Friday, 1 October 2010

ముగింపు తేని తీర్పు

బాబ్రీ మసీదు-రామ జన్మభూమి వివాదంపై ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న కేసులో అలహాబాద్‌ హై కోర్టు లక్నో ధర్మాసనం ఇచ్చిన తీర్పు వివాదాన్ని ముగించేదిగా లేదు. వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలు చేసి ఈ వివాదంలో కక్షిదారులుగా ఉన్న సంస్థలకు కేటాయించాలని ధర్మాసనం గురువారం నాడు ఇచ్చిన తీర్పు ప్రాతిపదిక ఏమిటనేది పరిశీలించాలి. ఈ తీర్పు అనేక ప్రశ్నలకు ఆస్కారమిచ్చింది. న్యాయమూర్తులు సుధీర్‌ అగర్వాల్‌, ఎస్‌.యు.ఖాన్‌, డి.వి.శర్మలతో కూడిన ధర్మాసనం కొన్ని అంశాలపై ఏకాభిప్రాయాన్ని, మరికొన్ని అంశాలపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తూ మెజారిటీ అభిప్రాయం ఆధారంగా ఇచ్చిన ఈ తీర్పు అందులో ఇమిడి ఉన్న అంశాల సంక్లిష్టతను సూచిస్తున్నది. వివాద స్వభావంతో పాటు అనేక కారణాల రీత్యా అది క్లిష్టమైన వ్యవహారమే అవుతుంది. సుదీర్ఘ చారిత్రక కాలంతో, మతపరంగా రెచ్చగొట్టబడిన మనోభావాలతో, భిన్నాభిప్రాయాలకు తావునిచ్చే నిర్ధారణలతో ఈ వివాదం కూడి ఉండటమే ఇందుకు కారణం. ఆరు దశాబ్దాలుగా న్యాయపరమైన వివాదాలు కొనసాగుతుండగానే అనేక పరిణామాలకు గురైన ఈ వివాదం ఆస్తి హక్కులకు సంబంధించిన సాధారణ స్థల వివాదం కాదు. దేశంలో మతపరమైన విద్వేషాలను, కల్లోలాలను సృష్టించేందుకు బిజెపి, సంఘ పరివార్‌, ఇతర మతోన్మాద సంస్థలు, శక్తులు ఈ వివాదాన్ని వినియోగించుకున్నాయి. రాజకీయ, ఇతర లబ్దిని పొందాయి. కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వాలు అవకాశవాదంగా వుంటూ, ఈ వివాదానికి ఆజ్యం పోసే విధంగా వ్యవహరిస్తూ వచ్చాయి.


ధర్మాసనం తుది తీర్పును రూపొందించేందుకు ఇంకా సూచనలు, దరఖాస్తులు దాఖలు చేసేందుకు అవకాశం ఉండటం, మూడు భాగాలుగా స్థల విభజన కూడా ఈ వ్యవహారం కొనసాగింపునకు దారి తీస్తాయి. ప్రస్తుతమిచ్చిన ఉత్తర్వును మార్పు చేసే వరకు, లేదా తొలగించే వరకు మూడు మాసాల పాటు యధాతధ స్థితి కొనసాగనుంది. ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీలు దాఖలు చేసే అవకాశంతో పాటు, తుది పరిష్కారం కూడా సుప్రీం కోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉండటంతో, సహజంగానే బాధితులమనుకునే పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాయి.


సున్నీ వక్ఫ్‌ బోర్డు సుప్రీం కోర్టులో అప్పీలు చేస్తామని ప్రకటించగా, ఈ వివాదంలో భాగస్వాములైన ఇతర పక్షాలు కూడా అలా చేసే అవకాశాన్ని త్రోసిపుచ్చటానికి లేదు. ఎవరు సుప్రీం కోర్టుకు వెళ్ళినా, మిగిలిన కక్షిదారులు కూడా ఆ కేసులో ప్రతివాదులు గాక తప్పదు. హిందువులు, ముస్లింలు, నిర్మోహి అఖాడాలను బాబ్రీ మసీదు-రామ జన్మభూమి వివాదాస్పద స్థలం సంయుక్త హక్కుదారులుగా తన ప్రాధమిక తీర్పులో నిర్ధారించిన ధర్మాసనం మూడు భాగాలను ఎవరెవరు, ఎలా వినియోగించుకోవాలో, నిర్వహించుకోవాలో నిర్ధారించాల్సి ఉంది. న్యాయస్థానం నియమించిన కమిషనర్‌ రూపొందించిన మ్యాప్‌ ప్రకారం ప్రస్తుతం తాత్కాలిక ఆలయంగా రాముని విగ్రహం ఉన్న ప్రాంతాన్ని హిందువులకు, రామ చబూత్ర, సీతా రసోయిగా చూపబడిన ప్రాంతం నిర్మోహి అఖాడాకు తుది తీర్పులో కేటాయిస్తామని ధర్మాసనం పేర్కొంది. మిగిలిన ప్రాంతం సున్నీ వక్ఫ్‌ బోర్డుతో సహా కక్షిదారులైన మరో రెండు ముస్లిం సంస్థలకు కేటాయించాలని, కొన్ని సర్దుబాట్లు అవసరమైతే వివాదాస్పద స్థలానికి ఆనుకుని ఉన్న కొంత భాగాన్ని పరిహారంగా ఇవ్వవచ్చునని న్యాయస్థానం పేర్కొంది. ఇలాంటి సర్దుబాట్లపై వివాదాలు రేకెత్తే అవకాశాన్ని త్రోసిపుచ్చటానికి లేదు.


