పెట్టుబడిదారీ వ్యవస్థ పనికిమాలినదని తేలిపోయింది కాబట్టి ఇప్పుడు మన ముందున్న ప్రత్యామ్నాయమేమిటి?.....ఈ ప్రశ్న నేడు ప్రపంచ ఆర్థిక రంగంలో జరగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న లక్షలాదిమంది ప్రజల, ఇంకా చెప్పాలంటే కోట్లాది మంది ప్రజల మెదళ్లు తొలుస్తున్నది. గత కొన్ని నెలలుగా కనిపిస్తున్న రుణ సంక్షోభం, ఆర్థిక పతనం, మాంద్యం....వంటి వాటిని చూసేవారిలో ఇటువంటి ప్రశ్న ఉదయించడం సహజం. కాని సమస్యేమంటే ఈ ప్రశ్న ఉదయించిన కోట్లాది మంది ప్రజల ముందు మన రాజకీయ నాయకులు, మీడియా, విద్యా వ్యవస్థ, ఇంకా వారి అనుభవాల్లోని ఇతర అంశాలు ఉంచుతున్న సమాధానం ఏమిటంటే 'ప్రత్యామ్నాయం లేదు' అని. ఇప్పుడున్న స్థితిలో పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం ఏ విధంగానూ లేదు, ప్రత్యామ్నాయంటూ ఉంటే గింటే అది మార్పు చేయబడిన పెట్టుబడిదారీ వ్యవస్థే మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. మార్పు చేయబడ్డ పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే కొత్త కీనీసియనిజం, లేదా గార్డన్ బ్రౌనిజం (బ్రిటన్ ప్రధాని సూత్రం), లేదా బరాక్ ఒబామాయిజం (అమెరికా అధ్యక్షుల వారి సూత్రం) మాత్రమే.
కాని ఇది వాస్తవం కాదు. పెట్టుబడిదారీ వ్యవస్థకు నిశ్చితమైన, స్పష్టమైన ప్రత్యామ్నాయం ఉంది. 160 ఏళ్లనుండి (1848లో కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగెల్స్ కమ్యూనిస్టు మ్యానిఫెస్తో రాసినప్పటినుండి) ఈ ప్రత్యామ్నాయం మన ముందుంది. ఆ స్పష్టమైన ప్రత్యామ్నాయమే సోషలిజం. సోషలిజం చాలా సూటైన వ్యవస్థ. పెట్టుబడిదారీ వ్యవస్థతో పోలిస్తే చాలా సరళతరమైన వ్యవస్థ. ప్రధాన ఉత్పత్తి సాధనాలు (భూమి, పరిశ్రమలు, వ్యాపారాలు, బ్యాంకులు వగైరాలు)పై సామాజిక (లేదా సమిష్టి) యాజమాన్యం, అదుపు కలిగి ఉండడమే సోషలిజం అంటే. ఈ వ్యవస్థలో ఉత్పత్తి లాభాలకోసం కాకుండా మానవ అవసరాల ప్రాతిపదికగా జరుగుతుంది. దానివల్ల సమాజంలో వర్గ విభజనలు అంతమవుతాయి.
.............
సోషలిజం సమాజంలో చాలా మార్పులు తెస్తుంది. ప్రజలందరికీ అవసరమైన ఆహారం, గృహవసతి అందిస్తుంది. మానవుల మధ్య అసమానతలు, వర్గవిభజన తొలగిస్తుంది. ఆర్థికవ్యవస్థలో ప్రజాతంత్ర యుతమైన ప్రణాళికను ప్రవేశపెడుతుంది. వాతావరణంలో వినాశకరమార్పులను అరికడుతుంది. ప్రపంచ శాంతి, సమైక్యత నెలకొల్పుతుంది. కాని సోషలిజం ఈ మార్పులన్నీ తేవాలంటే ముందుగా కార్మికవర్గం పెట్టుబడిదారీ వ్యవస్థను తొలుత ఒక దేశంలోనూ, తరువాత మొత్తం ప్రపంచమంతటానూ, కూకటివేళ్లతో పెకిలించి పారేయ్యాల్సి ఉంటుంది. దీనికి కార్మిక మండళ్లు ఏర్పాటు కావడం చాలా కీలకమైన అంశం. ఈ మండళ్ల ఏర్పాటు పెట్టుబడిదారీ వ్యవస్థలోనే ప్రారంభమవుతుంది. యజమానులకు వ్యతిరేకంగా కార్మిక సమ్మెలు నిర్వహించే క్రమంలోనూ, సార్వత్రిక సమ్మెలు, ఫ్యాక్టరీల ఆక్రమణలు వంటి పోరాటాల నిర్వహణ క్రమంలోనే ఇటువంటి కార్మిక మండళ్లు ఏర్పడతాయి. ఇవి క్రమంగా పాత పెట్టుబడిదీరీ రాజ్యానికి ప్రత్యామ్నాయ అధికార కేంద్రాలుగా మారుతాయి. ఆ క్రమంలో జరిగే నిర్ణయాత్మక విప్లవంలో వారు పెట్టుబడిదారులను అధికారం నుండి తొలగించి కార్మికుల అధికారాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆధునిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కార్మికుల విశిష్ట స్థానాన్ని బట్టి వారికా అధికారం చేకూరుతుంది. ఈ క్రమంలోనే వారు కోట్లామంది ప్రజల సృజనాత్మక శక్తినీ, సామర్ధ్యాలనూ విముక్తి చేస్తారు. అది ఒకసారి జరిగితే ఇప్పటికన్నా ఉన్నతమైన, చాలా చాలా ఉత్తమమైన ప్రపంచం 'సాధ్యం' అనే స్థితినుండి వాస్తవ రూపానికి వస్తుంది.
Note: Written By
(జాన్ మోలినాక్స్ బ్రిటిష్ సోషలిస్టు వర్కర్స్ పార్టీ సభ్యుడు. రచయిత. పోర్ట్స్‌మౌత్ విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా పనిచేస్తున్న ఈయన మార్క్సిస్టు సిద్ధాంతం, కళల మీద అనేక వ్యాసాలు, పుస్తకాలు రాశాడు. 'సోషలిస్టు రివ్యూ' 2009 జనవరి సంచికలో ఆయన రాసి వ్యాసం నుండి ఈ వాక్యాలు గ్రహించబడ్డాయి.)
No comments:
Post a Comment