స్‌, ట్రేడ్‌మార్క్‌ తదితరాల ద్వారా దానిపై యాజమాన్యం లభిస్తుంది. ఈ సందర్భంగా ఒక సంగతి గుర్తు చేసుకోవలసి ఉన్నది. అదేమంటే, డబ్ల్యుటిఓ పరిధిలోకి ట్రిప్స్‌ను తీసుకు రాకూడదంటూ ఉరుగ్వే దఫా గాట్‌ చర్చలలో భారత్‌ సహా పలు వర్ధమాన దేశాలు ఉద్ఘాటించాయి. ఈ సందర్భంగా అమెరికా, ఐరోపా, జపాన్‌ల నుంచి ఈ దేశాలు తీవ్ర ఒత్తిడినే ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రపంచంలోని అన్ని దేశాలు తమ చట్టాలలో మేధో సంపద హక్కుల అంశాన్ని చేర్చాలంటూ అమెరికా తదితర దేశాలు పట్టుపట్టాయి. తమకున్న ప్రయోజనాల రీత్యా ఈ అంశాన్ని బడా ఔషధ కంపెనీలు, సాప్ట్‌వేర్‌ కంపెనీలు దీన్నొక యుద్ధంగా మార్చివేశాయి. అసమానుల మధ్య జరిగిన ఈ యుద్ధంలో వర్ధమాన దేశాలు పరాజయం పాలుకాగా, ట్రిప్స్‌ వాస్తవ రూపం దాల్చింది. ఇతర వర్ధమాన దేశాలు భారత్‌ను విడిచిపెట్టటంతో సంతకాలు చేయక తప్పలేదని మన ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించింది. మన దేశం చర్చలలో సరిగ్గా పాల్గొన్నదా లేదా అన్న విషయాన్ని చర్చించటానికి ఇది సమయం కాదు. అయితే ట్రిప్స్‌ ఒప్పందం జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమంటూ భారతప్రభుత్వం తన వైఖరిని ప్రకటనల రూపంలో వెల్లడించింది.


పేటెంటు ఉత్తర్వు-2004



ఒక్కసారి 2004 ప్రథమ పాదానికి వెళ్దాము. ఆనాటి బిజెపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 1970ల నాటి పేటెంబ్‌ చట్టానికి సవరణలను ఖరారు చేసింది. ఒకసారిగాని ట్రిప్స్‌ ఒప్పందంపై సంతకం చేస్తే దేశీయంగా వున్న పేటెంట్‌ చట్టాన్ని సవరించి తీరాల్సిందే. ఇందుకుగాను భారత్‌వంటి వర్ధమాన దేశాలకు పదేళ్ళ గడువు ఇచ్చారు. అంటే 2005 జనవరి నాటికి పేటెంటు చట్టాన్ని సవరించాలన్న మాట. ట్రిప్స్‌ ఒప్పందం ప్రధానంగా ఔషధ, సాఫ్ట్‌వేర్‌ రంగాలను దెబ్బతీసేదిగా ఉన్నది. 1970 నాటి భారతీయ పేటెంటు చట్టం ప్రకారం పేటెంటు పరిధిలోకి ఔషధాలు రావు. కాని ఇప్పుడు ట్రిప్స్‌ ఒప్పందాన్ని అనుసరించి ఔషధాలకు కూడా పేటెంటు వర్తిస్తుంది. ఈ ఒప్పందంలో కొన్ని వెసులుబాట్లున్నాయి. పేటెంటు హక్కు కల్పిస్తున్నప్పటికీ ఔషధాలను అందరికీ అందుబాటులో ఉంచే అవకాశం ఉన్నది. 2004 నాటికి ఎన్డీయే ప్రభుత్వం ముందున్న పరిస్థితి ఇది. కాని ఈ మేరకు ఎన్డీయే తయారు చేసిన ముసాయిదా ఎందుకూ పనికి రాలేదు. అదృష్టవశాత్తు 2004 ఎన్నికలలో ఎన్డీయే ఓడిపోయింది. దానితో ఈ సవరణలు పార్లమెంటులో చర్చకు రాలేదు.


