Monday, 12 October 2009

భారత్‌-చైనా మైత్రిని చెడగొట్టే ప్రయత్నాలు

మన పత్రికల్లోనూ, టివీ చానళ్లలోనూ ఇటీవల చైనా నుండి మనకు పెద్ద ప్రమాదం వస్తున్నదనే ప్రచారం ఊపందుకున్నది. సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌, లడక్‌ సరిహద్దుల్లో అనేక చోట్ల చైనా సైన్యాలు సరిహద్దులు దాటి భారత్‌ లోకి చొరబడుతున్నాయన్న వార్తలు మీడి యాలో ముప్పిరిగొంటున్నాయి. విశేషమే మంటే ఇటు భారత ప్రభుత్వమూ, భారత సైన్యంలోని ఉన్నతాధికారులూ, అటు చైనా అధికారులూ ఈ వార్తలను ఖండిస్తున్నా ఇటు వంటి వార్తలు రావడం ఆగడం లేదు. నిప్పు లేకుండా పొగరాదంటారు. కాని మన మీడి యాలో మాత్రం నిప్పులేకుండానే పొగవ స్తోంది. సెప్టెంబర్‌ రెండో వారంలో సిక్కింలోకి చొచ్చుకు వచ్చిన చైనా సైన్యానికీ, భారత్‌ టిబెట్‌ సరిహద్దు భద్రతా దళాలకూ (ఐటిబిపి) మధ్య కాల్పులు జరిగాయినీ, కాల్పుల్లో ఇద్దరు ఐటిబిపి జవాన్లు గాయపడ్డా రని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రికలో ఒక వార్త వచ్చింది. వెను వెంటనే 'టైమ్స్‌ నౌ' ఛానల్‌ ఒక ప్రత్యేక స్టోరీ ప్రసారం చేసింది.



దాంతో ఇతర పత్రికలూ, చానళ్లూ వార్తా కథనాలూ, విశ్లేషణలూ అందు కున్నాయి. కాని అటువంటి కాల్పులు జరగడం గాని, భారతీయ జవాన్లు గాయపడడం గాని జరగలేదని భారత సైనికాధికారులు, విదే శాంగ శాఖ మంత్రి కూడా ప్రకటించారు. అంతేకాదు గౌహతి, కొల్‌కొతా నుండి ఈ తప్పుడు వార్తలు ఇచ్చిన విలేకరులపై సరిహద్దు భద్రతా అధికారుల కేసులు పెట్టారు. వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయనున్నట్లు హౌమ్‌శాఖ కూడా ప్రకటించింది. హౌమ్‌ శాఖ, విదేశాంగ శాఖ అధికారులు, ఉన్నత స్థాయి సైనికాధికారులు పదేపదే ఈ వార్తలను ఖండించిన తరువాతగాని పరిస్థితి కొంతమేరకు సద్దుమణగలేదు. భారత్‌-చైనా సంబంధాలు గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత పటిష్టంగా, సుహ్రుద్భావంగా ఉన్న తరుణంలో ఇటువంటి వస్తున్నాయని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సిద్ధార్ధ వరదరాజన్‌ పేర్కొన్నారు.



భారత దేశం బయటివారు ఎవరైనా ఈ వార్తలు చూస్తే రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చేస్తోందని అనుకుం టారు అని బిబిసి హిందీ బ్యూరో ఎడిటర్‌ అమిత్‌ బారువా రాశారు. నిజంగానే చైనా నుండి చొరబాట్లు జరిగితే భారత ప్రభుత్వం వాటిని ధీటుగా ఎదుర్కొనాలి. అలాగే మన సరిహద్దులను శత్రు దుర్భేద్యంగా ఉంచడానికి సకల చర్యలూ తీసుకోవాలి. కాని అటువంటి ఘటనలేవీ జరగడం లేదని ప్రభుత్వ నేతలూ, ఉన్నత సైనికాధికారులూ ప్రకటిస్తున్నా పదేపదే ఇటువంటి ప్రచారం ముందుకు రావడమే నేటి విశేషం.


మీడియా అత్యుత్సాహమా?


