Wednesday, 18 November 2009

శాస్త్రవేత్తలలో అశాస్త్రీయతం ఎందుకుంటోంది?




•పాలకవర్గాలలో మార్పు వచ్చేటందుకు పోరాడుతూనే, తక్షణ చర్యగా విద్యార్థులకు మూఢనమ్మకాల వెనుకనున్న అశాస్త్రీయతను వివరించి, వాటిని పోగొట్టే శాస్త్రీయ అవగాహనను విడమర్చి చెప్పాలి. శాస్త్రీయతను పెంచే పుస్తకాలు కూడా కథలు, సంఘటనలతో కూడి ఆసక్తికరంగా వస్తున్నాయి. అలాంటి పుస్తకాలను చదవమని వారిని ప్రోత్సహించాలి. ఆ పుస్తకాలు విద్యార్థుల పాలిటి బి కాంప్లెక్స్‌ మాత్రలుగా పనిచేస్తాయి. పై కార్యక్రమాన్ని సైన్సు కార్యకర్తలైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, దీక్షతో ఆచరిస్తే కనీసం భావితరాన్నైనా కాపాడుకోగలం.

.''రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ'' (డిఆర్‌డిఓ)లో సీనియర్‌ శాస్త్రవేత్తలు ఎం కామేశ్వరరావు, ఎ ఎస్‌ఎస్‌వీ భాస్కర్‌లు నరబలిపేరిట జూనియర్‌ శాస్త్రవేత్త సుశీల్‌ కుమార్‌ను హత మార్చేందుకు ప్రయత్నించారు. అయితే సుశీల్‌కుమార్‌ తప్పించుకున్నారు. సీనియర్‌ శాస్త్రవేత్తలపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.


(ఆంధ్రజ్యోతి 13.10.09)


''హైదరాబాద్‌ నగరంలో జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయంలో, సాంకేతిక విద్యాధికులందరి సమక్షంలో, పరిపాలనా భవనం నాలుగుమూలలా నాలుగు జంతువలను బలి ఇవ్వడం జరిగింది''


(ఈనాడు 16-10-94)


పై రెండు వార్తలే కాదు. పత్రికలలో శాస్త్రవేత్తలు, సాంకేతిక విద్యావేత్తల అశాస్త్రీయ చర్యలను గూర్చిన అనేక దిగ్భ్రాంతికరమైన వార్తలు నెలకొకటైనా వింటున్నాము. ఎందుకిలా జరుగుతోంది? నిరక్షరాస్యులు చేతబడులు నమ్ముతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. వారి నిరక్షరాస్యతే ఈ అజ్ఞానానికి దారితీసిందని సమాధానపడవచ్చు. కాని శాస్త్రాలను ఔపోసన పట్టినవారు, విద్యావికాసంతో పదిమందికీ తోవ చూపవలసిన వారు నరబలివంటి అమానుష చర్యలను ఎలా నమ్మి ఆచరిస్తున్నారు? వాటికి కారణాలేమిటి? ఈ అంశాలను పరిశీలిద్దాం.



