లండన్ అర్థశాస్త్ర విభాగంలో(స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్) చదివిన భారతీయ ప్రముఖుల్లో జ్యోతిబాసు ఒకరుగా అసాధారణ ప్రజ్ఞాశాలిగా ఆ సంస్థ పరిగణించింది. పశ్చిమబెంగాల్ రాజకీయాలలో సిపిఎం నాయకత్వంలోని ఐక్యసంఘటన 1969లో రెండవసారి మరింత మెజారిటీతో అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించింది. జ్యోతిబసు రెండవసారి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఒక కమ్యూనిస్టుపార్టీ వరుసగా మరింత ప్రజాదరణతో ముందుకు రావటం ఎదురులేని కాంగ్రెస్‌ను సవాలు చేయటం ప్రపంచాన్ని ఆకర్షించింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని బ్రిటన్‌లోని ప్రముఖ పత్రిక గార్డియన్ ఒక వ్యాసాన్ని ప్రచురించింది.
1935 అక్టోబరు 27న జ్యోతిబసు 21 సంవత్సరాల వయస్సులో లండన్ విశ్వవిద్యాలయ కళాశాలలో చేరారు. ఉష్ణప్రాంతమైన కొల్‌కతా నుంచి వణికించే చలి ఉండే లండన్‌లో బసు అడుగుపెట్టే సమయానికి రెండవ ప్రపంచ యుద్ధ సన్నాహాలతో రాజకీయరంగం వేడెక్కుతోంది. న్యాయవాద విద్య చదవటానికి లండన్ వెళ్లినప్పటికీ అప్పుడున్న రాజకీయ పరిణామాలతో ఆయన ఆ ఒక్కదానికే పరిమితం కాలేదు. సెలవురోజుల్లో భారత్‌కు తిరిగి రాకుండా ఇతర అంశాలను కూడా అభ్యసించారు. విశ్వవిద్యాలయ కళాశాలలో చరిత్ర, సాధారణ అర్థశాస్త్ర విద్యార్థిగా నమోదైనప్పటికీ లండన్ అర్థశాస్త్ర విభాగంలో కూడా విద్యార్థిగా పేరు నమోదు చేయించుకున్నారు. అక్కడ రాజకీయ వ్యవస్థ నిర్మాణం,రాజ్యాంగ న్యాయశాస్త్రం, అంతర్జాతీయ న్యాయశాస్త్రం, మానవపరిణామశాస్త్రం తరగతులకు కూడా హాజరయ్యారు. ఇంతేకాదు రాజకీయ సిద్ధాంతం, సైకాలజీ తరగతులకు కొంతకాలం వెళ్లి మధ్యలో మానుకున్నారు. ఇలాంటి వారు అరుదుగా ఉన్నందున ఆ సంస్థ జ్యోతిబసును అసాధారణ ప్రజ్ఞాశాలిగా పరిగణించింది. తన ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకొనేందుకు ఆయన లండన్‌లో వర్తమాన ఆంగ్ల తరగతులకు కూడా హాజరయ్యారు. జ్యోతిబసు ఉపముఖ్యమంత్రిగా, అజరుముఖర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు వారిని ఇంటర్వ్యూచేసిన బ్రిటీష్ జర్నలిస్టులు ముఖ్యమంత్రి ఒక అంశంపై సమాధానం చెప్పటానికి పావుగంట సమయం తీసుకుంటే జ్యోతిబాసు కేవలం పది మాటల్లోనే విశదీకరిస్తారని ఫిర్యాదు చేశారు.
గార్డియన్ పత్రిక ప్రచురించిన జాఫ్రి మూర్‌హౌస్ వ్యాసం చూసిన తరువాత ఈయనెవరో ప్రముఖుడిలా ఉన్నారని ఆ వ్యాసాన్ని ఒక లైబ్రేరియన్ భద్రపరిచారు. అది అక్షరాలా వాస్తవమైంది. ఆ ఆర్టికల్‌తో పాటు బసు ఫొటోను ప్రచురించి దానికింద 'బాసు: నాయకుడు' అని పేర్కొన్నది.
జ్యోతిబసు లండన్‌లో చదివిన రోజులు ఒక ఎత్తైతే, కమ్యూనిస్టుగా మారటం, తన జీవనయానాన్ని నిర్ణయించుకున్నదీ అక్కడే. అందుకే ఆయనకు లండన్ అంటే అంత మక్కువ. బారిస్టరు చదివేందుకు లండన్ వచ్చి ఓడదిగిన తరువాత తూర్పు లండన్‌లోని తూర్పు బెంగాల్ నుంచి వచ్చి దుర్భరజీవితం గడుపుతున్నవారిని చూసి చలించిపోయారు. వారిలో అనేక మందికి ఆంగ్లం రాదు. జ్యోతిబసు వారికి ఆంగ్ల పాఠాలు కూడా చెప్పారు. చదువు ముగియగానే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా భారత్ వెళ్లి అక్కడ కమ్యూనిస్టుపార్టీ కార్యకర్తగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. బారిస్టర్ పరీక్షలు రాసిన తరువాత ఫలితాలు వచ్చేవరకు కూడా వేచి చూడలేదు. 1940 జనవరి ఒకటవ తేదీనే భారత్‌కు బయలుదేరి వచ్చారు.
