అనుకున్నట్టే జరిగింది. కాంగ్రెస్‌కు పర్యాయపదంగా మారిన బోఫోర్స్ కుంభకోణంలో దోషులెవరో తేలకుండానే కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని శాశ్వతంగా సమాధి చేసింది. 1437 కోట్ల రూపాయల హోవిట్జర్ తుపాకుల కొనుగోలుకు సంబంధించి భారత ప్రభుత్వానికి, స్వీడిష్ కంపెనీ బోఫోర్స్‌కి మధ్య కుదిరిన ఒప్పందంలో కొందరు రాజకీయపెద్దలకు, అధికారులకు పెద్దయెత్తున ముడుపులు ముట్టినట్లు 1987లో స్వీడిష్ రేడియో వెల్లడించడంతో దేశం ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. రక్షణ కొనుగోళ్లలో ఇంతటి భారీ కుంభకోణాన్ని దేశం అదివరకెన్నడూ కనీవినీ ఎరుగదు. పైగా ఈ కుంభకోణంతో కాంగ్రెస్‌లోని కొందరు పెద్దలకు ప్రమేయమున్నట్లు జర్నలిస్టుల పరిశోధనాత్మక వార్తా కథనాలు రావడంతో దేశంలో ఇది పెను ప్రకంపనలు సృష్టించింది. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి ఇది దారితీసింది. ఆ తరువాత కూడా ఆ పార్టీని ఇది నీడలా వెంటాడుతూనే వస్తోంది. ఈ కుంభకోణంలో తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించాల్సిన పెద్దలు ఇందులో నిజాలు బయటకు రానీయకుండా తొక్కిపట్టడానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. మధ్య మధ్యలో ఎన్డీయే, కాంగ్రెస్ మద్దతుపై ఆధారపడిన ప్రభుత్వాలు వచ్చినా ఈ కేసుపై దర్యాప్తు ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగానే సాగింది.
ఈ కేసు దర్యాప్తును ప్రహసనంగా మార్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయని ప్రయత్నమంటూ లేదు. బోఫోర్స్ కుంభకోణం బయటపడగానే పార్లమెంటులోపల, వెలుపల ప్రతిపక్షాల నుంచి, ప్రజానీకం నుంచి పెద్దయెత్తున వ్యతిరేకత రావడంతో అయిష్టంగానే సంయుక్త పార్లమెంటరీ సంఘం(జెపిసి) ఏర్పాటుకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించింది. కానీ, ఆ కమిటీ విచారణను ఒక తంతుగా మార్చడంతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ఆ కమిటీని బహిష్కరించారు. 1987లో ఈ కుంభకోణం వెలుగు చూసినా, విపి సింగ్ నేతృత్వంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే దీనిపై సిబిఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఆ తరువాత తొమ్మిదేళ్లకు అంటే 1999లో సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం స్విస్ బ్యాంకు విడుదల జేసిన 500 డాక్యుమెంట్ల ఆధారంగా విన్ ఛద్దా, ఖత్రోచి, కీ.శే. రాజీవ్ గాంధీలపై సిబిఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. అప్పటికే రాజీవ్ చనిపోయినందున ఆయన పేరును విచారించాల్సిన నిందితుల జాబితా నుంచి తప్పించింది. ఆ తరువాత కొన్నాళ్లకు హిందూజా సోదరుల పేర్లను చేర్చుతూ అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. కానీ, దర్యాప్తు సంస్థ సరైన ఆధారాలు చూపకపోవడం వల్ల 2004లో హిందూజా సోదరులను ఢిల్లీ హైకోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. యుపిఏ-1 ప్రభుత్వం అధికారంలో వుండగా ఈ కేసులో కీలక నిందితుడైన ఇటాలియన్ ఆయుధ వ్యాపారి, రాజీవ్ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన ఒట్టావియో ఖత్రోచిని ఇంటర్‌పోల్ రెడ్ అలెర్ట్ నోటీసు ఆధారంగా అర్జెంటీనా ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. అయితే సిబిఐ గట్టిగా వాదించకపోవడం వల్ల ఆ ఖత్రోచిని భారత్‌కు అప్పగించేందుకు అర్జెంటీనా కోర్టు తిరస్కరించింది. మలేసియాలో ఖత్రోచి బహిరంగంగా సంచరించినా అతన్ని పట్టుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకుండా నాన్చింది. 