2004 డిసెంబరు 26న భారతదేశం సునామీ ప్రమాదంలో చిక్కుకున్నది. వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సమయంలోనే యుపిఏ ప్రభుత్వం భారతీయ పేటెంటు చట్టానికి ఉత్తర్వు రూపంలో సవరణలను ముందుకు తీసుకువచ్చింది. ఈ ఉత్తర్వు మునుపటి ఎన్డీయే దారిలోనే ఉన్నది. పార్లమెంటులో ఎలాంటి చర్చకూ అవకాశం ఇవ్వకుండానే దీనిని ఆమోదించాలని ప్రభుత్వం ప్రయత్నించింది. ఇది తాను తయారు చేసిన ముసాయిదాయే కనుక ఎన్డీయే కూడా దీనికి సుముఖంగానే ఉన్నది. 2004 నాటి పేటెంట్‌ సవరణ ఉత్తర్వు తీవ్ర విమర్శలనే ఎదుర్కొన్నది. ఈ సవరణలు అమలులోకి వస్తే లక్షలాది భారతీయులకు కొత్తరకాల మందులు అందకుండా పోతాయి. కనుకనే ఈ సవరణలకు వ్యతిరేకంగా అనేక సంస్ధలు ఆందోళనకు దిగాయి. ఒక్క భారతదేశంలోనే కాక ప్రపంచమంతటా వివిధ సంస్ధల ఆధ్వర్యంలో ప్రదర్శనలు సాగాయి. అంతేకాక, సవరించిన భారతీయ చట్టం అమలైతే భారతీయ కంపెనీలు చౌక ధరలకు మందులను అమ్మలేవు. ప్రస్తుతం ఆసియా, ఆఫ్రికా దేశాలలో ఈ మందులు అమ్ముడవుతున్నాయి. మార్క్సిస్టు పార్టీ నేతృత్వంలో వామపక్షాలు కూడా గొంతు కలపటంతో ఈ ఉద్యమానికి మరింత వూపు వచ్చింది.


ఎన్డీయే మద్దతు ఉండటంతో యుపిఏ ప్రభుత్వంలో ఎలాంటి చలనమూ లేకుండా పోయింది. ప్రభుత్వాన్ని కలవరపరిచే ఉద్దేశంతో పార్లమెంటులో ఈ ఉత్తర్వును వ్యతిరేకించాలని 2005 మార్చిలో బిజెపీ నిర్ణయించటంతో యుపిఏలో కదలిక వచ్చింది (2004లో తన ప్రభుత్వం తయారు చేసిన సవరణలనే వ్యతిరేకించాలని బిజెపీ నిర్ణయించింది!). పార్లమెంటులో ఓటమిని తప్పించుకునేందుకై యుపిఏ ప్రభుత్వం విధిలేక వామపక్షాలతో చర్చలకు అంగీకరించింది. మొత్తంమీద వామపక్షాలు, ఇతర బృందాలు చేసిన ప్రతిపాదనలు సవరణలలో చోటుచేసుకున్నాయి. రెండు అంశాలపై మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదు. ఇందులో ఒకటేమంటే, కొత్తగా కనిపెట్టిన రసాయన మూలకాలకే పేటెంట్లు వర్తించేలా వాటిపై ఆంక్షలు విధించాలనడం. సూక్ష్మాంగాలపై పేటెంట్లు లేకుండా చేయాలన్నది మరొకటి. ఈ ప్రతిపాదనలను నిపుణుల బృంద పరిశీలనకు పంపుతానని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ విధంగా పార్లమెంటులో భారతీయ పేటెంటు చట్టం ఆమోదం పొందింది.


మషేల్కర్‌ కమిటీ


అనుకున్నట్లుగానే ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. దీనిని పేటెంటు చట్టంపై సాంకేతిక నిపుణుల బృందం (టిఇజి) అని పిలిచారు. డాక్టర్‌ ఆర్‌.జి. మషేల్కర్‌ ఈ కమిటీకి నేతృత్వం వహించారు. సిఎస్‌ఐఆర్‌ మాజీ డైరక్టర్‌గా ఈయన పనిచేశాడు. కార్పొరేట్‌ ప్రసారమాధ్యమంలో ఒక భాగం ఈయనపట్ల సానుభూతితో ఉన్నది. దేశంలోని అత్యున్నత శాస్త్రీయ సంస్ధలను ఆధునికీకరించాడన్న పేరు ఆయనకు ఉన్నది. ఈయన హయాంలోనే సిఎస్‌ఐఆర్‌ కార్పొరేట్‌ సంస్ధగా మారిందని చెప్తారు. భారతీయ శాస్త్రానికీ, భారతీయులకూ పేటెంట్లు ఉపయోగపడగలవన్న అభిప్రాయంతో ఆయన ఉన్నారు. ఆయనను ఎంపిక చేసుకోవటంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ఉద్దేశాలు లేకపోలేదు. డాక్టర్‌ మషేల్కర్‌ అయితే భారతీయ పేటెంటు చట్టం అవసరం లేదనటానికి తగిన ఆధారాలు చూపగలడని, వాస్తవంలో రబ్బరు స్టాంపులా పనిచేస్తాడని ప్రభుత్వం భావించింది. 2006 డిసెంబరులో ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. సవరణలు అవసరం లేదని ఈ నివేదిక పేర్కొన్నది. కొన్ని రోజుల తరువాత ఈ నివేదికను విడుదల చేశారు. లండన్‌కు చెందిన ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ ఇన్‌స్టిట్యూట్‌ ఈ కమిటీకి సమర్పించిన పత్రమే ఎలాంటి మార్పులేకుండా కమిటీ నివేదికగా వెలువడినట్లు వెల్లడైంది. ఈ కమిటీకి అస్త్రా జెనెకా, గ్లాక్సో స్మిత్‌ క్లిన్‌ తదితర బహుళజాతి సంస్ధలు పెద్దయెత్తున విరాళాలు ఇచ్చాయి. దీనినిబట్టి కూడా ఈ కమిటీ స్వభావం అర్థమవుతున్నది. 'అనుకోకుండా సాంకేతిక అవకతవకలు' నివేదికలో చోటు చేసుకున్నాయంటూ డాక్టర్‌ మషేల్కర్‌ స్వయంగా అంగీకరించాడు.


