ఇల్లలకగానే పండగ కాదు అన్నట్లుగా బెర్లిన్ గోడను కూల్చగానే పెట్టుబడిదారీ విధానం జయించినట్లు కాదని ఆ విధానాన్ని సమర్ధించేవారే చెబుతున్నారు. బెర్లిన్ గోడతో పాటు తూర్పుఐరోపా వాసుల బతుకులు కూడా కూలిపోయాయి. తెల్లవారే సరికి అనేక మంది దరిద్రులయ్యారు. తామొక మానవ సమాజంలో ఉన్నామన్న స్పృహను జనం కోల్పోయారని, కుటుంబవిలువలు దిగజారాయాని, చివరికి మతాన్ని కూడా పట్టించుకోకుండా వినిమయతత్వానికి గురయ్యారని చింతిస్తున్నారు. బెర్లిన్ గోడను కూల్చివేసి తూర్పు జర్మనీని పశ్చిమజర్మనీ కబళించి సోమవారం నాటికి ఇరవై సంవత్సరాలు నిండాయి. ఈ సందర్భంగా జర్మనీ ప్రభుత్వం గోడకూల్చివేత ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించింది. జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, ఫ్రెంచి అధ్యక్షుడు సర్కోజీ, బ్రిటన్ ప్రధాని గార్డన్ బ్రౌన్ ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు.
సోవియట్ మాజీ అధ్యక్షుడు గోర్బచెవ్, మెర్కెల్ చెట్టాపట్టాలేసుకొని కూల్చివేసిన గోడ ప్రాంతంలో కొంతదూరం నడిచే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. తమ దేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంద్యాన్ని పరిష్కరించటంలో విఫలమై దిక్కుతోచని నాయకులు జనం దృష్టిని కొద్దిసేపైనా మళ్లించేందుకు దీనిని ఒక అవకాశంగా తీసుకున్నారు. అయితే వారి సంతోషంపై బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్(బిబిసి) సంస్థ నిర్వహించిన సర్వే అంశాలు నీళ్లుపోశాయి. ప్రపంచవ్యాపితంగా 27 దేశాల పౌరులనుంచి సేకరించిన అభిప్రాయాలు వారికి వణుకు పుట్టించేవిగా ఉన్నాయి. ఎనభైతొమ్మిది శాతం పెట్టుబడిదారీ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యధికులు ఇప్పటికీ సోషలిస్టు విధానమైన సంపదలను సమంగా పంపిణీ చేసే ప్రభుత్వ విధానం కావాలని కోరుతున్నట్లు స్పష్టం చేశారు.
ఈ సర్వేలో భాగస్వామి అయిన గ్లోబ్‌స్కాన్ అధ్యక్షుడు డౌగ్ మిల్లర్ సర్వే ఫలితాల గురించి వ్యాఖ్యానిస్తూ '' అప్పుడు అందరూ అనుకున్నట్లుగా, ముఖ్యంగా గత ఏడాదికాలంలో జరిగిన పరిణామాలను చూస్తే 1989లో బెర్లిన్ గోడ కూల్చివేత స్వేచ్ఛామార్కెట్ పెట్టుబడిదారీ విధానానికి ఘనవిజయంగా కనపడటం లేదు.'' అన్నారు. సోషలిస్టు విధానంలోని సంపదలను సమంగా పంపిణీ చేయటం వంటి అంశాలు ఇప్పటికీ ప్రపంచంలో ఎందరినో ఆకర్షిస్తున్నాయని మరో భాగస్వామ్య సంస్థ 'పిపా' ప్రతినిధి స్టీవెన్ కుల్ వ్యాఖ్యానించారు. కేవలం పదకొండుశాతం మాత్రమే పెట్టుబడిదారీ విధానంగా బాగా పనిచేస్తున్నదని చెప్పారు. అమెరికాలో 25శాతం, పాకిస్తాన్‌లో 21 మంది అత్యధికంగా సమర్థించిన వారున్నారు. మార్కెట్ పెట్టుబడిదారీ విధానంలోప భూయిష్టమైనదని దాన్ని సంస్కరించటం, అదుపులో ఉంచాలని అత్యధికులు అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం మరింత చురుకైన పాత్ర వహించాలని లేదా పెద్దపరిశ్రమలకు యజమానిగా ఉండాలని 15దేశాల వారు చెప్పటం విశేషం. ఇలా చెప్పిన వారిలో పూర్వపు సోషలిస్టు రిపబ్లిక్‌లైన రష్యా, ఉక్రెయిన్‌తో బ్రెజిల్, ఇండోనేషియా, ఫ్రాన్స్‌కు చెందిన వారు 77 నుంచి 57శాతం వరకు ఉన్నారు. ఇరవైరెండు దేశాలకు చెందిన వారిలో మూడింట రెండువంతుల మంది ప్రభుత్వాలు సంపదలను సమంగా పంపిణీ చేయాలని చెప్పారు. సోవియట్ కూలిపోవటం చెడుపరిణామమని 22శాతం చెబితే తమకు దాని గురించి తెలియదని 24శాతం పేర్కొన్నారు. ధనిక దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడాలకు చెందినవారు మాత్రమే మంచిపరిణామం అని ఎక్కువ మంది చెప్పారు. ఈజిప్పు వంటి దేశాలలో 69శాతం మంది హానికరమని తెలిపారు. ఈ సర్వే నిర్వహించిన బిబిసి గానీ, దానికి సహకరించిన వారు గానీ సోషలిజం, కమ్యూనిజాన్ని సమర్థించేవారు కాదని గ్రహించాలి.
