Thursday, 24 September 2009

మీడియా దాడి వెనుక..............!

నిప్పులేనిదే పొగరాదంటారు. అయితే , నిప్పు లేకుండానే పొగ ఎలా పుట్టించవచ్చో మీడియా రుజువు చేసింది. భారత్‌- చైనా సరిహద్దుల్లో ఎలాంటి ఘర్షణలు లేకపోయినా ఏదో జరిగిపోయిందని, యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నాయని మీడియాలో ఒక సెక్షన్‌ ఊదరగొట్టడం దీనికి పరాకాష్ట. ఈ అతిపెద్ద ఆసియన్‌ ఇరుగుపొరుగు దేశాలు రెండూ వివిధ రంగాల్లో స్నేహపూర్వక, ద్వైపాక్షిక సహకార సంబంధాలను మెరుగుపరచుకుంటూ ముందుకు సాగుతున్న తరుణంలో 'టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా' పత్రిక భారత్‌ భూభాగంలోకి చైనా చొరబడి, ఇద్దరు భారత సైనికులను గా యపరిచిందంటూ నిరాధారమైన ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ వెంటనే అదే గ్రూపు సంస్థకు చెందిన ఒక టీవీ న్యూస్‌ చానెల్‌ దానిపై కొంతమంది నిపుణులతో చర్చ నిర్వహించింది. ఆ ఛానెల్‌ను చూసి ఈ చానెల్‌, ఈ చానెల్‌ను చూసి ఇంకో చానెల్‌ ఇలా ఒకటి కొకటి పోటీ పడి అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు ఈ కట్టుకథలకు మరికొన్ని జోడించి విస్తృతంగా ప్రచారం చేశాయి. అటు ప్రింట్‌ మీడియా, ఇటు ఎలక్ట్రానిక్‌ మీడియా కూడబలుక్కున్నట్టుగా ఈ ప్రచారం సాగించాయి. ఎలాంటి ఆధారాలు చూపకుండా అనధికారిక సమాచారం పేరుతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం మీడియా నైతిక ప్రమాణాలకు విరుద్ధమని తెలిసి కూడా ఇలాంటి నీతిబాహ్యమైన ప్రచారానికి పాల్పడడం బాధ్యతా రాహిత్యమే తప్ప మరొకటి కాదు. చైనాతో గల సరిహద్దుల్లో ఎప్పటి మాదిరిగానే సామరస్యపూర్వక వాతావరణం కొనసాగుతోందని ఆర్మీ చీఫ్‌ చెప్పిన తరువాత కూడా మీడియా పదేపదే అదే పాట పాడింది. భారత్‌, చైనా ప్రభుత్వాలు రెండూ ఈ వార్త తప్పు అని స్పష్టం చేసిన తరువాత కూడా చైనా అంటే భయమా? ఈ చొరబాట్లను ఖండించరేం? అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కథనాలను మీడియా కొనసాగిస్తోంది. ఇంతవరకు జరిగింది చాలు. ఇప్పటికైనా ఈ దుష్ప్రచారాన్ని కట్టి పెట్టమని ప్రభుత్వం మొత్తుకుంటున్నా మీడియా ధోరణిలో మార్పు లేదు. దీంతో మొదట ఈ తప్పుడు వార్తను పుట్టించిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా విలేకరులిద్దరిపైన కేసు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తం ఉదంతంలో ప్రభుత్వ తప్పిదం కూడా కొంత వుంది. తన దగ్గర వున్న సమాచారాన్ని ప్రజల ముందుంచకుండా తాత్సారం చేసింది. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే.. అయితే దీనిని సాకుగా చూపి లేని చొరబాట్లను ఉన్నట్లుగా మీడియా చిత్రీకరించడం దుర్మార్గం.