ప్రజలలో ఆందోళన పెరగటంతో కమిటీ అధ్యక్ష పదవికి మషేల్కర్‌ రాజీనామా చేశారు. కమిటీ తన నివేదికను వెనక్కు తీసుకున్నది. వాణిజ్య మంత్రిత్వ శాఖ మాత్రం తన వెబ్‌సైట్‌లో పాతచ నివేదికనే ప్రదర్శిస్తున్నది. ప్రభుత్వం మాత్రం దీని గురించి ఏమీ మాట్లాడటం లేదు. కమిటీ మరలా గత ఏప్రిల్‌లో మరో నివేదిక సమర్పించినట్లు ప్రకటన వెలువడింది. అయితే ఈ కొత్త నివేదికలో పెద్దగా మార్పులేమీ లేవని తెలుస్తున్నది. పేటెంటు చట్టాలలో నిపుణునిగా పేర్గాంచిన ప్రొఫెసర్‌ కార్లొస్‌ కోరియా చెప్పిన దానిని సందర్భశుద్ధి లేకుండా ఈ నివేదికలో చాలా ఎక్కువగా ఉటంకించడం జరిగింది. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత నివేదికను సమర్సించడం జరిగింది. అంటే పార్లమెంటును తప్పించుకోవాలని ప్రభుత్వం చూస్తున్నదన్నమాట. ఏదియేమైనా తిరిగి సమర్పించిన ఈ నివేదికను పార్లమెంటులో చర్చకు పెట్టాలి. అప్పుడే పార్లమెంటుకు తగిన గౌరవమిచ్చినట్లవుతుంది.

Thursday, 24 September 2009

మీడియా దాడి వెనుక..............!

నిప్పులేనిదే పొగరాదంటారు. అయితే , నిప్పు లేకుండానే పొగ ఎలా పుట్టించవచ్చో మీడియా రుజువు చేసింది. భారత్‌- చైనా సరిహద్దుల్లో ఎలాంటి ఘర్షణలు లేకపోయినా ఏదో జరిగిపోయిందని, యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నాయని మీడియాలో ఒక సెక్షన్‌ ఊదరగొట్టడం దీనికి పరాకాష్ట. ఈ అతిపెద్ద ఆసియన్‌ ఇరుగుపొరుగు దేశాలు రెండూ వివిధ రంగాల్లో స్నేహపూర్వక, ద్వైపాక్షిక సహకార సంబంధాలను మెరుగుపరచుకుంటూ ముందుకు సాగుతున్న తరుణంలో 'టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా' పత్రిక భారత్‌ భూభాగంలోకి చైనా చొరబడి, ఇద్దరు భారత సైనికులను గా యపరిచిందంటూ నిరాధారమైన ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ వెంటనే అదే గ్రూపు సంస్థకు చెందిన ఒక టీవీ న్యూస్‌ చానెల్‌ దానిపై కొంతమంది నిపుణులతో చర్చ నిర్వహించింది. ఆ ఛానెల్‌ను చూసి ఈ చానెల్‌, ఈ చానెల్‌ను చూసి ఇంకో చానెల్‌ ఇలా ఒకటి కొకటి పోటీ పడి అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు ఈ కట్టుకథలకు మరికొన్ని జోడించి విస్తృతంగా ప్రచారం చేశాయి. అటు ప్రింట్‌ మీడియా, ఇటు ఎలక్ట్రానిక్‌ మీడియా కూడబలుక్కున్నట్టుగా ఈ ప్రచారం సాగించాయి. ఎలాంటి ఆధారాలు చూపకుండా అనధికారిక సమాచారం పేరుతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం మీడియా నైతిక ప్రమాణాలకు విరుద్ధమని తెలిసి కూడా ఇలాంటి నీతిబాహ్యమైన ప్రచారానికి పాల్పడడం బాధ్యతా రాహిత్యమే తప్ప మరొకటి కాదు. చైనాతో గల సరిహద్దుల్లో ఎప్పటి మాదిరిగానే సామరస్యపూర్వక వాతావరణం కొనసాగుతోందని ఆర్మీ చీఫ్‌ చెప్పిన తరువాత కూడా మీడియా పదేపదే అదే పాట పాడింది. భారత్‌, చైనా ప్రభుత్వాలు రెండూ ఈ వార్త తప్పు అని స్పష్టం చేసిన తరువాత కూడా చైనా అంటే భయమా? ఈ చొరబాట్లను ఖండించరేం? అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కథనాలను మీడియా కొనసాగిస్తోంది. ఇంతవరకు జరిగింది చాలు. ఇప్పటికైనా ఈ దుష్ప్రచారాన్ని కట్టి పెట్టమని ప్రభుత్వం మొత్తుకుంటున్నా మీడియా ధోరణిలో మార్పు లేదు. దీంతో మొదట ఈ తప్పుడు వార్తను పుట్టించిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా విలేకరులిద్దరిపైన కేసు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తం ఉదంతంలో ప్రభుత్వ తప్పిదం కూడా కొంత వుంది. తన దగ్గర వున్న సమాచారాన్ని ప్రజల ముందుంచకుండా తాత్సారం చేసింది. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే.. అయితే దీనిని సాకుగా చూపి లేని చొరబాట్లను ఉన్నట్లుగా మీడియా చిత్రీకరించడం దుర్మార్గం.