తూర్పు ఐరోపాలో సోషలిస్టు వ్యవస్థలను కూల్చేందుకు పెద్ద కుట్ర జరిగిందని, దానిలో అమెరికాతో పాటు వాటికన్ చర్చి కీలకమైన పాత్ర నిర్వహించిందని అప్పుడు కమ్యూనిస్టులు చెబితే నిరాకరించిన వారు ఇప్పుడు పునరాలోచించుకోవాలి. బెర్లిన్ గోడ కూల్చివేత 20వ వార్షికోత్సవం సందర్భంగా జర్మన్ పత్రిక 'డెర్‌స్పీగల్' పోలెండ్ సాలిడారీటీ నాయకుడు లెచ్‌వాలేసాను ఇంటర్వ్యూ చేసింది. తమకు అనేక ఇతర దేశాల నుంచి మద్దతు లభించిందని ముఖ్యంగా పోప్ కీలకమైన పాత్ర వహించాడని ఒక్క పోలాండ్‌లోనే గాక అనేక చోట్ల ప్రార్ధనల ద్వారా సమీకరణ చేశాడని వాలేసా చెప్పాడు. మేం ఆందోళన ప్రారంభించేటపుడు ఇప్పుడు మనం చూస్తున్న పోలాండ్, ఐరోపాను చూడగలమని చెబితే నేనసలు నమ్మలేదు. అయినప్పటికీ ఇప్పుడు వెనుదిరిగి చూసుకుంటే మేం కోల్పోయిన అవకాశాలన్నీ కనిపిస్తున్నాయి. నాకు సంతృప్తిగా లేదు, నేనెప్పుడూ చెబుతుంటాను నేను జరిగిందానికి అనుకూలం ఇదే సమయంలో దానికి వ్యతిరేకం కూడా అని.
మేం కోల్పోయిన అవకాశాల గురించి చెబుతాను. ప్రజాస్వామ్యం మూడు అంశాలతో కూడుకున్నది. ఒకటి బహుళత్వ సిద్ధాంతాలకు చట్టాలు మద్దతు ఇస్తున్నాయా లేదా అన్నది, రెండవది ఈ చట్టాలను పౌరులు ఉపయోగించుకోగలుగుతున్నారా లేదా? మూడవది ఈ ప్రజాస్వామ్యం ద్వారా జనం తమ పర్సులు నిండుగా ఉండటానికి తోడ్పడిందా లేదా అన్నది చూడాలి. పోలండ్‌లో ప్రజాస్వామ్యానికి చట్టపరమైన పునాది ఉంది. అయితే ఇంతవరకు దానిని పూర్తిగా వినియోగించుకున్నట్లు మేం రుజువు చేయలేదు. ఇక మా పర్సుల విషయానికి వస్తే గతం కంటే పరిస్థితి ఘోరంగా దిగజారింది. సోషలిస్టు వ్యవస్థలను కూలదోయటంలో ముఖ్యపాత్ర వహించిన విద్రోహి లెచ్‌వాలేసాయే స్వయంగా ఇలా చెప్పిన తరువాత సోవియట్, తూర్పు ఐరోపా దేశాలలో ఇప్పటి పరిస్థితి ఎలా ఉందో చెప్పనవసరం లేదు. సామ్రాజ్యవాదులు తమ ప్రయోజనాలను నెరవేర్చుకొనేందుకు ఎవరినైనా పావులుగా వాడుకోవటానికి వెనకాడరు.
తూర్పు ఐరోపాలో కమ్యూనిజాన్ని కూలదోసిన పోప్‌ను, తమ సాలిడారిటీని గానీ ఎవరూ ఇప్పుడు కనీసం ప్రస్తావన కూడా చేయటం లేదని వాలేసా ఉక్రోషం వెలిబుచ్చాడు. ప్రజాస్వామ్యం పేరుతో తాను రాజకీయ ఓటమికి అంగీకరించకతప్పలేదని, అది నా తలరాత.... నిజమైన విప్లవకారుడి తలరాత కూడా అని చరిత్ర చెత్తబుట్టలో ఉన్న వాలేసా తన ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు.