అకస్మాత్తుగా దేశంలో ఇటువంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి? ఎవరు పుట్టిస్తున్నారు? ఇదంతా మీడియా అత్యుత్సాహమనీ, రేటింగ్స్‌ పెంచుకోడానికి సంచలనాత్మకవార్తలకోసం జరుగుతున్న పోటీవల్ల ఇలా అవుతోందనీ కొందరంటున్నారు. మీడియా అత్యుత్సాహం, సంచలనాలకోసం దాని తాపత్రయం కొంతమే రకు కారణం కావచ్చు కాని పనిగట్టుకుని జరుగు తున్న 'చైనాచొరబాటు' ప్రచారం వెనుక మీడియా అత్యుత్సాహానికి మించిన అనేక కారణాలు న్నాయని పరిశీలకులు చెబుతున్నారు. సరిగ్గా ఇదే కాలంలో మన దేశంలో జరిగిన మరికొన్ని పరిణామాలును పరిశీలిస్తే ఈ ప్రచారం ఎవరు, ఎందుకు చేస్తున్నారో అర్ధం చేసుకోడానిక తోడ్ప డతాయి.


హైడ్రొజన్‌ బాంబు వివాదం


1998లో బిజెపి నాయకత్వంలోని ప్రభు త్వం రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో వరుసగా జరిపిన అణుపరీక్షల్లో హైడ్రొజన్‌ బాంబు పరీక్ష విఫలమయిందని పోఖ్రాన్‌-2లో రక్షణ పరిశో ధనా సంస్థ (డిఆర్‌డిఓ) తరఫున పాల్గొన్న శాస్త్ర వేత్త కె. సంతానం ఆగస్టు 16న ప్రకటించారు. హైడ్రొజన్‌ బాంబు పరీక్షలో అనుకున్న శక్తి ఉద్భ వించలేదని, కనుక ఈ ప్రయోగం విఫలమయి నట్లేనని ఆయన చెబుతూ ఈ ప్రయోగం ఆధా రంగా మన దేశం తయారుచేస్తున్న హైడ్రొజన్‌ బాంబులు అనుకున్న ఫలితాలను ఇవ్వబోవని చెప్పాడు. సంతానం చెప్పింది తప్పు, పోఖ్రా న్‌-2 పరీక్ష పూర్తిగా విజయవంతమైందని భారత అణుఇంధన కమిషన్‌ అధికారికంగా స్పష్టం చేసింది. కాని వివాదం ఆగలేదు. సంతానం వ్యాఖ్యానాల ఆధారంగా మీడియా అనేక కథనాలు ప్రసారం చేసింది. పరీక్ష విజయ వంతమైందని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ చెప్పారు.



సంతానం ప్రకటనను అణుఇంధన కమిషన్‌ మాజీ అధ్యక్షుడు చిదంబరం, బాబా అణుపరిశోధనా సంస్థ మాజీ అధ్యక్షుడు, హైడ్రొ జన్‌ బాంబు రూపకర్త అనిల్‌ కాకోద్కర్‌ ఖండిం చారు. అయినా సంతానం ప్రకటనలు ఆగలేదు. శాస్త్రవేత్తల్లో కొంతమంది సంతానానికి మద్దతు గా ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించారు. ఎప్పు డో పదకొండేళ్ల క్రితం జరిగిన అణు పరీక్షల గురించిన చర్చ మళ్లీ ఇప్పుడు ముందుకు తీసుకురావడానికి కారణమేమిటి? అంటే వాళ్లదగ్గర సరైన సమాధానం లేదు. కాని ఈ హైడ్రొజన్‌ బాంబు వివాదం కూడా చైనా కేంద్రంగా నడిచిన విషయాన్ని మనం పరిశీలిస్తే లింకులు అర్థమవుతాయి. తన మొదటి పత్రికా ప్రకటన తరువాత ఒక నెలరోజులకు సంతానం అక్టోబర్‌ 21న ఢిల్లీలో పత్రికలవారితో మాట్లా డుతూ ''చైనా నుండి దేశాన్ని రక్షించుకోవాలంటే మన దేశం వరుసగా అనేక హైడ్రొజన్‌ బాంబు పరీక్షలు జరపాలి'' అని కోరారు. చైనా వద్ద 200 అణుబాంబులున్నాయి. వాటిలో అనేక హైడ్రొజన్‌ బాంబులు. వాటిని ఎదుర్కోవాలంటే భారత్‌కూడా పెద్దఎత్తున హైడ్రొజన్‌ బాంబుల తయారీని చేపట్టాలని ఆయన పేర్కొన్నాడు.



