Monday, 12 October 2009

ఒబామా మాట నిలుపు కుంటారా ?

శాస్త్రసాంకేతిక రంగాలలో మానవాళి అభ్యుదయానికి కృషి చేసిన వారికి ప్రకటిస్తున్న నోబెల్‌ బహుమతుల విషయంలో ఎలాంటి విభేదాలు లేవు. వచ్చిన చిక్కల్లా శాంతి బహుమతుల ప్రకటనతోనే నోబెల్‌ ఫౌండేషన్‌, బహుమతుల నిర్ణాయక కమిటీలు తీవ్ర విమర్శల పాలౌతున్నాయి. సామ్రాజ్యవాదులు ముఖ్యంగా అమెరికన్ల కనుసన్నలలో మెలిగేవారికి అవసరమైతే శాంతి బహుమతులు ఇప్పించే పలుకుబడి అమెరికన్లకు ఉందని అనేక సందర్భాలలో వెల్లడైంది. ఇప్పుడు జరిగిందదే. అధ్యక్షుడిగా పదవీస్వీకారం చేసిన పదిహేనురోజుల్లోనే నోబెల్‌ బహుమతి ప్రతిపాదన గడువు ముగిసింది. అంటే కనీసం ఆయన విధానాలు ఎలా ఉంటాయో తెలియకముందే పేరును ప్రతిపాదించటాన్ని బట్టి ముందస్తు ఏర్పాటుగా భావిస్తున్నారు. అందుకే అది తెలియని వారిని ఒబామాకు 2009 సంవత్సరానికి అంతర్జాతీయ శాంతి నోబెల్‌ బహుమతి ప్రకటించటం ఆశ్చర్య పరిచింది. మీడియా, రాజకీయ పరిశీలకులు ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రిపబ్లికన్లు, ఇతర మితవాదులు అవార్డు ఇవ్వటంపై విమర్శలు గుప్పిస్తుండగా అంతే మోతాదులో సమర్థిస్తున్నారు. పాలస్తీనాలో యూదుల అక్రమనివాసాల నిర్మాణాన్ని నిలిపివేయించటంలో విఫలమై, ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధం కొనసాగిస్తున్న వ్యక్తికి శాంతి బహుమతి ఇవ్వటం ఏమిటని యుద్ధ వ్యతిరేకులు ప్రశ్నిస్తున్నారు.


నోబెల్‌ శాంతి బహుమతులు వివాదాస్పదం కావటం ఆదినుంచీ ఉంది.అధికారంలో ఉండగా నోబెల్‌ శాంతి బహుమతులు పొందిన తొలి అమెరికా అధ్యక్షుడు థియోడర్‌ రూజ్‌వెల్ట్‌. ఆయన రష్యా-జపాన్‌ మధ్య రాజీకుదిర్చినందుకు 1906లో అవార్డును ప్రకటించారు. ఇది ఒకవైపు మాత్రమే. స్పానిష్‌-అమెరికా యుద్ధానికి తోడ్పడినందుకు, ఫిలిఫ్పైన్స్‌లో రక్తం ఏరులుగా పారించినందుకు బహుమతిగా ఈ అవార్డు వచ్చిందన్న విమర్శలకూ ఆధారాలు లేకపోలేదు. బహుమతి ప్రకటన వెలువడగానే అమెరికా సైనిక బలప్రదర్శన ద్వారా ప్రపంచాన్ని భయపెట్టేందుకు గ్రేట్‌ వైట్‌ ఫ్లీట్‌( 16 నౌకాదళ నౌకలు)ను అట్లాంటిక్‌ సముద్రంలోకి నడిపించిన అపర 'శాంతి' ప్రియుడు రూజ్‌వెల్ట్‌. ఈ పూర్వరంగంలోనే బహుమతికోసం ఒబామా ఆఫ్ఘనిస్తాన్‌కు అదనపు సైన్యాలను పంపటం వాయిదావేశారని అమెరికాలో విమర్శలు వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు ఒబామా యంత్రాంగంలో ఒకసారి ప్రపంచానికి అమెరికా అంటే ఏమిటో తెలియచెప్పాలంటే మన వద్ద ఉన్న ఆధునిక ఆయుధాలన్నింటినీ ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రయోగించాలని జనరల్‌ స్టాన్లీ క్రిస్టల్‌ ఇప్పుడు లాబీయింగ్‌ నిర్వహిస్తున్నాడు. అంతకు ముందున్న కమాండర్‌ను మార్చి స్టాన్లీని ఒబామా కొత్త కమాండర్‌గా నియమించారు. మరో 17వేల మంది కొత్త సైనికుల తరలింపునకు ఆజ్ఞలు జారీ చేశారు. ఒకవైపు ఒబామా పేరును నోబెల్‌ కమిటీకి ప్రతిపాదించిన సమయంలోనే మరోవైపు అఫ్ఘనిస్తాన్‌కు మరింతగా మరో 40వేల అదనపు బలగాలను పంపటం గురించి ఒబామా సర్కార్‌ కసరత్తు చేస్తున్నది. నోబెల్‌ బహుమతి ప్రకటన గురించి ముందుగా తెలిసిన కారణంగానే బలగాలను పంపటంపై నిర్ణయాన్ని వాయిదా వేశారన్న విమర్శలు కూడా వచ్చాయి. మొదటి ప్రపంచ యుద్దంలోకి అమెరికాను లాగను అన్న ఎన్నికల వాగ్దానంతో రెండవసారి 1916లో గెలిచిన ఉడ్రోవిల్సన్‌ మరుసటి ఏడాదే అమెరికాను యుద్దంలో దించిన పెద్దమనిషి. వర్సెయిల్స్‌ సంధితో నానాజాతి సమితి ఏర్పాటుకు కారకుడయ్యాడనే పేరుతో ఆయనకూ 'శాంతికాముకుడు' ముద్రవేసి నోబెల్‌ బహుమతి ఇచ్చారు. ఫిలిప్ఫైన్లు, పాలస్తీనియన్లు, వియత్నామీయులు,