మీడియా ఈ విధంగా వ్యవహరించడం వెనక ఉన్న శక్తులు ఏమిటో, వాటి ఎజెండా ఏమిటో తెలుస్తూనే ఉంది. ఆసియాలో బలమైన శక్తులుగా ఎదుగుతున్న భారత్‌, చైనాలు కలిస్తే ప్రపంచాధిపత్యానికి అర్రులు చాస్తున్న అమెరికా యత్నాలకు గండి పడుతుంది. అందుకే చైనాను ఎదగనీయకుండా చేయడానికి నానా గడ్డి కరుస్తోంది. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా చైనా మాత్రం 9 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతుండడం అమెరికాను కలవరపరుస్తోంది. అదీగాక ఆసియాలోని ఇరుగుపొరుగు దేశాలతో చైనా మంచి సామరస్య పూర్వక సంబంధాలను నెరపుతోంది. భారత్‌తో సరిహద్దు సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న కృతనిశ్చయాన్ని వ్యక్తం చేసింది. ఆ దిశగా చర్చల ప్రక్రియను కూడా వేగవంతం చేసింది. 2005లో చైనా ప్రధాని వెన్‌జియా బావో, 2006 నవంబరులో అధ్యక్షుడు జింటావో భారత్‌లో పర్యటించడం, గతేడాది జనవరిలో భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చైనాలో మూడు రోజులు పర్యటించడం, అదే సంవత్సరం ఆగస్టులో ఒలింపిక్‌ సంబరాలకు యుపిఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, విదేశాంగ మంత్రి హోదాలో ప్రణబ్‌ ముఖర్జీ హాజరవడం, వివిధ స్థాయిల్లో పరస్పర సహకారానికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటివి ఈ రెండు దేశాల మధ్య బలపడుతున్న మైత్రీ బంధానికి నిదర్శనం. అంతేకాదు భారత్‌, రష్యా,లతో కలిసి ఒక వేదికను, బ్రెజిల్‌, రష్యా, ఇండియాలను కలిపి మరో వేదికను, అయిదు ప్రధాన వర్థమాన దేశాలతో కలిపి ఇంకో వేదికను ఏర్పాటు చేయడం ద్వారా అమెరికా ఇతర సంపన్న దేశాల ఏకపక్ష ధోరణులకు చెక్‌ పెట్టేందుకు చైనా ప్రయత్నిస్తున్నది. దీంతో చైనాను దెబ్బతీస్తేగాని తమ ప్రయోజనాలు నెరవేరవని భావించిన అమెరికా ఇప్పటికే చైనాతో వాణిజ్య రంగంలో ప్రచ్ఛన్న యుద్ధానికి తెరతీసింది. ఇప్పుడు భారత్‌- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే చర్యలకు మీడియా ద్వారా ప్రయత్నిస్తోంది. గతంలో అమెరికాతో అణు ఒప్పందాన్ని ఏ మీడియా అయితే బాహాటంగా సమర్ధించిందో అదే మీడియా ఇప్పుడు భారత్‌ను చైనాకు దూరం చేసి, అమెరికాకు మరింత దగ్గరకి చేర్చాలని తహతహలాడుతోంది. సరిహద్దుల్లో లేని ఉద్రిక్తతలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న అరుణ్‌ శౌరీ వంటి ప్రబుద్ధులు, బిజెపి/ఆరెస్సెస్‌ నాయకులు, కొందరు మాజీ సైనికాధికారులు ఈ బాపతు అంతా బయటకు దేశ భక్తులుగా పోజు పెడుతూ ప్రతిదానిని కమ్యూనిస్టు వ్యతిరేక కళ్ళద్దాలలో చూస్తారు. తద్వారా అమెరికా ప్రయోజనాలను పరిరక్షిస్తుంటారు. వీరి అసలు స్వరూపమేమిటో తెహల్కా కుంభకోణంలో నగంగా బయటపడింది. ఇప్పుడు భారత్‌, చైనాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం వెనక అమెరికా ఆయుధ వ్యాపారుల ప్రయోజనాలు కూడా దాగివున్నాయి.