మన రాజ్యాంగం-51ఎ (హెచ్‌) ఆర్టికల్‌ ప్రకారం ప్రజలలో శాస్త్రీయ అవగాహనను పెంపొందించడం ప్రతి ఒక్క పౌరుని బాధ్యత. అలాంటి అవగాహనను పెంపొందించడానికి ఉత్తమ సాధనం విద్య, ''జాతి నిర్మాణం తరగతి గదిలోనే జరుగుతుందని'' కోఠారి సెలవిచ్చారు. అలాంటి తరగతి గదుల్లో ఎక్కడా శాస్త్రీయ అవగాహనను పెంపొందించే విధానాలు అమలు కావడం లేదు. 1వ తరగతి నుండి పదవ తరగతి వరకూ ఏ క్లాసులోనూ, సిలబస్‌లో సమాజంలో నెలకొని ఉన్న మూఢ నమ్మకాలను ఖండించి శాస్త్రీయ అవగాహనను పెంపొందించే ఒక్క అంశం కూడా చేర్చడం జరగలేదు. పైగా మానవ పరిణామాన్ని గూర్చిన శాస్త్రీయ అవగాహనను పెంపొందించే ''డార్విన్‌ పరిణామవాదం వంటి పాఠాలు 10వ తరగతిలోపు ప్లిలలకు అందకుండా, సిలబస్‌ ఉండి తీసివేయడం జరిగింది. దానితో ఇంటర్‌లో బయాలజీ సబ్జెక్టు తీసుకోని విద్యార్థులు భవిష్యత్తులో పెద్ద ఇంజనీర్లయినా, ఛార్టర్‌ ఎకౌంటెంట్లయినా, గణితశాస్త్ర పార్టంగతులయినా సృష్టి, పరిణామం వంటి అంశాలకు సంబంధించినా శాస్త్రీయ వివరణలు తెలియకుండానే పెద్దవారౌతున్నారు. ఇక రెండో పక్క జ్యోతిష్యం, వాస్తుల వంటి అశాస్త్రీయ అంశాలలో డిగ్రీలు, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులు, డాక్టరేట్లు విశ్వవిద్యాలయాలలో కోట్లాది రూపాయల ప్రభుత్వ ఖర్చుతో ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. జ్యోతిష్య శాస్త్రం కాదని స్టీఫెన్‌ హాంకింగ్‌ వంటి ప్రముఖ శాస్త్రజ్ఞునితో సహా ఈ ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు వందలాది మంది బహిరంగ ప్రకటనలు చేసినా, వివేకానందుడు, దయానంద సరస్వతి, పోప్‌జాన్‌ పాల్‌ వంటి మత నాయకులు ''జ్యోతిషం ఒక మార్మిక కళ, దానిని నమ్మవద్దు'' అని హెచ్చరించినా జ్యోతిష్యం ఒక పాఠ్యాంశంగా విశ్వవిద్యాలయాల్లో రోజురోజుకూ బలంగా పాదుకుంటోంది. అలాగే వాస్తు కూడా. వాస్తు ఫలితాన్ని గూర్చి రాస్తూ పండింతులేమన్నారంటే ''పక్షేన, మాసేర, రుతుక్రమేణా, సంవత్సరేణా పిఫలం విధత్తే'' అని. అంటే వాస్తు ఫలితం ''పక్షం రోజుల్లో (అంటే 15 రోజుల్లో) గాని, నెల రోజుల్లో గాని, 6 నెలల్లో గాని, సంవత్సరంలో గాని సిద్ధిస్తుంది. ''అని అర్థం. ఎప్పుడో ఒకప్పుడు కీడు మూడుతుందని చెప్పడం శాస్త్రమా? ఫలానా వాస్తు దోషం వల్ల ఫలానా కీడు కచ్చితంగా ఫలానా కాలంలో జరుగుతందని చెప్పడం శాస్త్రమా? ఇలాంటి అశాస్త్రీయ అంశాలన్ని ''వాస్తు శాస్త్రం''గా పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టడం జాతి భవిష్యత్తుకు ఎంత కీడును కలిగిస్తుంది? పాలకులకు ఇలాంటి అశాస్త్రీయ విషయాలపైన నమ్మకముండటమే దేశానికి ప్రమాదకరం. వారు రాజ్యాంగాన్ని గౌరవించే రైతే ప్రజాశ్రేయస్సును కాంక్షించే వారైతే ఇలాంటి అశాస్త్రీయ విషయాలను నేరుగా డిగ్రీస్థాయిలో ప్రవేశపెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేయరు. దానికంటే, 1,2 కోట్లయినా సరే వెచ్చించి, కొందరు పరిశోధకులను నియమించి 5 సంవత్సరాలపాటు జ్యోతిష్య వాస్తు పండితుల జ్యోష్యాలన్నింటినీ పరిశోధించి, వాటిలో కనీసం 90శాతం సరైనవేనని తేలితే ఆ అంశాలను శాస్త్రీయ అంశాలుగా భావించి బోధించవచ్చు. (అసలు సైన్సు అంశం అంటే పరిశోధనా ఫలితాలు నూటికి నూరు సరైన, ముందుగా ఊహించిన ఫలితాలు వస్తేనే శాస్త్రీయ విషయం అంటాం) అలా కాకుండా ఏమిటీ ప్రజాధన దుర్వినియోగం? రాజ్యాంగ వ్యతిరేక భావజాల ప్రచారం?



