గవర్నర్ల వ్యవస్థ మరోసారి చర్చనీయాంశమయింది. ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఉండగా వాటిపైన కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేయడానికి ఉద్దేశించిన గవర్నర్ల వ్యవస్థ అవసరమా? దేనికీ జవాబుదారీ కాని గవర్నరు ఎందుకు? రాజభవన్‌లను గవర్నర్లు పార్టీ కార్యాలయాలుగా మార్చేస్తుంట,ే ఇతరత్రా కార్యకలాపాలకు ఉపయోగిస్తుంటే చూస్తూ భరించాల్సిందేనా? గవర్నర్ వ్యవస్థ అధికార పార్టీ రాజకీయ నాయకులకు పునరావాస కేంద్రంగా మారడమే కాదు. గవర్నర్లు కేంద్రంలో అధికార పార్టీకి తాబేదార్లుగా వ్యవహరించిన సంఘటనలు కొకొల్లలు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్ మరో రూపంలో ప్రజల ముందుకొచ్చింది. గతంలో ఇలాంటి ఆరోపణలు ఎప్పుడూ లేవు. గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగానికి ఇది ఒక పార్శ్వం మాత్రమే.
గవర్నర్లుగా నియమించబడే వారి గత చరిత్రను, పూర్వాపరాలను, అర్హతానర్హతలను పరిగణనలోకి తీసుకుంటున్న దాఖలాలు లేవు. కేవలం సంకుచిత రాజకీయ సర్దుబాట్లకు గవర్నర్ల నియామకాలు జరుగుతున్నాయి. ఇందుకు గౌరవప్రదమైౖన మినహాయింపులు కొన్ని ఉన్నా గవర్నర్ వ్యవస్థే దండగమారినదనే సహేతుక విమర్శకు కొందరు గవర్నర్ల ఆచరణ పదేపదే బలం చేకూర్చుతున్నది. ప్రజల సొమ్ముతో నడుస్తున్న గవర్నర్ వ్యవస్థ నిర్వహణకు, రాజభవన్ నిర్వహణకు ఎంత సొమ్ము, ఎందుకోసం ఖర్చవుతున్నదనేది ప్రశ్నించటానికి కూడా లేని ప్రత్యేక హక్కులు రక్షణగా ఉంటున్నాయి. గవర్నర్ పదవిలో ఉన్నవారి వ్యక్తిగత నడవడిక, వ్యవస్థాపరమైన పనితీరుపై విమర్శలు వచ్చిన సందర్భాలలో కూడా తీవ్రమైన పరిస్థితులలో తప్ప అలాంటి వారిని వెనుకకు పిలిపించిన సందర్భాలు అరుదు. ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా దీర్ఘకాలం పనిచేసిన ప్రస్తుత రాష్ట్ర గవర్నర్ వ్యవహారం అందుకు మినహాయింపుగా లేదు.
తివారి తన భర్త అని, తన తండ్రి అని తల్లీకొడుకులు ఇంతకుమునుపు న్యాయస్థానానికి వెళ్ళినా, రుజువులను వెల్లడించినా కేంద్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరించింది. న్యాయవ్యవస్థ కూడా గవర్నర్ పదవి హోదాను తక్కువ చేయరాదంటూ డిఎన్‌ఎ పరీక్షకు అనుమతించకుండా ఆ కేసు విచారణను పక్కన పెట్టింది. గవర్నర్ వ్యవస్థ గవర్నర్లకు కల్పిస్తున్న రక్షణ ఎలాంటిదో ఇది సూచిస్తున్నది. గవర్నర్ అనైతిక ప్రవర్తనను నిరసిస్తూ రాజ్‌భవన్ వద్ద ఆందోళన చేయడానికి శుక్రవారం పూనుకున్న మహిళా సంఘాల నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. రాజ్యాంగ పదవులు నిర్వహించే, రాజ ప్రతినిధి లాంటి గవర్నర్లకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడానికి అవకాశం లేదన్న ధోరణి ఇక్కడ కన్పిస్తోంది. గవర్నర్ల నియామకాలు ఏ ప్రాతిపదికన జరుగుతున్నాయో కళ్లెదుట స్పష్టంగా కన్పిస్తుండగా ఆ వ్యవస్థకు అంతటి ప్రత్యేక హోదా ఇవ్వడం అవసరమా? ఆలోచించాల్సిన విషయం.