ఇప్పుడు ఆప్ఘనిస్తానీయులపై రోబోట్‌, క్షిపణి దాడులు జరుపుతూ వివాహవిందుల్లో ఉన్నవారిని, నిరాయుధులను విచక్షణా రహితంగా సంహరిస్తున్న వారందరికీ నోబెల్‌ శాంతి బహుమతులు రావటం రాజకీయం, అమెరికా తన అక్రమాలకు ముసుగువేసుకోవటం తప్ప మరొకటి కాదు. నోబెల్‌ శాంతి తాజాగా పొందిన ఒబామా, అంతకు ముందు అందుకున్న మార్టిన్‌ లూధర్‌కింగ్‌ జూనియర్‌, దలైలామా, అంగ్‌సాన్‌ సూకీ, నెల్సన్‌ మండేలా అందరూ తాము మహాత్మాగాంధీని చూసి స్ఫూర్తి పొందామని చెప్పుకున్నవారే. ఇంతమందికి ఆరాధ్యుడైన మహాత్మాగాంధీకి మాత్రం శాంతి బహుమతి ఇవ్వటానికి నోబెల్‌ కమిటీకి మనస్కరించకపోవటం వెనుక కూడా రాజకీయమే అని చెప్పకతప్పదు. ఎందుకంటే ఆయన బ్రిటీష్‌వారికి వ్యతిరేకంగా పోరాడటమే. అనేకసార్లు గాంధీపేరును ప్రతిపాదించినా తిరస్కరించిన కమిటీ తీరా ఆయన మతోన్మాదుల చేతిలో హత్యకు గురికాబోయే కొద్ది రోజుల ముందు ఆయనను జాబితా నుంచి తొలగించటం విచారకరమే అని ప్రకటించింది. ఆతరువాత 1948లో శాంతి బహుమతికి అర్హులైన సజీవులెవరూ లేనందున ఆ సంవత్సరానికి బహుమతిని ఇవ్వటం లేదని పేర్కొన్నది. వివాదం ఎలా ఉన్నా తనకు వచ్చిన బహుమతిని కార్యాచరణకు పిలుపుగా భావించి తాను స్వీకరిస్తున్నానని ఒబామా పేర్కొన్నారు. అయితే అది ప్రపంచశాంతిని ఒక్క అడుగు ముందుకు తీసుకుపోయినా సంతోషమే. అమెరికాలో మార్పు తీసుకువచ్చేందుకే నాకు అనుకూలంగా తీర్పు ఇవ్వమనే నినాదంతో ఎన్నికలలో పోటీ చేసిన ఒబామా తాను వాగ్దానం చేసిన ఆరోగ్యబీమా సంస్కరణలను అమలు జరపటానికి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటున్నారు. అటువంటిది ప్రపంచంలో ఏదో ఒకమూల అశాంతి, యుద్ధాలు లేకపోతే నిదురపట్టని ఆయుధలాబీ ఒబామాను శాంతికాముడిగా వ్యవహరించనిస్తుందని ఆశించటం అత్యాశే అవుతుంది. అయితే ఒబామాకు ఒకవేళ విఫలమైనా అన్నమాటను నిలబెట్టుకొనేందుకు చిత్తశుద్దితో ప్రయత్నిస్తే చరిత్ర బ్రహ్మరథం పడుతుంది, లేకుంటే చెత్తబుట్టలోకి నెడుతుందని ఒబామా గ్రహిస్తారా?

Note:Article from prajasakti Desk

No comments:

Post a Comment