పోఖ్రాన్‌-2 పరీక్ష హైడ్రొజన్‌ బాంబుల తయా రీకి సరిపోదనేది ఆయన అభియోగం. దేశ రక్షణను పటిష్ట పరుచుకోడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే. తీసుకుంటుంది కూడా. అయితే ప్రస్తుత ప్రచారం వెనుక దేశ రక్షణ సమస్యకాదు, చైనాను ప్రధాన శత్రువుగా చూపించడం అనే లక్ష్యం ఇమిడి ఉందనేది నిపు ణుల అభిప్రాయం.


శాంభవి ఉదంతం


సెప్టెంబర్‌ నెలలోనే మీడియాలో మరో చర్చ పెద్ద ఎత్తున సాగింది. ఏడేళ్ల శాంభవి అనే అమ్మాయి ఢిల్లీలో దలైలామాను కలుసుకుని చర్చలు జరిపిందనీ, తానూ, దలైలామా గత జన్మలో స్నేహితలమనే విషయాన్ని ఆమె దలైలా మాతో చెప్పగా ఆయన కూడా అంగీకరించా డనేది వార్త సారాంశం. పత్రికలూ, వార్తా ఛాన ళ్లూ ఈమె మాటలకు బాగా ప్రాచుర్యం కల్పిం చాయి. భారత దేశంలో దలైలామా కార్యకలాపాల గురించి తెలియని వారు ఎవరూ లేరు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలను కేంద్రంగా చేసుకుని ఆయన ఆధ్యాత్మకత ముసు గులో చైనా వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తున్నారు. దలైలామా మూడేళ్లకొకసారి నిర్వహించే కాలచక్ర సభలుగాని, ఆయన ఇతర కార్యకలా పాలుగాని చైనా వ్యతిరేక ప్రచారవేదికలుగా ఉంటాయనేది మనకు అనుభంలోని విషయమే. ఇప్పుడు శాంభవి నోటితో అదేవిధమైన ప్రచా రానికి పూనుకున్నారు.



2012 నాటికి చైనా నాశనమై పోతుందనీ, టిబెట్‌కు స్వాతంత్య్రం వస్తుందనీ శాంభవి మీడియాముందు చెప్పింది. టిబెట్‌ను చైనా అక్రమంగా ఆక్రమించుకున్నదని ఆమెచెప్పిన మాటలు ఆమెవి కావనీ, ఆమెచేత చెప్పించారనీ తేలికగానే అర్థమైపోతోంది. శాంభవి కర్నూలు జిల్లా నంద్యాలకు సమీపం లోని సూర్యనంది ఆశ్రమంలో అకస్మాత్తుగా ప్రత్యక్షమై ఈ విషయాలు చెప్పింది. అయితే ఆమెది మన రాష్ట్రం కాదు. ఆమె తల్లిదండ్రులు వారణాసిలో ఉంటున్నారు. మూడేళ్లుగా ఆమె ఉషారాణి అనే సంరక్షకురాలి పర్యవేక్షణలో సూర్యనందిలో ఉంటున్నట్లు చెబుతున్నారు. ఆ పాపకు సంబంధించిన మొత్తం వ్యవహారం ఒక మిస్టరీగానే సాగింది. ఆమె దలైలామా యొక్క చైనా వ్యతిరేక ప్రచార యంత్రాంగంలో భాగ మా అనేది పలువురు వ్యక్తపరిచిన సందేహం. ఇటీవల 'సాక్షి' పత్రికలో దాని న్యూఢిల్లీ విలేకరి వాసదేవన్‌ ఇటువంటివే అనేక సందేహాలు లేవనెత్తడంతోబాటు శాంభవిఉదంతం, ధర్మశా లలో దలైలామా కార్యకాలపాలను భారత- చైనాల మధ్య చిచ్చుపెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలుగా పేర్కొన్నాడు.



