Thursday, 19 November 2009

అమెరికా దూకుడుకు పగ్గం వేసిన సంక్షోభం

కమ్యూనిస్టు చైనాను అమెరికా గుర్తించి మూడుదశాబ్దాలు గడిచింది. మొత్తంగా చూస్తే ద్వైపాక్షిక సంబంధాల త్రాసు చైనా వైపే మొగ్గిందని జర్మన్‌ పత్రిక డెర్‌స్పీగల్‌ వ్యాఖ్యానించింది. చైనా వద్ద ఉన్న విదేశీ కరెన్సీలో మూడింట రెండువంతులు అమెరికన్‌ డాలర్లే. అమెరికా గనుక తిక్క వేషాలు వేస్తే చైనా ప్రతిఘటనకు పూనుకుంటే డాలర్‌ అల్లకల్లోలం అవుతుంది. ఒక వేళ అమెరికా ఆర్థిక సంక్షోభం ముదిరి డాలర్‌ పతనమైతే చైనా కూడా భారీగా నష్టపోవటం అనివార్యం. అందుకే డాలర్‌ స్థానంలో మరో కరెన్సీని ఉనికిలోకి తెచ్చే యత్నాలను చైనా ప్రోత్సస్తున్నది.


గతంలో చైనా పర్యటించిన అమెరికా అధ్యక్షులు. మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌ మాఇంటికొస్తే మాకేం తెస్తావ్‌ అన్న రీతిలో వ్యవహరించేవారు. ప్రస్తుత అధ్యక్షుడు బరాక్‌ హుస్సేన్‌ ఒబామా పర్యటన మౌలికంగా కాకున్నా ఒక ఎత్తుగడగా గతానికి భిన్నం. చైనాను డిమాండ్‌ చేయగలిగిన స్థితి నేడులేదు. చైనాకు ఆగ్రహం కలిగించకుండా ఉండేందుకే గతనెలలో దలైలామా అమెరికా పర్యటన సందర్భంగా ఆయనతో భేటీకి సిద్ధం కాలేదు. ఆరురోజుల ఒబామా పర్యటన 13వ తేదీన జపాన్‌తో ప్రారంభమై 18న దక్షిణ కొరియాతో ముగుస్తుంది. ఆ సందర్భంగా చైనా తమకు ఒక కీలకమైన భాగస్వామిగా ఉండటంతో పాటు స్నేహపూర్వకమైన పోటీదారుగా కూడా ఉందని ఒబామా పేర్కొన్నాడు. చైనా పురోగమనాన్ని అడ్డుకోవాలని తాము అనుకోవటం లేదన్నారు. ఉభయదేశాల మధ్య ఉన్న ఆర్థిక అసమతూకాన్ని సరిచేయని పక్షంలో అనేక ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు. మూడురోజుల చైనా పర్యటనలో భాగంగా ఆదివారం నాడు షాంఘైకార్యక్రమాలలో పాల్గొన్న ఒబామా సోమవారం నాడు బీజింగ్‌ చేరుకున్నారు.



తామేంటో, తమశక్తేంటో చెప్పకుండానే చేసి చూపటంలో చైనీయులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. జూనియర్‌ బుష్‌ తాను అధికారంలో ఉన్న ఎనిమిది సంవత్సరాలూ ఓడిపోయినా తనదే పైచేయి అన్నట్లుగా నానా హంగామా చేశాడు. ఒబామా అలా చేయాలన్నా మారిన పరిస్థితులు అందుకు సహకరించేవిగా లేవు. అయితే సింహం దెబ్బతిన్నప్పటికీ దాని సహజలక్షణం కోల్పోదు. అమెరికా కూడా అంతే. తమ దగ్గర ప్రారంభమై ప్రపంచానికంతటికీ పాకించిన ఆర్థిక సంక్షోభంతో తాము ఒళ్లుదగ్గర పెట్టుకోకపోతే నష్టపోయేది తామే అని ప్రస్తుతానికి అమెరికన్లు తెలుసుకున్నట్లు ఈ పర్యటన సందర్భంగా ఒబామా చేస్తున్న ప్రకటనలు ఉన్నాయి. చైనా-అమెరికా విరోధులు కావని ఒకటికి రెండుసార్లు పేర్కొన్నారు. మాయలపకీరు ప్రాణం సప్త సముద్రాల అవతల మర్రి చెట్టు తొర్రలోని చిలకలో ఉందన్నట్లుగా ఇప్పుడు అమెరికా జీవనాడులు చైనా చేతుల్లో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అందుకే ఒక ఎత్తుగడగా అయినా స్నేహం కనపరుస్తున్నది. ఇదే సమయంలో చైనాకు ఉండే ప్రమాదాలు ఉన్నాయి.