అమెరికాతో సహా ఐరోపా ధనికదేశాలన్నీ సోవియట్, తూర్పు ఐరోపాలో సోషలిస్టు వ్యవస్థలను కూల్చివేయటంలో ఏకాభిప్రాయంతో ఉన్నాయి. అయితే బెర్లిన్ గోడ కూల్చివేత పేరుతో తూర్పు జర్మనీని పశ్చిమ జర్మనీ ఆక్రమించకూడదని ఆ దేశాలన్నీ కోరుకున్నాయి. అది విడిగానే ఉండేట్లు చూడాలని ఆ దేశాల వారు స్వయంగా గోర్బచెవ్‌కు సలహాయిచ్చినట్లు సోమవారం నాడు అమెరికా విడుదల చేసిన నాటి సిఐఏ ఇతర పత్రాలు వెల్లడించాయి. బెర్లిన్ గోడను నవంబరు తొమ్మిదిన కూల్చివేయటం ప్రారంభిస్తే అంతకు ముందే పశ్చిమదేశాల వారు జర్మనీ ఐక్యం కాకుండా చూడాలని గోర్చచెవ్‌ను కోరారు.
అప్పటి బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్ 1989 సెప్టెంబరు 23న ' నాటో ప్రకటనలో తామేమి పేర్కొన్నప్పటికీ తూర్పు ఐరోపాను అసిరపరచాలని, బ్రిటన్, పశ్చిమ ఐరోపా కూడా జర్మనీ ఐక్యతను కోరుకోవటం లేదని గోర్బచెవ్‌తో థాచర్ చెప్పారని తమ సంభాషణను రికార్డు చేయవద్దని థాచర్ కోరారని అయితే తాను వెంటనే బయటకు వచ్చి వాటిని గుర్తుకు తెచ్చుకొని తన డైరీలో రాసుకున్నట్లు నాటి గోర్బచెవ్ సహాయకుడు చెర్నయెవ్ పేర్కొన్నాడు. ఇలాగే ఇతర అగ్రనాయకులతో గోర్బచెవ్ జరిపిన సంభాషణల వివరాలను కూడా అమెరికా బయట పెట్టింది. ఒకవైపు గోడను కూల్చివేస్తుండగా అదే సమయంలో సమావేశమైన సోవియట్ కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో అసలు దాని గురించి పట్టించుకోలేదంటే ఆ పార్టీ ఏ స్థితిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.చివరగా చెప్చొచ్చేదేమంటే తూర్పు జర్మనీని ఆక్రమించిన పశ్చిమ జర్మనీ ఒకే దేశంగా ఉన్నప్పటికీ రెండు దశాబ్దాల తరువాత కూడా తూర్పు జర్మన్లు పశ్చిమ జర్మన్లతో సమంగా లేరు.
ఆ ప్రాంతంలో నిరుద్యోగం, దారిద్య్రం ఎక్కువగా ఉంది. జర్మనీ ఐక్యతకంటే గర్వంగా చెప్పుకోవటానికి మరొకటి లేదని నాడు ఛాన్సలర్‌గా ఉన్న హెల్మట్ కోల్ అంటున్నారు. అయితే దీనివలన తమకెలాంటి లబ్ది కలగలేదని 34 శాతం మంది పశ్చిమ జర్మన్లు చెప్పినట్లు తాజా సర్వే వెల్లడించింది. తమను రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నారని 42శాతం మంది తూర్పు జర్మన్లు భావిస్తున్నారు. మాకు ప్రత్యేకతంటూ లేకుండా చేశారు. మా విద్యావ్యవస్థను మార్చివేశారు, జాతీయ పతాకం, గీతాన్ని రద్దు చేశారు, చివరికి ఉద్యోగాలను కూడా పోగొట్టారు. ఒకే తరహా ఉద్యోగం చేస్తున్న మాకు పశ్చిమ ప్రాంతంకంటే 20శాతం తక్కువ వేతనం ఇస్తున్నారు. పదిహేను లక్షల మంది తూర్పువారు పశ్చిమ ప్రాంతానికి వెళ్లి చిన్న చిన్న పనులు చేస్తున్నారు. వారికి అక్కడి వారికి ఇచ్చే దానిలో మూడోవంతు మాత్రమే చెల్లిస్తున్నారు. ఐక్యత పేరుతో తమ దేశాన్ని ఆక్రమించి తమను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారని తూర్పు జర్మన్లు భావిస్తున్నారు.
No comments:
Post a Comment