''అసలు ధర్మశా లలో ఏం జరుగుతోంది? గతజన్మల కోలా హలం హఠాత్తుగా ఈరోజే ధర్మశాలను ఎందు కు చుట్టుముట్టింది? భౌద్ధ భిక్షువుల మదిలో శాంభవి ఎందుకు ఆరాధనీయ స్థానం సంపా దించింది?'' అని వాసుదేవన్‌ ప్రశ్నిస్తూ ధర్మ శాలను గురించిన అనేక విషయాలు వెల్లడించారు. ఆయన ఇలా రాశారు: ''అసలు ధర్మశాలలో జరుగుతున్న విషయాలు బయటి ప్రపంచానికి ఇంతవరకూ తెలియకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులోనూ సాం స్కృతిక పరంగా భారతీయ జీవన శైలిపై టిబెటన్లు చేస్తున్న మెత్తటి దాడుల్లో భాగంగానే, ధర్మశాలలో క్రమక్రమంగా 'భారతీకరణ' అదృశ్య మైతోందనడానికి ప్రబల సాక్ష్యాలు ఇటీవల కాలంలో బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ధర్మశాలలోని దలైలామా అంతర్జాతీయ ఆధ్యా త్మిక కేంద్రం వద్ద, ఆశ్రమనియమాల పేరిట భారతీయుల రాకను క్రమబద్దీకరించే విషయం లోనూ, ప్రవాసంలో ఉన్న టిబెట్‌ ప్రభుత్వ పార్లమెంట్‌ ప్రాంగణంలోకి భారతీయులను అనుమతించే విషయంలో దలైలామా సెక్యూరిటీ అనుసరించే విధానాలూ ఏ సగటు భారతీయు డినైనా గాయపరుస్తాయి.



అయితే సెక్యూరిటీ సిబ్బంది విదేశీయలను అనుమతించే విషయం లో ఉదారంగా ఉంటున్న విషయం ఎవరికంటా పడటంలేదని వారనుకుంటున్నారు.''ధర్మశాల వ్యవహారాలు మొత్తం చాలా రహస్యంగా అక్కడి భారతీయ అధికారుల కళ్లుగప్పే పద్ధతిలో సాగుతున్నాయని వాసుదేవన్‌ రాశారు. శాంభవి ఉదంతం వెనుకనున్న చైనా వ్యతిరేక ప్రచారాన్ని గురించి ప్రస్తావిస్తూ ఆయన ఇలా రాశారు: ''అసలు శాంభవి పుట్టుపూర్వో త్తరాలేమిటి? ఆమెకు కేర్‌టేకర్‌గా వ్యవహరిస్తున్న ఉషారాణి అనే మహిళకూ, టిబెట్‌ ప్రవాస ప్రభుత్వ డిప్యూటీ స్పీకర్‌ దోల్మ గ్యారీకి ఉన్న అనుబంధమేమిటి? శాంభవిని డిప్యూటీ స్పీకర్‌ 'ఆచార్య శాంభవి'గా ప్రకటించడం వెనుక ఉన్న మతలబు ఏమిటి? అనే దిశగా మన నిఘా సంస్థలు దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. చైనాతో మన సంబంధాలు ఆందోళన కలిగించే దిశగా ప్రయనిస్తున్న సమయంలో ఒక చిన్నారి నోట పలికిస్తున్న చైనా వ్యతిరేక వ్యాఖ్యలు మన రెండు దేశాల నడుమ సాంస్కృతిక పరమైన ఉద్రిక్తతలు తలెత్తడానికి కారణమవుతాయనే ఇంగితం మన నిఘా సంస్థలకు కొరవడటమే దురదృష్టకరం.