పాకిస్తాన్‌ను బూచిగా చూపి భారత్‌కు, భారత్‌ను శత్రువుగా చూపి పాకిస్తాన్‌కు ఆయుధాలు అమ్ముకున్న అమెరికా ఇప్పుడు చైనానుంచి భారత దేశ భద్రతకు ప్రమాదం ముంచుకొస్తోందన్న భయానక వాతావరణాన్ని సృష్టించి భారత ఆయుధాల కొనుగోళ్ల బడ్జెట్‌ను మరింత పెంచేలా ఒత్తిడి తీసుకురావాలన్ని చూస్తున్నది. అమెరికానుంచి పెద్దయెత్తున ఆయుధాలు కొనుగోలు చేసుకుంటున్న దేశంగా భారత్‌ ఇప్పటికే పేరొందింది. జిడిపి లో 7 శాతం వరకు రక్షణ వ్యయానికి భారత్‌ వెచ్చిస్తోంది. ఈ సంవత్సరం 600 కోట్ల డాలర్లను ఆయుధాల కొనుగోలుకు భారత ప్రభుత్వం వెచ్చించింది. ఆయుధాల అమ్మకాలను పెంచుకోవాలంటే ఇటువంటి ఉద్రిక్తతలు సృష్టించడం అమెరికాకు చాలా అవసరం. అదే సమయంలో చైనాను బూచిగా చూపడం ద్వారా భారత్‌ అమెరికా వ్యూహాత్మకమైత్రి సరైనదేనన్న భావన కలిగించాలని చూస్తోంది. భారత ప్రజలు దీనినంతటినీ గమనిస్తున్నారు. గనుక మీడియా ఇప్పటికైనా ఇటువంటి కట్టుకథలకు స్వస్తి చెప్పి తమ మధ్య సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న భారత్‌, చైనా ప్రభుత్వాల సంకల్పానికి చేతనైతే సహకరించాలి. అంతేకానీ, ఇటువంటి అసత్య ప్రచారంతో వాతావరణం కలుషితం చేయొద్దు.

ఎవరి కోసం ఈ యుద్ధోన్మాదం ?

ప్రభుత్వ నిధులను భోంచేస్తూ, మాజీ ఉన్నతాధికారుల సారథ్యంలో నడుస్తున్న సంస్థలు కూడా ఈ రకమైన ఉన్మాదాన్ని రెచ్చగొట్టటంలో తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. ఎంత విచారకరం! ఇటీవల సర్కారీ సంస్ధ ఒకటి తను నడిపే పత్రికలో అరుణ్‌శౌరి వ్యాసాన్నొకదానిని ప్రచురించింది. చైనాను శత్రువుగా తప్ప మరో రకంగా చూసే గుణమే ఈయనకు లేదు. ఉద్యోగ విరమణ చేసిన సైనికాధిóకారులు కొందరు ఈ మేధావుల సరసన చేరి ప్రసారమాధ్యమాన్ని వేదికగా చేసుకుని ప్రస్తుత దుష్ప్రచారానికి మహోత్సాహంతో తోడ్పడుతున్నారు.

1913లో ఎవరు లాభపడతారు? అన్న శీర్షికన వ్లదిమీర్‌ లెనిన్‌ సుప్రసిద్ధ వ్యాసాన్ని ప్రావ్దా పత్రిక ప్రచురించింది. ''నిర్దిష్టమైన ప్రతిపాదనల్ని, చర్యల్ని, ఇతరత్రా అంశాలను ఏ రాజకీయ లేదా సామాజిక బృందాలు, శక్తులు లేదా కూటములు ముందుకు తెస్తున్నాయో వెనువెంటనే బహిర్గతం కానప్పుడు, ఎవరైనాగాని వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే, లాభం పొందేదెవరు? అన్నదే.......ఒకానొక ప్రత్యేకత కలిగిన అభిప్రాయాలను ఎవరు నేరుగా వ్యక్తం చేశారా అన్నది ముఖ్యం కాదు. ఈ అభిప్రాయాలు, ప్రతిపాదనలు, చర్యల ద్వారా ఎవరు లాభపడతారన్నదే' ప్రధానం'. భారత్‌, చైనా సంబంధాల గురించి ఇటీవలి కాలంలో రకరకాల కట్టుకథలు ప్రచారంలోకి వచ్చాయి. యుద్ధోన్మాదాన్నీ, పొరుగు దేశంపట్ల విద్వేషాన్నీ రెచ్చగొట్టటమే ఈ ప్రచారోద్దేశం. ఇలాంటి విపరీత ప్రచారం ద్వారా భారత్‌కుగానీ, చైనాకుగానీ ఒరిగేదేవిూ ఉండదనేది స్పష్టం. ఏమాత్రం స్థిరత్వంలేని ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో అభివృద్ధి, పెరుగుదలకు సంబంధించి తమవైన మార్గాలలో ఆసియాలోని ఈ రెండు దేశాలు ముందుకు సాగిపోతున్నాయి. అంతేగాక, ఇటు భారత్‌గానీ లేదా అటు చైనా గానీ తాము ఎంపిక చేసుకున్న జాతీయ అభివృద్ధి విధానాల నుంచి వైదొలగలేదు. యుద్ధమే సంభవిస్తే ఉభయ దేశాల కీలక ప్రయోజనాలకు ఎనలేని నష్టం వాటిల్లుతుంది. అయినప్పటికీ మన కార్పొరేట్‌ ప్రసారమాధ్యమం అలుపూసలుపూ లేకుండా యుద్ధభేరీలను మోగిస్తూనే ఉన్నది. యుద్ధం తథ్యం అంటూ అనేక కట్టుకథలను ప్రచారంలో పెడుతున్నది.