మీడియా ఈ విధంగా వ్యవహరించడం వెనక ఉన్న శక్తులు ఏమిటో, వాటి ఎజెండా ఏమిటో తెలుస్తూనే ఉంది. ఆసియాలో బలమైన శక్తులుగా ఎదుగుతున్న భారత్‌, చైనాలు కలిస్తే ప్రపంచాధిపత్యానికి అర్రులు చాస్తున్న అమెరికా యత్నాలకు గండి పడుతుంది. అందుకే చైనాను ఎదగనీయకుండా చేయడానికి నానా గడ్డి కరుస్తోంది. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా చైనా మాత్రం 9 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతుండడం అమెరికాను కలవరపరుస్తోంది. అదీగాక ఆసియాలోని ఇరుగుపొరుగు దేశాలతో చైనా మంచి సామరస్య పూర్వక సంబంధాలను నెరపుతోంది. భారత్‌తో సరిహద్దు సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న కృతనిశ్చయాన్ని వ్యక్తం చేసింది. ఆ దిశగా చర్చల ప్రక్రియను కూడా వేగవంతం చేసింది. 2005లో చైనా ప్రధాని వెన్‌జియా బావో, 2006 నవంబరులో అధ్యక్షుడు జింటావో భారత్‌లో పర్యటించడం, గతేడాది జనవరిలో భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చైనాలో మూడు రోజులు పర్యటించడం, అదే సంవత్సరం ఆగస్టులో ఒలింపిక్‌ సంబరాలకు యుపిఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, విదేశాంగ మంత్రి హోదాలో ప్రణబ్‌ ముఖర్జీ హాజరవడం, వివిధ స్థాయిల్లో పరస్పర సహకారానికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటివి ఈ రెండు దేశాల మధ్య బలపడుతున్న మైత్రీ బంధానికి నిదర్శనం. అంతేకాదు భారత్‌, రష్యా,లతో కలిసి ఒక వేదికను, బ్రెజిల్‌, రష్యా, ఇండియాలను కలిపి మరో వేదికను, అయిదు ప్రధాన వర్థమాన దేశాలతో కలిపి ఇంకో వేదికను ఏర్పాటు చేయడం ద్వారా అమెరికా ఇతర సంపన్న దేశాల ఏకపక్ష ధోరణులకు చెక్‌ పెట్టేందుకు చైనా ప్రయత్నిస్తున్నది. దీంతో చైనాను దెబ్బతీస్తేగాని తమ ప్రయోజనాలు నెరవేరవని భావించిన అమెరికా ఇప్పటికే చైనాతో వాణిజ్య రంగంలో ప్రచ్ఛన్న యుద్ధానికి తెరతీసింది. ఇప్పుడు భారత్‌- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే చర్యలకు మీడియా ద్వారా ప్రయత్నిస్తోంది. గతంలో అమెరికాతో అణు ఒప్పందాన్ని ఏ మీడియా అయితే బాహాటంగా సమర్ధించిందో అదే మీడియా ఇప్పుడు భారత్‌ను చైనాకు దూరం చేసి, అమెరికాకు మరింత దగ్గరకి చేర్చాలని తహతహలాడుతోంది. సరిహద్దుల్లో లేని ఉద్రిక్తతలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న అరుణ్‌ శౌరీ వంటి ప్రబుద్ధులు, బిజెపి/ఆరెస్సెస్‌ నాయకులు, కొందరు మాజీ సైనికాధికారులు ఈ బాపతు అంతా బయటకు దేశ భక్తులుగా పోజు పెడుతూ ప్రతిదానిని కమ్యూనిస్టు వ్యతిరేక కళ్ళద్దాలలో చూస్తారు. తద్వారా అమెరికా ప్రయోజనాలను పరిరక్షిస్తుంటారు. వీరి అసలు స్వరూపమేమిటో తెహల్కా కుంభకోణంలో నగంగా బయటపడింది. ఇప్పుడు భారత్‌, చైనాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం వెనక అమెరికా ఆయుధ వ్యాపారుల ప్రయోజనాలు కూడా దాగివున్నాయి.


పాకిస్తాన్‌ను బూచిగా చూపి భారత్‌కు, భారత్‌ను శత్రువుగా చూపి పాకిస్తాన్‌కు ఆయుధాలు అమ్ముకున్న అమెరికా ఇప్పుడు చైనానుంచి భారత దేశ భద్రతకు ప్రమాదం ముంచుకొస్తోందన్న భయానక వాతావరణాన్ని సృష్టించి భారత ఆయుధాల కొనుగోళ్ల బడ్జెట్‌ను మరింత పెంచేలా ఒత్తిడి తీసుకురావాలన్ని చూస్తున్నది. అమెరికానుంచి పెద్దయెత్తున ఆయుధాలు కొనుగోలు చేసుకుంటున్న దేశంగా భారత్‌ ఇప్పటికే పేరొందింది. జిడిపి లో 7 శాతం వరకు రక్షణ వ్యయానికి భారత్‌ వెచ్చిస్తోంది. ఈ సంవత్సరం 600 కోట్ల డాలర్లను ఆయుధాల కొనుగోలుకు భారత ప్రభుత్వం వెచ్చించింది. ఆయుధాల అమ్మకాలను పెంచుకోవాలంటే ఇటువంటి ఉద్రిక్తతలు సృష్టించడం అమెరికాకు చాలా అవసరం. అదే సమయంలో చైనాను బూచిగా చూపడం ద్వారా భారత్‌ అమెరికా వ్యూహాత్మకమైత్రి సరైనదేనన్న భావన కలిగించాలని చూస్తోంది. భారత ప్రజలు దీనినంతటినీ గమనిస్తున్నారు. గనుక మీడియా ఇప్పటికైనా ఇటువంటి కట్టుకథలకు స్వస్తి చెప్పి తమ మధ్య సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న భారత్‌, చైనా ప్రభుత్వాల సంకల్పానికి చేతనైతే సహకరించాలి. అంతేకానీ, ఇటువంటి అసత్య ప్రచారంతో వాతావరణం కలుషితం చేయొద్దు.

No comments:

Post a Comment