మతపరంగా టిబెటన్లకు ఉన్న పునర్జన్మ, గతజన్మ అంశాలపై మనం స్పృశించ కపోవడం మన సంస్కారం కాబట్టి ఇన్నాళ్లుగా శాంభవి నెపంతో టిబెటన్లు అధికారికంగా నడిపిస్తున్న ఈ చైనా వ్యతిరేక ప్రచారానికి మన మద్దతు ఉందనే అపోహను టిబెటన్లు విదేశీ పర్యాటకుల మెదళ్లలోకి చాలా జాగ్రత్తగా ఎక్కించగలిగారు.''దలైలామా భారత దేశంలో ఎవరికి వ్యతి రేకంగా ఎవరికోసం పనిచేస్తున్నారో మనకు తెలియంది కాదు. ఆయనకు అంతర్జాతీయంగా అమెరికా, ఇతర సామ్రాజ్యవాద శక్తులనుండి లభిస్తున్న మద్దతుగురించి కూడా అందరికీ తెలుసు. నిజానికి దలైలామాకు భారత్‌ ఇస్తున్న మద్దతు, ఆయనా, ఆయన అనుయాయులూ సామ్రాజ్యవాదుల మద్దతుతో చైనాపై కుట్రలకు భారత భూభాగాన్ని ఉపయోగించుకుంటున్న వైనం భారత్‌-చైనాల మధ్య మొదటినుండీ సమస్యలు తెస్తూనే ఉన్నాయి. భారత్‌లో నడు స్తున్న టిబెట్‌ ప్రవాస ప్రభుత్వ కార్యకలాపాలు మన దేశానికి మేలు చేయకపోగా కీడు తెస్తున్నాయి.


ఎందుకీ ప్రచారం?


మన అణ్వస్త్ర కార్యక్రమాన్ని చైనాకు వ్యతిరేకంగా తిప్పడం, దలైలామా కార్యకలా పాలను అడ్డుపెట్టుకుని చైనా వ్యతిరేక ప్రచారానికి సరికొత్తగా తెరతీయడం, అదే సమయంలో భారత్‌లోకి చైనా చొచ్చుకు వస్తున్నదన్న ప్రచారం అందుకోవడం ఇవన్నీ ఒకేసారిగా ఎవరో వెనక ఉండి నడుపుతున్నట్లు ఒక్కసారిగా జరగడం విశేషం. చివరికి ప్రధాన మంత్రితో సహా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈ కుట్రపూరిత ప్రచారానికి తెరదించడానికి రంగంలోకి దిగాల్సి వచ్చింది. చైనా-భారత్‌ సరిహద్దులు సురక్షి తంగా ఉన్నాయని ప్రధాన మంత్రి దేశ ప్రజల నుద్దేశించి ప్రకటించారు. మొత్తంగా చూసిన ప్పుడు ఈ ప్రచారాలన్నిటి వెనుక ఒక్కటే లక్ష్యం కనిపిస్తోంది. భారత్‌-చైనాలు దగ్గర కాకుండా, రెండు దేశాల మధ్య సాధారణమైన సంబం ధాలు ఏర్పడకుండా అడ్డుకోవడమే ఆ లక్ష్యంగా కనిపిస్తోంది.



ఒకవైపు అమెరికాలోని పిట్స్‌ బర్గ్‌లో జి20 దేశాల శిఖరాగ్ర సదస్సు జరుగనున్న తరుణం లో, బ్రెజిల్‌తో కలిసి భారత్‌-చైనాలు ఈ సమావేశంలో కీలకమైన పాత్ర నిర్వహించే సమయంలో రెండు దేశాల మధ్య చిచ్చురేపడా నికే ఈ ప్రచారం జరుగుతోందన్నది పరిశీలు కుల భావన. ఇటీవల హిందూ పత్రికలో భారత మాజీ దౌత్యవేత్త ఎం.కె. భద్రకుమార్‌ ఒక వ్యాసం రాస్తూ భారత్‌ - చైనాల మధ్య యుద్ధం వస్తోందన్న వాతావరణాన్ని కల్పిస్తున్నవాళ్లెవరో చెప్పారు. ఆయన అభిప్రాయం ప్రకారం కేవలం మీడియాలోని ఒక సెక్షనే కాకుండా భారత ప్రభుత్వంలో కీలక పాత్ర నిర్వహించిన అమె రికా అనుకూల అధికారులు, మాజీ దౌత్య వేత్తలు, వ్యూహకర్తల పాత్ర ఉంది. థింక్‌ ట్యాంక్‌ పేరుతో వీళ్లు అభిప్రాయాలను మలిచే పనిచేస్తున్నారు.