ఇలాంటి బాధ్యతారహితమైన ప్రవర్తనకు కేవలం ప్రసార మాధ్యమానికి చెందిన వారినే నిందించాల్సిన అవసరం లేదు. ప్రేతాత్మలను ఆవాహన చేయడంలోనూ, సైతానును స్మరించడంలోనూ వారికున్న శక్తియుక్తులు మనకు తెలుసు. వారు క్షణికమైన ఊహా ప్రపంచంలో విహరిస్తున్నారు. తమ ఉనికిని కాపాడుకునేందుకు వారి భాండాగారంలో జనులను ఆకర్షించే రకరకాల కుయుక్తులు ఉన్నాయి. ప్రభుత్వ నిధులను భోంచేస్తూ, మాజీ ఉన్నతాధికారుల సారథ్యంలో నడుస్తున్న సంస్థలు కూడా ఈ రకమైన ఉన్మాదాన్ని రెచ్చగొట్టటంలో తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. ఎంత విచారకరం! ఇటీవల సర్కారీ సంస్ధ ఒకటి తను నడిపే పత్రికలో అరుణ్‌శౌరి వ్యాసాన్నొకదానిని ప్రచురించింది. చైనాను శత్రువుగా తప్ప మరో రకంగా చూసే గుణమే ఈయనకు లేదు. ఉద్యోగ విరమణ చేసిన సైనికాధిóకారులు కొందరు ఈ మేధావుల సరసన చేరి ప్రసారమాధ్యమాన్ని వేదికగా చేసుకుని ప్రస్తుత దుష్ప్రచారానికి మహోత్సాహంతో తోడ్పడుతున్నారు. కనుక, మన జాతీయ భద్రతా సలహాదారు వలె బాధ్యతనంతా ప్రసారమాధ్యమంపై నెట్టివేయకుండా మరింత లోతుగా ఈ విషయాన్ని పరిశీలిద్దాము. ప్రభుత్వం కూడా తన ఇంటిని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. కాస్త వివరంగా చెప్పుకోవాలంటే మూడు తరహాలకు చెందినవారు యుద్ధోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. విదేశాంగ, రక్షణ విధానాలకు సంబంధించిన పాత ముఖాలను గుర్తుపట్టటం కష్టమేమీ కాదు. వీరు మొదటి కోవకు చెందుతారు. చైనా ప్రమాదం అంతకంతకూ పెరుగుతుందన్న వీరి నమ్మకం తిరుగులేనిది. ఇలాంటి పరిస్థితిలో అమెరికావైపు చేరడం మినహా భారత్‌కు మరో మార్గాంతరం లేదన్నది వీరి వాదన. దేశంలోనూ, విదేశాలలోనూ భారత ప్రభుత్వ అధికారులుగా వివిధ స్ధాయిలలో పనిచేసిన వీరు మేధావులు, ఆధునికులు, స్పష్టతగలిగిన వారు. చైనాకు వ్యతిరేకంగా ''టిబెట్‌ తురుపుముక్క''ను భారత్‌ ఉపయోగించాలన్న వారి వాదన సహజంగానే ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఇలా చెప్పేవారు తమను తాము 'వాస్తవిక వాదులమని' చెప్పుకుంటారు. కాని టిబెట్‌ విషయాన్ని చూపి చైనాపై ఒత్తిడి తీసుకురాగలమని భావించటం అమాయకత్వమే అవుతుంది. ఒకవేళ చైనా కూడా ఇదేతరహాలో చిల్లరమల్లర తురుపు ముక్కలను ఉపయోగిస్తే అప్పుడు ఈ ఆట కాస్తా వికటిస్తుంది. టిబెట్‌ కల్లోలం మొదలైన గత రెండు సంవత్సరాలలో వెలువడిన పది పన్నెండు వ్యాసాలకు సమాధానంగా వచ్చిన భారత్‌ 'విచ్ఛిన్నం' అన్న చైనీయుని వ్యాసం ఎంత గందరగోళాన్ని సృష్టించిందీ మనకు తెలుసు.