చైనాలోని చాంగ్‌షాలో ఉన్న చైనా రక్షణ సాంకేతిక విశ్వవిద్యాలయం రూపొందించిన తైనహె అనే సూపర్‌ కంప్యూటర్‌ను ఒబామా పర్యటన సందర్భంగా విడుదల చేశారు. దాని శక్తి ఎంతంటే సెకనుకు లక్షకోట్లకు పైగా సమస్యలను పరిష్కరించగలుగుతుంది. ఓ అమెరికా నీవేకాదు, మేం కూడా నీవద్ద ఉన్న సూపర్‌ కంప్యూటర్లకు తీసిపోని వాటిని తయారు చేయగలం అని చెప్పటమే దీని ఉద్ధ్యేశం. అమెరికాతో సహా పశ్చిమ దేశాలు సంక్షోభం నుంచి ఎప్పటికి బయటపడతాయో తెలియని స్థితిలో ఉండగా చైనా మాత్రం ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో తొమ్మిదిశాతం అభివృద్ధిని నమోదు చేసింది. ఈ శతాబ్ది మధ్యనాటికి తాము ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టగలిగిన సైనికపాటవాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించుకోగలమని కూడా ఒబామా పర్యటనకు ముందు చైనా వైమానిక దళాధిపతి క్జు క్విలాంగ్‌ రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ఇది చైనా దౌత్యానికి నిదర్శనం.



కమ్యూనిస్టు చైనాను అమెరికా గుర్తించి మూడుదశాబ్దాలు గడిచింది. మొత్తంగా చూస్తే ద్వైపాక్షిక సంబంధాల త్రాసు చైనా వైపే మొగ్గిందని జర్మన్‌ పత్రిక డెర్‌స్పీగల్‌ వ్యాఖ్యానించింది. చైనా వద్ద ఉన్న విదేశీ కరెన్సీలో మూడింట రెండువంతులు అమెరికన్‌ డాలర్లే. అమెరికా గనుక తిక్క వేషాలు వేస్తే చైనా ప్రతిఘటనకు పూనుకుంటే డాలర్‌ అల్లకల్లోలం అవుతుంది. ఒక వేళ అమెరికా ఆర్థిక సంక్షోభం ముదిరి డాలర్‌ పతనమైతే చైనా కూడా భారీగా నష్టపోవటం అనివార్యం. అందుకే డాలర్‌ స్థానంలో మరో కరెన్సీని ఉనికిలోకి తెచ్చే యత్నాలను చైనా ప్రోత్సస్తున్నది. ఈ ఏడాది సెప్టెంబరు నెలలో అమెరికా టైర్ల కంపెనీల యాజమాన్యాలు చైనా నుంచి దిగుమతి అవుతున్న టైర్లపై ధ్వజమెత్తాయి. వారి వత్తిడికి లొంగి 35శాతం దిగుమతి పన్ను విధించటానికి సిద్ధపడ్డాడు. మాటైర్లపై పన్ను వేస్తే మీ ఆటోమొబైల్స్‌, కోడిమాంసం సంగతి ఒక్కసారి ఆలోచించుకోండని చైనా హెచ్చరించటంతో తోకముడవక తప్పలేదు.



చైనా వద్ద ఉన్న డాలర్లను అప్పుగా తీసుకోకపోతే అమెరికాకు నేడు గడిచే స్థితిలేదు. అమెరికా జారీ చేసిన సెక్యూరిటీలలో నాలుగోవంతు చైనా వద్ద ఉన్నాయి. చైనా విదేశీ కరెన్సీ నిల్వలు రెండులక్షల కోట్ల డాలర్లకు పెరిగాయి. దీనికంటే చైనాలో తయారయ్యే వస్తువులు చౌకగా ఉన్నందున అమెరికాకు ద్రవ్యోల్బణం సమస్యలు పరిమితంగా ఉన్నాయి. చైనా తన స్థూలజాతీయోత్పత్తిలో 13శాతం ఉద్దీపన పథకాలకింద ఖర్చు చేస్తున్నది. ఇది అమెరికా చేసిన ఖర్చు కంటే రెండింతలు, జర్మనీ కంటే ఐదురెట్లు ఎక్కువ.అమెరికా ఉద్దీపన అంటే దివాళాతీసిన బ్యాంకులను ఆదుకోవటమే. నిరుద్యోగులైన కోట్లమంది గురించి పట్టించుకోవటం లేదు. పర్యావరణం పేరుతో అమెరికా గనుక రాయితీలను డిమాండ్‌ చేస్తే తాము ప్రపంచంలో డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మరొక కరెన్సీని ఉనికిలోకి తెచ్చేందుకు మద్దతు ఇస్తామని చైనీయులు పరోక్షంగా హెచ్చరించారు.