న్యూఢిల్లీలో ప్రయివేటు నిధులతో నడుస్తున్న విధాన పరిశోధనా కేంద్రంలో వ్యూహాత్మక అధ్యయనాల ప్రొఫెసర్‌ అయిన బ్రహ్మ చెల్లయ్య, బిజెపి నాయకుడు అరుణ్‌ శౌరి వంటివారు భారత్‌-చైనాల మధ్య అగ్గి రగల్చడమే పనిగాపెట్టుకుని రచనలు చేస్తున్నారు. ఈ ప్రచారంలో మీడియాలోని ఒక భాగం కూడా పాత్ర వహిస్తోంది. ముఖ్యంగా మన దేశంలో విదేశీ నిధులతో నడుస్తున్న మీడియా ఈ విషయంలో చాలా చురుకుగా పనిచేస్తోంది. రెండోది, సైన్యంలోని ఒక సెక్షన్‌, చైనా మన దేశంమీద దాడికి వస్తోందన్న పద్దతిలో వార్తలను లీక్‌ చేస్తున్నారు. అనేక చోట్ల చైనా చొరబాట్ల వర్తాలు నేరుగా కాకుండా మీడియాకు లీకుల రూపంలో వస్తున్నాయి. దేశ ప్రజల్లో ఆ విధమైన భయోత్పాతం ఏర్పడితే సైన్యానికి ప్రభుత్వం నిధులు పెంచుతుందన్న భావం ఈ సెక్షన్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది.



ఇక మూడోది, మన దేశంలో బిజెపి-సంఫ్‌ు పరివార్‌లు బాహా టంగా, సైన్యంలోనూ, అధికార యంత్రాంగం లోనూ ఉన్న వారి అనుయాయులు లోపాయి కారీగా భారత్‌-చైనా సంబంధాలు చెడగొట్టడా నికి ప్రయత్నిస్తున్నారు. వారి అమెరికా అనుకూల, మితవాత ఎజెండాలో 'చైనాతో వైరం' అనేది ఒక భాగంగా ఉన్నది. అందుకే బిజెపి నాయకులు ప్రసుత ఎన్నికల్లో 'చైనా పట్ల భారత్‌ మెతక వైఖరి' అనే ప్రచారాస్త్రాన్ని చేపట్టారు.



హిందూ వ్యాసంలో భద్రకుమార్‌ ఒక ప్రశ్న లేవనెత్తారు. భారత్‌-చైనాల మధ్య యుద్ధాన్ని ఎవరు కోరుకుంటున్నారు? రెండు దేశాలు ఘర్షణ పడితే ఎవరికి లాభమో వారుకోరుకుంటున్నారు. ప్రపంచంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందు తున్న, ఇరుగుపొరుగు దేశాలైన భారత్‌-చైనాలు ఘర్షణ పడితే భారత్‌కూ లాభం ఉండదు, చైనాకూ లాభం ఉండదు. పైగా రెండు దేశాలూ చాలా తీవ్రంగా నష్టపోతాయి. కాని ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో భారత్‌-చైనాలు ఘర్షణ పడితే అమెరికా లాభపడుతుందని ఆయన నిర్ధారిస్తూ ఈ నాడు మన దేశంలో జరుగుతున్న ఈ చైనా వ్యతిరేక ప్రచారం వెనుక అమెరికా ప్రయోజనాలు కాపాడే శక్తుల ప్రమేయం ఉందని తేల్చారు.


అమెరికా వ్యూహం


ప్రపంచ పరిణామాలు నేడు అమెరికా స్వార్ధ ప్రయోజనాలకు వ్యతిరేక దిశలో పయని స్తున్నాయి. తన నాయకత్వంలో ఏకధృవ ప్రపంచాన్ని నిర్మించడానికి అమెరికా ప్రయత్ని స్తుంటే దానికి విరుద్ధంగా ప్రపంచం బహుళధృవ రాజకీయాలవైపు నడుస్తోంఇ. రష్యా, చైనాలు ఒకవైపు, లాటిన్‌ అమెరికాలో వామపక్ష ప్రభు త్వాలు మరోవైపూ అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్నాయి. ఇంకోవైపు వర్ధమాన దేశాలనుండి బ్రెజిల్‌, భారత్‌, చైనాలు కలిసి కట్టుగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాల ఏకపక్ష ధోరణులను ప్రతిఘటిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థికవ్యవస్థగా ఆవిర్భవించి మొదటి స్థానంవైపు శరవేగంగా దూసుకుపోతున్న చైనా, మూడో స్థానంలోకి త్వరలోనే చేరుకోబోతున్న భారత్‌ల మధ్య ఆర్థిక వాణిజ్య సంబంధాలు పెరిగితే అమెరికా సామ్రా జ్యవాద ఆధిపత్యానికి గండిపడినట్లే అవుతుంది.