తరువాత మరోసారి బ్రిటన్ వెళ్లాలనిగాని బారిస్టరు పట్టా పుచ్చుకోవాలని గాని అనుకోలేదు. అయితే జనవరి 26న ఆయన పరోక్షంలోనే ఫలితాలు ప్రకటించి పట్టాను పుచ్చుకొనేందుకు లండన్ రావాల్సిన అవసరం లేదని, ఆయన బారిస్టరుగా అర్హత సంపాదించినట్లు పరిగణిస్తున్నట్లు ప్రకటించారు. జ్యోతిబసుకు అనేక మంది బ్రిటీష్ వారు స్నేహితులయ్యారు. వారిలో తరువాత లేబర్ పార్టీ నాయకుడిగా ఎన్నికైన మైఖేల్ ఫుట్, క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన కార్మిక నాయకుడు టోనీ బెన్ వంటివారున్నారు. వారంతా భారత స్వాతంత్య్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చినవారే.
మా మంచి తాతయ్య
'లండన్‌లో బారిస్టరు చదివి భారత్‌లో న్యాయవాదిగా పనిచేయాలని ముందు అనుకున్నారు. అయితే లండన్ ఆయన్ను మార్క్సిస్టుగా మార్చివేసింది. అది కుటుంబానికి నచ్చలేదు. మా వరకు వస్తే ప్రపంచంలోనే 'గొప్ప తాతయ్య' అని ఆయన మనవరాలు మల్లిక పేర్కొన్నారు. నేను పాఠశాల రోజుల్లో ఒకసారి నేను పెద్ద అందంగా లేకపోయినా సుశ్మితాసేన్‌తో పాటు అందాల పోటీల్లో పాల్గొన్నాను. తాతయ్య ఎంతో సంతోషించారు. ఇంటికి వస్తూనే అందాలరాణి, అందాల రాణి ఎక్కడ అంటూ పిలిచారని మల్లిక చెప్పింది. సరదాగా పాల్గొన్న పోటీ ఉదంతాన్ని అవకాశంగా తీసుకొని ఆ రోజుల్లో కమ్యూనిస్టు వ్యతిరేక మీడియా చిలవలుపలవలుగా చిత్రించి జ్యోతిబసు మనవరాలేమిటి అందాల పోటీల్లో పాల్గొనటం ఏమిటని నానాయాగీ చేసింది. ఇప్పుడు ఆమె లండన్‌లో ప్రాంతీయ వంటకాల గురించి రాయటంతో పాటు అదే రంగంలో గౌరవ ప్రదమైన ఉద్యోగం చేస్తున్నది. లండన్‌లో ఎంతో మంది స్నేహితులున్న కారణంగానే జ్యోతిబాసు సెలవులు గడిపేందుకు ప్రతిఏటా రెండు మూడు వారాలు లండన్ వెళ్లేవారు. కోడి గుడ్డుపై ఈకలు వెతికేందుకు ప్రయత్నించే కమ్యూనిస్టు వ్యతిరేక మీడియా ఈ పర్యటనలపై కూడా బురద చల్లింది.
బంగ్లాదేశీయులకూ స్ఫూర్తి
విద్యాభ్యాసం, కమ్యూనిస్టుగా పునాదులు పడిన లండన్ ఒక అభిమాన పాత్రమైతే పూర్వీకుల స్థలమైన బంగ్లాదేశ్ కూడా జ్యోతిబసుకు ఎంతో ప్రీతిపాత్రమైనది. అందుకే ఆయన మరణాన్ని అక్కడి పత్రికలు, వివిధ తరగతులవారు ఎంతో విషాదంగా పరిగణించాయి. ఉభయదేశాల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సమస్యలున్నప్పటికీ వాటిపట్ల ఎల్లపుడూ జ్యోతిబసు సానుభూతితో వ్యవహరించారని బంగ్లాదేశ్ నేషనల్ అవామీలీగ్ పార్టీ అధ్యక్షుడు ముజఫర్ అహమ్మద్ కొనియాడారు. స్వాతంత్య్రం తరువాత కూడా జ్యోతిబసు తమకు స్ఫూర్తినిచ్చారని అన్నారు. బంగ్లాదేశ్ విశ్వసించే వ్యక్తి జ్యోతిబసు ఒక్కరే అని ప్రధాని హసీనా వాజెద్ గతంలో ఒకసారి వ్యాఖ్యానించిన విషయం తెలిసినదే.ఢాకా సమీపంలో తన పూర్వీకుల జన్మస్థలమైన బరోడీ గ్రామాన్ని దీర్ఘకాలం సందర్శించనప్పటికీ ఆయన ఆ గ్రామాన్ని మరిచిపోలేదని ముజఫర్ అన్నారు. తమ దేశవిముక్తి సమయంలో, ఇతర సంక్షోభసమయాల్లోనూ ఎన్నో విలువైన సలహాలు ఇచ్చారని తెలిపారు. ఆయన మరణం ఒక్క కమ్యూనిస్టు ఉద్యమానికే గాక యావత్ ప్రపంచ వామపక్ష ఉద్యమాలకు నష్టమని బంగ్లాదేశ్ వామపక్ష నాయకుడు హైదర్‌ఖాన్ రోనో పేర్కొన్నారు. ఇంతటి మహౌన్నత నాయకుడు కనుకనే బంగ్లా ప్రధాని షేక్ హసీనా వాజెద్ ఆయన అంత్యక్రియలకు స్వయంగా హాజరై తమ గౌరవాన్ని ప్రకటించనున్నారు.