రెండవ విషయం మరొకటి ఉన్నది. పౌర నాయకత్వం చైనా ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేస్తున్నదని, ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు మన సైనిక బలగాలకు పెద్దయెత్తున ఆర్థిక, భౌతిక వనరులను అందుబాటులో ఉంచాలంటూ సైనికాధికారులుగా ఉద్యోగ విరమణ చేసిన కొంతమంది ఉత్సాహపరులు చెప్తున్నారు. మొత్తం సైనిక దళాలన్నీ కార్పొరేట్‌ ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. భారతదేశం విషయానికివస్తే జిడిపీలో 7 శాతం రక్షణ బడ్జెట్‌కు పోతున్నది. తిండికీ, తుపాకీకి మధ్య వనరుల పంపకంపై ప్రాచీన కాలం నుంచీ వివాదం సాగుతున్నది. అయినా రక్షణ బడ్జెట్‌ అతిగా ఉంటున్నదని భారతీయులు ఏనాడూ ఆక్షేపించలేదు. అమెరికా నుంచి ఆయుధాలు కొనాలంటూ సైనికదళాలలో ప్రచారం సాగటం కలవరపరిచే విషయం. ఇలాంటి పరిస్థితిలో అమెరికన్‌ ఆయుధ బేహారులు ఈ దేశంలోని తమ ఖాతాదారులపై మత్తుమందు చల్లటంలో వింతేమున్నది? మూడవదేమంటే, మనకు మితవాద హిందూత్వ జాతీయవాదులున్నారు. జాతీయ భద్రతకు తమను తాము సంరక్షకులుగా ప్రకటించుకునే ఈ బాపతు భారతదేశం అగ్రరాజ్యంగా ఎదగకపోవడానికి చైనానే అడ్డుపడుతోందని వాదిస్తారు. ప్రపంచ రాజకీయాలలో అగ్రరాజ్యాధిపత్యం అంతరించి పోయిందన్న స్పృహ వీరిలో బొత్తిగా కొరవడింది. వీరు ఎప్పుడూ రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతుంటారు. ఇదొక సమస్య. గత ఏడాది ఆరెస్సెస్‌తో చైనా ఒక అవగాహనకు వచ్చింది. ఆరెస్సెస్‌కు చెందిన సీనియర్‌ నాయకునికి బీజింగ్‌ ఆతిథ్యం ఇచ్చింది. పాలక పార్టీకన్నా వారు ఒకటి రెండు పాయింట్లు ఎక్కువే సాధించారని దీనిని బట్టి చెప్పవచ్చు. చైనా 'దుష్టపన్నాగాల' గురించి ప్రచారం చేయటంలో పైన తెలిపిన మూడు రకాలవారు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. త్వరలోనే యుద్ధం రాగలదని, భారతదేశం తన రక్షణ సామర్ధ్యాన్ని పెంచుకోవటానికి తగినంత సమయం లేదని వారు నమ్మబలుకుతున్నారు. అత్యాధునికమైన 126 యుద్ధ విమానాల కొనుగోలుతో సహా అపరిష్కృతంగా వున్న ఆయుధ సేకరణ అంశాలపై ప్రభుత్వం సత్వరమే నిర్ణయం తీసుకోవాలని వీరు కోరుతున్నారు.ఈ విషాదభరిత హాస్య నాటకం అంతం లేకుండా కొనసాగుతుండడంతో ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ జోక్యం చేసుకుని వీరి యుద్ధోన్మాదంపై చన్నీళ్ళు చల్లారు. చైనా సరిహద్దులో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నదంటూ ఆర్మీ ప్రధానాధిపతి దీపక్‌ కపూర్‌ ప్రకటించారు. రకరకాలుగా చెవులు కొరుక్కుంటున్న తమ వారిని సైనిక ప్రధానాధికారి అదుపు చేయాల్సి ఉంటుంది. ప్రసారమాధ్యమానికి ఉప్పందించటం ద్వారా ఉత్తుత్తి యుద్ధాలు చేసే అలవాటు అమెరికన్‌ కమాండర్లకు బాగా ఉన్నది. కాని భారతీయులమైన మనకు ఈ కుటిల సంస్కృతిని అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు.