కౌటిల్యుడు తన అర్థంశాస్త్రంలో ''రాజుకు మూఢ నమ్మకాలుండకూడదు గాని ప్రజలలో మూఢ నమ్మకాలు పెంచడానికి తీవ్రంగా యత్నించా''లంటాడు. 'దానికై రాజు గూఢచారుల ద్వారా ఏమేమి చర్యలు చేపట్టాలో'' సూచిస్తాడు. మన పాలకవర్గాలు దానిని బాగా వంట బట్టించుకుని అమలు చేస్తుండటం ప్రజలలో అశాస్త్రీయ భావాలు పెరగడానికి రెండో కారణం. కాకపోతే రాష్ట్రపతి, ముఖ్యమంత్రుల నుండి డి.జి.పిల వరకూ వివాదాస్పదులుగా, మేజిక్‌ నిపుణులుగా, భూకబ్జాదారులుగా పేరొందిన స్వామిజీలు, బాబాలకు పాదాభివందనాలు ఎందుకు చేస్తారు?



మూఢ నమ్మకాల పెంపులో పాలవర్గాలకు చెందిన ప్రచార, ప్రసార సాధనాల వాటా కూడా చాలా ఉంది. మూఢ నమ్మకాలకు సంబంధించిన వార్తలను బాక్సులు కట్టి మరీ ప్రచురించిన పత్రికలు, వాటిపై పరిశోధన చేసి వాస్తవాల్ని వివరిస్తూ రాసిన లేఖలను, వ్యాసాలను బుట్టదాఖలు చేయడం ఈ రచయిలతో సహా అనేకమంది సైన్సు ప్రచారకుల అనుభవం. ఇక టి.వి ఛానళ్లు దయ్యాలు, చేతబడులు, అతీతశక్తుల కథలతోను, వారంవారం వచ్చే జ్యోతిష్య విశేషాలతోనూ, పసివారి నుండి వృద్ధుల వరకు ప్రజల మనస్సులను ఆక్రమిస్తున్నాయి. వాటి ప్రభావం ప్రజలు తేరుకోలేకపోతున్నారు. ఇన్ని రకాల ప్రభావాల కారణంగా సైన్సులో డాక్టరేట్‌లు సంపాదించిన వారు కూడా అశాస్త్రీయ భావజాలం నుండి బయటపడలేకపోతున్నారు. అందుకే నరబలి, జంతుబలులకు కూడా పూనుకుంటున్నారు.


ఈ పరిస్థితుల్లో సైన్సు కార్యకర్తలేం చేయాలి?


సిలబస్‌లో అశాస్త్రీయ అంశాలను ఉపసంహరించి, శాస్త్రీయ అంశాలను జొప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడం, ఉద్యమించడం, దానిని సాధించడం దీర్ఘకాలిక కార్యక్రమం. అప్పటిదాకా కార్యకర్తలు ఏమి చెయ్యకుండా ఊరకుండకూడదు. అన్నంలోకి దంపుడు బియ్యం దొరకకపోతే బి విటమిన్‌ చాలక అనేక జబ్బులు వస్తాయి. అందుకని దంపుడు బియ్యం దొరికే వరకు వేచి ఉండక, రోజుకొక్క బి కాంప్లెక్స్‌ మాత్రను వేసుకుంటాం. అదేరకంగా పాలకవర్గాలలో మార్పు వచ్చేటందుకు పోరాడుతూనే, తక్షణ చర్యగా విద్యార్థులకు మూఢనమ్మకాల వెనుకనున్న అశాస్త్రీయతను వివరించి, వాటిని పోగొట్టే శాస్త్రీయ అవగాహనను విడమర్చి చెప్పాలి. శాస్త్రీయతను పెంచే పుస్తకాలు కూడా కథలు, సంఘటనలతో కూడి ఆసక్తికరంగా వస్తున్నాయి. అలాంటి పుస్తకాలను చదవమని వారిని ప్రోత్సహించాలి. ఆ పుస్తకాలు విద్యార్థుల పాలిటి బి కాంప్లెక్స్‌ మాత్రలుగా పనిచేస్తాయి. పై కార్యక్రమాన్ని సైన్సు కార్యకర్తలైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, దీక్షతో ఆచరిస్తే కనీసం భావితరాన్నైనా కాపాడుకోగలం.

Note:Article took from Prajasakti paper Written by kantharao

No comments:

Post a Comment