ఇరుగుపొరుగున ఉన్న ఈ రెండు దేశాల మధ్య పూర్తి స్థాయిలో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు ఏర్పడితే ఆ బంధం ప్రపంచ శాంతికీ, సుస్థిర తకూ దోహదపడుతుంది. అమెరికాకు సరిగ్గా అదే ఇష్టం లేదు. భారత స్వతంత్ర అభివృద్ధి కాకుండా తన ప్రపంచాధిపత్య వ్యూహంలో దాన్ని జూనియర్‌ భాగస్వామిగా చేసుకోడానికి అది శతవిధాలా ప్రయత్నిస్తోంది. భారత్‌తో రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడం, అణు ఒప్పం దం, వ్యూహాత్మక సైనిక విన్యాసాలు నిర్వహిం చడం వగైరాలన్నీ ఇందులో భాగమే. మన దేశంలోని పాలకవర్గంలో ఒక సెక్షన్‌ దీనికి మద్దతుగా నిలబడింది.



కాని అమెరికా ప్రయత్నాలకు విరుద్ధంగా మరోవైపు భారత్‌-చైనాల మధ్య ఈ కాలంలో వాణిజ్య, దౌత్య సంబంధాలు వేగంగా పెరుగు తున్నాయి. 2008లో రెండు దేశాల మధ్య వాణిజ్యం 5,100 కోట్లడాలర్లకు (2,505,000 కోట్ల రూపాయలకు) చేరుకుంది. 2007తో పోలిస్తే 34 శాతం పెరిగింది. 2009లో ఇది 6,000 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. 1999లో రెండు దేశాలమధ్య వాణిజ్యం కేవ లం 33 కోట్ల డాలర్లు మాత్రమే ఉండేదంటే ఈ 15 ఏళ్లలో వాణిజ్య సంబంధాలు ఎంతగా పెరిగాయో అర్ధం చేసుకోవచ్చు. 1990 నుండి ప్రతిఏటా 30 శాతం వృద్ధి చెందుతోంది. అమె రికా-భారత్‌ల మధ్య జరుగుతున్న వాణిజ్యాన్ని నేడు భారత్‌ - చైనామధ్య వాణిజ్యం మించి పోయింది. 2000 సంవత్సరంలో అమె రికా-భారత్‌ల మధ్య 1,400 కోట్ల డాలర్ల వాణిజ్యం జరగ్గా 2007-08 నాటికి అది 4,200 కోట్ల డాలర్లకు పెరిగింది. అంటే 2000 నాటికి భారత్‌-చైనాల మధ్య జరిగిన వాణిజ్యం కన్నా భారత్‌-అమెరికాల మధ్య వాణిజ్యం అధికంగా ఉండేది, కాని ఇప్పుడది రెండో స్థానంలోకి పోయింది. నేడు భారత్‌కు అదిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనా మాత్రమే.



రెండోవైపు 1985లో రాజీవ్‌ గాంధీ చైనా పర్యటన తరువాత ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు బాగా వృద్ధి చెందుతూ వచ్చాయి. 1962 యుద్ధానికి దారితీసిన సరిహద్దు సమస్యను పక్కనబెట్టి రెండు దేశాలూ వాణిజ్య, ఆర్థిక, ఇతర సంబంధాలు పెంచుకోవాలని నిర్ణయానికి రావడం రెండు దేశాల సంబంధా లలో పెద్ద మార్పుకు దారితీసింది. 1962 తరువాత ఈనాటివరకూ భారత్‌-చైనాల మధ్య 3.500 కిలోమీటర్ల పైగా ఉన్న సరిహద్దుల్లో ఎటువంటి ఘర్షణా లేదు. ఈ ప్రాంతంలో ఘర్షణలో ఒక్క మరణమూ సంభవించలేదు. ఇటీవలెనే సిక్కింలో భూమార్గం ద్వారా వాణి జ్యానికి ఆరంభం పలికారు. ఇంకా అనేక సెక్టార్లలో వాణిజ్య మార్గాలు తెరిస్తే రెండు దేశాల సరిహద్దులు అభివృద్ధి మార్గలుగా మారిపోయే అవకాశం ఉంది.