వాస్తవానికి, భారత్‌-చైనా సంబంధాలు ఇటీవలి సంవత్సరాలలో నిలకడగా విస్తరిస్తుండటంతోపాటు, పరిణతి చెందుతున్నాయి. ఎప్పటికప్పుడు ఉన్నతస్ధాయిలో రాజకీయ అభిప్రాయాల మార్పిడి, అంతకంతకూ వృద్ధి చెందుతున్న వాణిజ్య సంబంధాలు, సరికొత్త వ్యూహాత్మక చర్చలు, సైనిక సహకారం తదితర అంశాలు ఉభయ దేశాల మధ్య సాన్నిహిత్యాన్నీ, విశ్వాసాన్నీ పెంపొందించాయి. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవటానికి ఈ వాతావరణం చక్కని భూమికగా ఉపయోగపడనున్నది. రష్యా-చైనాల మధ్య సాధారణ పరిస్థితి నెలకొనటానికి కూడా ఈ పద్ధతే ఉపయోగపడింది. చైనాతో భారత్‌కున్న సంక్లిష్ట సంబంధాలను కొనసాగించటానికిగాను యుపిఏ ప్రభుత్వం చేపట్టిన దానికన్నా ఉత్తమమైన విధానం మరొకటి లేదు. ప్రధానమైన మరో అంశమేమిటంటే, ఈనాడు భారత్‌ అనుసరిస్తున్న చైనా విధానం అత్యున్నతస్ధాయిలో చేపట్టినది. విదేశాంగ కార్యదర్శిగావున్న నిరుపమా రావు అత్యుత్తమ దౌత్యవేత్త, చైనా వ్యవహారాలలో ఎంతో నైపుణ్యం గడించిన వారు. ఇంతకన్నా మంచి వ్యక్తిని రాజకీయ నాయకత్వం సంపాదించలేదు. అయితే సమస్య ఎక్కడ ఉన్నది? భారత్‌-చైనాల మధ్యవున్న సుహృద్భావ సంబంధాలు దెబ్బతినడం వల్ల ఎవరు లాభపడతారు? ఈ సందర్భంగా ఒక్క మాట గుర్తు చేయాలి. ప్రపంచంలోనే చైనా రెండవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉన్నది. సమీప భవిష్యత్‌లో భారతదేశం మూడవ స్థానాన్ని ఆక్రమించే సూచనలు ఉన్నాయి. వ్యూహాత్మక రీత్యా చూసినపుడు అత్యంత కీలకమైన అంశాలలో, అంటే, వాతావరణ మార్పులు, దోహ దఫా చర్చలు, మతపరమైన తీవ్రవాదం, ఉగ్రవాదం వంటివాటిల్లో ఉభయ దేశాలు ఉమ్మడిగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. దీని ప్రభావం ఆసియాపై బలంగా ఉంటుంది. వాస్తవానికి కొన్ని విషయాలలో ఈ పరిణామం ఇప్పటికే మొదలైంది. ఈ పరిణామం కారణంగా ప్రపంచ రాజకీయ రంగం తూర్పు వైపు మారే అవకాశం ఉండటంతో పాశ్చాత్య దేశాలు కలవరపడుతున్నాయి. వాస్తవానికి భారతదేశంపై దండెత్తటం వల్ల చైనా బావుకునేదేమీ ఉండదు. పైగా నష్టమే ఎక్కువ. ఆర్థికాభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగాలన్న దాని విధానాలకు విఘాతం కలుగుతుంది. అంతేకాక, అంతర్జాతీయంగా బాధ్యతాయుత శక్తిగావున్న ప్రతిష్టకు భంగం వాటిల్లుతుంది. పొరుగు దేశాలతో చైనా స్నేహ సంబంధాలు సమతూకంతో ఉన్నాయని మయన్మార్‌ వ్యవహారాన్ని చూస్తే అర్థమవుతుంది. భారత మాత కంఠానికి ''ముత్యాల ఉరితాడు''ను చైనా సిద్ధం చేస్తున్నదంటూ అమెరికాకు చెందిన ఓ అపరిపక్వ వయస్కురాలు చేసిన నిర్ధారణలనే మన దేశంలోని మేధావులు పదేపదే వల్లిస్తున్నారు. చివరిగా మరొక ముఖ్యమైన విషయాన్ని చెప్పుకోవాలి. అదేమంటే, చైనా చాలా మెలకువతో వ్యవహరిస్తున్నది. పాకిస్తాన్‌ను కీలక పొత్తుదారుగా చేసుకుని మన ప్రాంతంలో శాశ్వతంగా తిష్టవేయాలనే అమెరికా పన్నాగం నుండి ఈ యుద్ధోన్మాదం ప్రజల దృష్టిని మళ్ళిస్తున్నది. ఆప్ఘనిస్ధాన్‌, ఉగ్రవాదం వంటి విషయాలపై రష్యా, భారత్‌, చైనాలు ఉమ్మడి వైఖరిని తీసుకోవాలన్న ఆలోచనను ఇది అస్థిరపరుస్తున్నది. బయటిదేశం నుంచి ముప్పు ఉందని చూపినట్లైతే అంతిమంగా అది అమెరికాతో భారత్‌ సైనిక సహకార విస్తృతికి ప్రాతిపదికగా ఉపయోగపడుతుంది. లెనిన్‌ మహాశయుడు ఈ పరమ సత్యాన్ని ఎంత చక్కగా చెప్పాడు!

Note:Article took from Prajasakthi paper written by BadraKumar