అందువలన గతం కంటే ఇప్పుడు చైనాపై అమెరికా ఆధారపడటం మరింత పెరిగింది. అమెరికా జీవన విధానం చైనాలో తయారవుతున్నదని యూరోపియన్లు అమెరికన్లపై జోకులేస్తున్నారు. అమెరికా ప్రపంచ పెట్టుబడిదారీ విధానానికి ఇంజను వంటిది. విశ్వ శాంతి, సంపదలకు తాము చెబుతున్న మార్కెట్‌ ఆర్థిక విధానమే శరణ్యమని అమెరికన్లు దశాబ్దాల తరబడి చెబుతున్నదంతా తాజా ఆర్థిక సంక్షోభంతో కొట్టుకుపోయింది. మరోవైపు చైనా తన విధానాలతో ఐరోపాలో అనేక మంది అభిమానులను సంపాదించుకోవటమే కాదు, ఆఫ్రికాలో తన పలుకుబడిని పెంచుకుంది. లాటిన్‌ అమెరికాలో దాని ప్రభావం నానాటికీ పెరుగుతున్నది. ఆ ప్రాంత దేశాలలో పెద్దదైన బ్రెజిల్‌ ప్రధాన వాణిజ్య భాగస్వామిగా నేడు చైనా అవతరించింది.



ఇదే సమయంలో చైనా ఇప్పటికీ అమెరికాతో పోలిస్తే ఇంకా ఎంతో వెనుకబడి ఉందన్న విషయాన్ని విస్మరించరాదు. ప్రపంచంలో అమెరికా అతిపెద్ద మిలిటరీ శక్తిగా ఉంది. చైనాలోని తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌కు ఏటా ఆధునిక ఆయుధాలను సమకూర్చుతున్నది. టిబెట్‌ వేర్పాటువాదులకు మద్దతునిస్తున్నది. చైనాలో మానవ హక్కుల గురించి మాట్లాడుతూనే ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తాజాగా ప్రకటించినదాని ప్రకారం 1990 నుంచి 2009 వరకు చైనా జిడిపి 536శాతం పెరగ్గా ఇదే కాలంలో అమెరికాలో పెరుగుదల 61శాతమే. అయినప్పటికీ తలసరి ఆదాయంలో 46,443డాలర్లతో అమెరికా ఎంతో ముందుంది. చైనాలో 3,566 డాలర్లు ఉంది. ఇదే సమయంలో అమెరికాలో వృద్దిరేటు సగటున 2.8, అప్పు 3.4లక్షల కోట్ల డాలర్ల విదేశీ అప్పుతో సహా మొత్తం అప్పు 13లక్షల కోట్ల డాలర్లు, చైనాకు చేస్తున్న ఎగుమతులు 69.7 బిలియన్‌ డాలర్లు, చైనాతో వాణిజ్యలోటు 268 బిలియన్‌ డాలర్లు ఉంది.



మరోవైపున చైనాలో అభివృద్ధిరేటు తొమ్మిదిశాతం, విదేశీ మారకద్రవ్యనిల్వలు 2.3లక్షల కోట్ల డాలర్లు, అమెరికాతో వాణిజ్యమిగులు 268 బిలియన్‌ డాలర్లు ఉంది. రానున్న కొద్ది రోజుల్లో రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్‌ స్థానాన్ని చైనా ఆక్రమించనుందని కొందరు చెబుతున్నారు. ఈ కారణంగానే చమురు సంపదలున్న అరబ్బు దేశాలతో సహా ప్రపంచదేశాల రాజధానుల్లో అమెరికా కంటే చైనాతో కరచాలనం చేయటమే ఎక్కువ లాభమనే వాతావరణం క్రమంగా పెరుగుతున్నది.

No comments:

Post a Comment