అన్నిటికీ మించి నేడు అంతర్జాతీయంగా భారత్‌-చైనాలు తమ రెండు దేశాలకూ, వర్ధ మాన దేశాలకూ ప్రయోజనం చేకూర్చే అనేక అంశాలపై పరస్పర సమన్వయంతో వ్యవహ రిస్తూ పశ్చిమ దేశాల ఒత్తిళ్లను ప్రతిఘటించ గలుగుతున్నాయి. భూగోళ తాపాన్ని తగ్గించే వాయువుల అదుపు విషయంలో భారత్‌ - చైనాలు ఇటీవల అనేక వేదికల మీద సమన్వ యంతో వ్యవహరించి అమెరికా, ఇతర పశ్చిమ దేశాల ఒత్తిళ్లను తిప్పికొట్టగలిగాయి. డబ్ల్యుటివో దోహా దఫా వాణిజ్య చర్చల్లో కూడా రెండు దేశాలు కలిసి కట్టుగా అమెరికాకు చెక్‌ పెడుతున్నాయి. అలాగే అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పశ్చిమ దేశాలు తమపై సంక్షోభ భారాలు నెట్టివేయకుండా అడ్డుకుంటు న్నాయి. ఈ క్రమంలోనే పిట్స్‌ బర్గ్‌లో జరిగిన జి20 సమావేశంలో బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా (బ్రిక్‌)లు ప్రముఖ పాత్ర పోషించాయి. వీటితోబాటు ఇటీవలి కాలంలో భారత్‌-చైనా సైన్యాల మధ్య కూడా సంయుక్త విన్యాసాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు పెరుగుతున్నాయి. దాంతో రెండు దేశాల సైన్యాల మధ్య సహృద్భావం రోజురోజుకీ పెరుగుతోంది.



ఈ విధంగా భారత్‌-చైనా మధ్య వాణి జ్యం, ఇతర సంబంధాలు పెరగడం, అంతర్జా తీయ వేదికల మీద రెండు దేశాల మధ్య సమన్వ యం పెరగడం భారత్‌ను తన జూనియర్‌ భాగ స్వామిగా చేసుకోవాలనుకుంటున్న అమెరికా వ్యూహానికి హానికరం. కనుకనే రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టడానికి అది అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. మన వ్యవస్థలో చొచ్చుకుపోయిన అమెరికా అనుకూల శక్తులు దానికి ఈ ప్రయ త్నంలో అన్నివిధాలా సహకరిస్తున్నాయి. దీని గురించి హిందూ వ్యాసంలో భద్రకుమార్‌ ఇలా పేర్కొన్నారు: ''విశేషమేమంటే మన ప్రాంతంలో పాకిస్థాన్‌ సహకారంతో తన సైనిక ఉనికిని పెంచుకుంటున్న అమెరికా విధానాలనుండి ప్రజల దృష్టిని ఈ (చైనా వ్యతిరేక) యుద్ధ ఉన్మాదం పక్కకు మళ్లించింది. అదేవిధంగా ఆఫ్ఘనిస్థాన్‌ సమస్యపైనా, ఉగ్రవాదం సమస్యపైనా ఏవిధంగా సహకరించుకోవాలి అని భారత్‌, రష్యా, చైనాలు మార్గాన్వేషణ చేస్తున్న సమయంలో ఇది ఈ ప్రాంతంలో గందరగోళం నెలకొల్పింది.


ఈ ఉన్మాదాన్ని గనుక మరింత పెరగనిస్తే అప్పు డు చైనా బూచిని ఎదుర్కొనేందుకు భారత దేశం అమెరికాతో అనివార్యంగా సైనిక సహకారాన్ని విస్తరించుకోవలసి వస్తుంది...''

Note :Article from Prajasakti.com

No comments:

Post a Comment