అధికార వ్యవస్థ నాలుగు గోడల మధ్య జరుగుతున్న అనైతిక, అక్రమ, అవినీతి కార్యకలాపాలు కొన్ని అప్పుడప్పుడు వెల్లడవుతున్నా, అనేకం నిర్ధారించే అవకాశాలు, రుజువులు లేకుండా మరుగున పడిపోతున్నాయి. వ్యక్తిగత బలహీనతలకు, అధికార స్థానాలలో ఉండటానికి సంబంధం ఉండకపోవచ్చు. కాని అధికార బలంతో వచ్చే అవకాశాలకు వ్యక్తిగత బలహీనతలు, రాజకీయ, వ్యాపార స్వార్ధ ప్రయోజనాలు తోడైతే అనైతికత, అక్రమాలు, అవినీతి విశృంఖలంగా తయారవుతాయి. ఇవి వ్యవస్థాగత రుగ్మతలలో భాగమే. అధికార వ్యవస్థలో ఎవరి నుండి తమకు పనులు జరగాలనుకుంటారో వారి బలహీనతలను గుర్తించి వాటికి అనుగుణంగా బేరాలు, ప్రలోభాలతో ఎరవేయటం పైరవీకారులు, మోసకారులు సాధారణంగా అనుసరిస్తున్న మార్గమే.
ఈ బేరాలు రెండు వైపులా జరుగుతాయి. రాజకీయ, బ్యూరోక్రాటిక్, కార్పొరేట్ వ్యవస్థలకు మధ్య ఉన్న అపవిత్ర పొత్తు దీనికి పరాకాష్ట. ఈ అక్రమాల నుండి ఒకరినొకరు రక్షించుకునే ధోరణికి న్యాయంగా తమ పనుల కోసం వచ్చే వారి బలహీనతను, అవసరాలను ఆసరా చేసుకుని అవినీతి, అనైతిక చర్యలకు వారిని ఒత్తిడి చేసి, బెదిరించి, లొంగదీసుకునేందుకు అధికార స్థానాలలో ఉన్నవారిలో అవినీతిపరులు, వారి తైనాతీలుగా ఉన్నవారు నడుపుతున్న వ్యవహారాలు కూడా అప్పుడప్పుడు బయట పడుతున్నాయి. పైరవీలకు ముడుపులు తీసుకుని, బెదిరించి మహిళలను లొంగదీసుకున్న వ్యవహారాలలో ఇరుపక్షాల మధ్యగాని, భాగస్వాముల మధ్యగాని తీవ్ర విభేదాలు వచ్చి లుకలుకలు బయటపడుతున్న సందర్భాలు ఉంటున్నాయి. వ్యక్తులుగా ఎవరి బలహీనతలు ఏమైనా, ప్రజా జీవితంలో, అధికార స్థానాలలో ఉన్నవారి నడవడిక, వ్యవహారాలు సమాజం దృష్టిలో ఉంటాయి. వారు ప్రజలకు జవాబుదారీగా, ఆదర్శవంతంగా ఉండాలి.
అత్యున్నత స్థానాలలో ఉన్నవారి విషయంలో ఆ పదవుల స్థాయిని, గౌరవాన్ని, విశ్వసనీయతను నిలబెట్టే విధంగా వారి నడవడిక, వ్యవహారాలు ఉండాలి. కనుక నియామకం చేసేటప్పుడే కాదు, వారిపై ఆరోపణలు వచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. రాష్ట్రపతి తగిన నిర్ణయం చేయడానికి దోహదపడాలి. ఆరోపణల తీవ్రతను బట్టి గవర్నర్‌ను వెంటనే వెనుకకు పిలిచేందుకు, ఆ పదవి నుండి తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌పై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమయినవి. వీటిపై సమగ్ర విచారణ జరిపించాలి. తప్పుడు వ్యవహారాలు జరిగినట్లు తేలితే, తప్పు చేసిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. గవర్నర్ వ్యవస్థకున్న ప్రత్యేక హక్కులను రద్దు చేసి, జవాబుదారీతనానికి వీలు కల్పించాలి. అసలు గవర్నర్ వ్యవస్థనే రద్దుచేసే విషయాన్ని కూడా పరిశీలించాల్సిన ఆవశ్యకత నేడు ఎంతైనా ఉంది.