బాబ్రీ మసీదుగా పరిగణించబడుతూ వచ్చిన నిర్మాణంలో 1949 డిసెంబరు 23న ప్రధాన గుమ్మటం కింద రామ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 1992 ఆగస్టు 6న సంఫ్‌ు పరివార్‌ మతోన్మాద శక్తులు బాబ్రీ మసీదును కూల్చి వేశాయి. జాతీయ సమగ్రతా మండలికి, తద్వారా దేశానికి ఇచ్చిన హామీని బిజెపి ఉల్లంఘించింది. ఈ ప్రధాన గుమ్మటం కిందనున్న ప్రాంతమే రామ జన్మభూమి అని న్యాయస్థానం నిర్ధారణకు రావటానికి మనోభావాలే ప్రాతిపదిక. వివాదాస్పద కట్టడాన్ని కూల్చి వేసిన శక్తుల అరాచకంపై న్యాయస్థానం ఏమి అభిప్రాయం వెలిబుచ్చిందో పరిశీలించాలి. మతం పేరుతో, మనోభావాల పేరుతో ఉద్రేకాలను, ఉద్రిక్తతలను, కల్లోలాలను సృష్టించే మతోన్మాద శక్తుల అరాచకాలను అరికట్టేందుకు లౌకిక, ప్రజాతంత్ర వ్యవస్థలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయంగానే దేశ ప్రతిష్టను మంటగలిపే, దేశ సమైక్యతకు, సమగ్రతకు, లౌకిక వ్యవస్థకు ముప్పు తెచ్చే అలాంటి నేరస్థ మతోన్మాదంపై మౌనం వహించరాదు. అలాంటి అవాంఛనీయ ధోరణులు మతోన్మాద శక్తులు రెండువైపులా ఇంకా పెచ్చరిల్లడానికి, మతపరంగా వివాదాలను రెచ్చగొట్టడానికి, విధ్వంస, హత్యాకాండను, అరాచకాలను, కల్లోలాలను సృష్టించడానికి ప్రోత్సహించటానికి తావిస్తాయి.


అయోధ్య వివాదం తీర్పు రానున్న తరుణంలో దేశంలో మతోన్మాద శక్తులు ఎక్కడ ఏ ఉపద్రవం తెచ్చి పెడతాయోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. శాంతిభద్రతల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. రెచ్చగొట్టేందుకు మతోన్మాద శక్తులు చేసే ప్రయత్నాలకు దేశ ప్రజానీకం లోనుకాకుండా, శాంతిని, మత సామరస్యాన్ని పాటించాల్సిన అవసరంపై అన్ని వైపుల నుండి పిలుపులు ఇవ్వాల్సి వచ్చింది. తీర్పు తమకు అనుకూలంగా రాకపోతే రామాలయ నిర్మాణానికి 'ఉద్యమానికి' దిగుతామని, సుప్రీం కోర్టు తీర్పుకు కూడా వేచి ఉండబోమని విశ్వహిందూ పరిషత్‌ నాయకులు ప్రకటనలు చేయటం మతోనాన్మద శక్తుల స్వభావాన్ని వెల్లడిస్తున్నది. లక్నో ధర్మాసనం తీర్పు అయోధ్య వివాదానికి చరమగీతం పాడటం లేదు. మతదోన్మాద శక్తుల కుట్రల పట్ల ప్రజానీకం నిత్య జాగరూకతతో ఉండాలి. లౌకికవాదం, దేశ సమగ్రత, మత సామరస్యం, శాంతి పరిరక్షణ కోసం నిలవాలి. రాజ్యాంగపరంగా అత్యున్నతమైన సుప్రీంకోర్టు ఈ వివాదానికి పరిష్కారం చూపాలి.

Note:Article from Prajasakti.com