2005లో ఖత్రోచి బ్యాంకు అకౌంట్లపై వున్న స్తంభనను ఎత్తివేయవచ్చని భారత ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ కోర్టుకు సలహా ఇచ్చినప్పుడే ఈ కేసును సమాధి చేయడానికే ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని విదితమయింది. ఖత్రోచిపై వున్న రెడ్ అలర్ట్ నోటీసును ఉపసంహరించాలని ఇంటర్‌పోల్‌ను సిబిఐ కోరడంతో ఇది మరింత బలపడింది. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కేసును మూసేయాలన్న ప్రభుత్వ ప్రకటన ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పాలకులు వ్యవహరించిన తీరు చాలా జుగుప్స కలిగిస్తోంది. ఈ కేసులో నిజాలు బయటకు రావాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేశమాత్రం కూడా లేదని ఈ పరిణామాలన్నీ స్పష్టం చేస్తున్నాయి. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే ఇంతకాలం చట్టానికి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఖత్రోచిని పట్టుకుని మక్కెలిరగ్గొట్టి అతనిచే నిజం కక్కించాలి. కానీ, కేంద్రంలో పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగనీయకుండా సిబిఐని అడ్డుకున్నాయి. నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాల్సిన సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మార్చాయి. కేరళలో మార్క్సిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పినరయి విజయన్‌పై అక్రమంగా కేసును బనాయించడంలోను, యుపిలో ములాయం సింగ్‌పై కేసుల విషయంలోనూ సిబిఐని యుపిఏ ప్రభుత్వం ఎలా సాధనంగా వాడుకున్నదీ చూశాము.ఒకవైపు సిబిఐని ఆధారాలు సేకరించకుండా కాళ్లు చేతులు కట్టిపడేసి మరో వైపు సరైన ఆధారాలు లేకుండా ఎంతకాలం నిందితులను వేధిస్తామంటూ అధికారంలో వున్న పెద్దలు అమాయకత్వం ఒలకబోయడం వారి నయవంచనకు పరాకాష్ట. ఖత్రోచి అమాయకుడని కాంగ్రెస్ నమ్మవచ్చుగాక. కానీ, దేశ ప్రజలచేత అలా నమ్మింపజేయాలని చూడడం దాని అవివేకం. ఖత్రోచి ఏ తప్పు చేయకపోతే గత పందొమ్మిదేళ్లుగా చట్టానికి, న్యాయానికి చిక్కకుండా ఎందుకు తప్పించుకు తిరుగుతున్నట్లు? బోఫోర్స్ కుంభకోణంలో చేతులు మారిన అరవై నాలుగు కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి చేరినట్లు? వీటికి సమాధానం లభించాలంటే ఈ కుంభకోణంలో కీలక పాత్రధారి ఖత్రోచిని ప్రాసిక్యూట్ చేయాలి. అందుకు ప్రయత్నించకుండా, కేసును మూసేయడమే దీనికి పరిష్కారం అన్నట్లుగా వ్యవహరించడం దారుణం.
దేశ భద్రతకు సంబంధించిన రక్షణ కొనుగోళ్లలో బయటపడిన అతిపెద్ద కుంభకోణంలో ఎవరినీ శిక్షించకుండా ఇలా వదిలేయడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు ఏ రకమైన సందేశాన్ని ఇవ్వదలచుకున్నది? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ఉన్నతాధికారులు, రాజకీయ బ్రోకర్లు అవినీతికి పాల్పడినా దానిని పట్టించుకోకూడదని చెప్పదలచుకున్నదా? అన్ని రకాల అవినీతికి మూలమైన రాజకీయ అవినీతిని ఉపేక్షించినా తప్పు కాదని చెప్పదలచుకున్నదా? అదే ప్రభుత్వ ఉద్దేశమైతే ఆ మాటే చెప్పాలి. అంతేకానీ, ఈ విధమైన ద్వంద్వ ప్రమాణాలతో అవినీతిపై అది పోరాడలేదు. ఇప్పటికైనా ఈ కపట నాటకాన్ని కట్టి పెట్టి బోఫోర్స్ కేసులో నిజాలను బయటపెట్టాలి. ఇందుకు కారకులైనవారు ఎంతటివారైనా శిక్షించాలి.
No comments:
Post a Comment