ఫైనాన్స్ రంగంలో ఎలాంటి సంస్కరణలు ప్రవేశపెట్టాలో సిఫార్సు చేసేందుకు ప్రభుత్వం రఘురాం రాజన్ కమిటీని, పెర్సీ మిస్ట్రీ కమిటీని నియమించింది. ఫైనాన్స్‌రగంలో తలపెట్టే మార్పులకు చొరవ తీసుకోవలసింది రిజర్వుబ్యాంకు. కాని ఇక్కడ ప్రభుత్వమే అలాంటి కమిటీలను నియమించింది. ఈ కమిటీ నేతలు, సభ్యులు అంతా ప్రపంచ బ్యాంకు ఆదేశిత సరళీకృత ఆర్ధిక విధానాలకు నమ్మిన బంటు లాంటి వారు. అందుచేతనే రూపాయి మారకం రేటు తీవ్రమైన ఆటుపోట్లకు గురికాకుండా రిజర్వు బ్యాంకు తీసుకునే చర్యలు స్వేచ్ఛామార్కెట్ విధానాలకు విరుద్ధమైనవన్న విమర్శలతోనే రఘురాం రాజన్ కమిటీ సిఫార్సులు మొదలయ్యాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రాధాన్యతా రంగాలకు ఇచ్చే రుణాలను రఘురాం కమిటీ తీవ్రంగా విమర్శించింది. గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు అసమర్ధమైనవని,వాటి స్థానంలో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల తరహాలో నడిచే లోకల్ ఏరియా బ్యాంకులను ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులను, దేశ విదేశీ ప్రైవేటు రంగ బ్యాంకులను సమాన స్థాయిలో పోటీ పడే అవకాశం కల్పించాలనే పేరుతో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాలను విక్రయించాలని కూడ సిఫార్సు చేసింది.
భారత ప్రభుత్వరంగ బ్యాంకుల పెట్టుబడి పునాది పెంపుకోసం 200కోట్ల డాలర్ల రుణాన్ని అందిస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు మంగళవారం నాడు అధికారికంగా ప్రకటించింది. దీనితో ఇప్పటిదాకా చర్చల దశలోనే ఉన్నాయని భావిస్తున్న వివాదాస్పద రుణ ప్రతిపాదనలు వాస్తవ రూపం దాల్చినట్లయింది. ఈ రుణానికి సంబంధించిన వివరాలను కూడ ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ఈ ఒక్కటే కాకుండా ఇప్పుడు ప్రపంచ బ్యాంకు మొత్తం 430కోట్ల డాలర్లమేర నాలుగు రుణాలను భారత దేశానికి అందిస్తున్నది. బ్యాంకులతో పాటు, మౌలిక సదుపాయాల కల్పనను మెరుగు పరిచేందుకు వీటిని ప్రపంచ బ్యాంకు మంజూరు చేసింది. నిజానికి ఇది 2012 లోగా భారత దేశానికి ఇవ్వతలపెట్టిన 1400కోట్ల డాలర్ల భారీ రుణంలో ఒక భాగం మాత్రమే. ప్రస్తుత నాలుగు రుణాలు పారిశ్రామిక సంస్థలు అధిక రుణాలు పొందేలా చేయడం ద్వారాను, మౌలిక సదుపాయరంగంలో పెట్టుబడులు పెంచడం ద్వారాను భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఉపయోగపడతాయని ఈ రుణాల వివరాలను ప్రకటిస్తూ ప్రపంచ బ్యాంకు భారత దేశ డైరెక్టరు రాబర్టో జాఘా చెప్పారు. ప్రపంచ ఆర్థిక వాతావరణంలో ఏర్పడిన ప్రతికూల పరిణామాలను తట్టుకోవడానికి భారత ప్రభుత్వం విస్తృతమైన ఆర్థిక ఉద్దీపన చర్యల ద్వారా త్వరితంగా కదిలిందని ఈ రుణాల గురించి వివరిస్తూ విడుదల చేసిన ప్రకటనలో ప్రపంచబ్యాంకు ప్రశంసించింది. ఈ ఉద్దీపన పథకంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు మద్దతు అందించడం ఒక ప్రధానాంశం అని పేర్కొంది. అనేక సంపన్న దేశాలలోను, త్వరితంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలోను బ్యాంకుల రుణవితరణకు పెట్టుబడుల కొరత వల్ల ఆటంకం కలిగిందని, అలాంటి ఆటంకం భారత దేశం విషయంలో కలగరాదనే ఉద్దేశంతోనే ఈ రుణాన్ని అందిస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు చెప్పింది. 2009-11 మధ్య కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకుల పెట్టుబడి పునాది పెంచడానికి మొత్తం 480కోట్ల డాలర్లు అవసరమవుతాయని భారత ప్రభుత్వ అంచనాఅని తెలిపిన ప్రపంచ బ్యాంకు, భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఇప్పుడు తాను ఈ 200కోట్ల డాలర్ల రుణాన్ని అందిస్తున్నట్లు చెప్పింది. ఇంకో ఏడాదిలో మరో వందకోట్ల డాలర్ల రుణం అందుతుందని కూడ తెలిపింది. ప్రపంచ బ్యాంకు రుణం కాబట్టి షరతులు ఏమిటి అన్న సందేహం సహజంగానే కలుగుతుంది. ఇది అభివృద్ధి విధాన రుణం (డిపిఎల్) అని, భారత ప్రభుత్వానికి బడ్జెట్ మద్దతు రూపంలో అందిస్తున్నానని, దాన్ని ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకుల పెట్టుబడుల పెంపుకు ఉపయోగిస్తున్నదని-అందుచేత ఈ రుణం మూలంగా ప్రభుత్వరంగ బ్యాంకులు ఎలాంటి షరతులు అమలుచేయనవసరం లేదని ప్రపంచ బ్యాంకు చెప్పింది.
అయితే భారత ప్రభుత్వం తగువిధమైన స్థూల ఆర్థిక విధానాలను అనుసరించాల్సి ఉంటుందని, ఆర్థికాభివృద్ధి, పేదరిక నిర్మూలనకు సంబంధించిన సమర్ధవంతమైన మధ్యకాలిక విధానాన్ని అనుసరించాలని తెలిపింది. సంతృప్తికరమైన ప్రభుత్వ ద్రవ్య నిర్వహణ పద్ధతులను అనుసరించాలని కూడ చెప్పింది. ఇలాంటి చర్యలను డిపిఎల్ రుణం తీసుకున్న ప్రతిదేశం చేపట్టాల్సి ఉంటుందని, దీనిలో భారత దేశానికని ప్రత్యేకంగా ఏమీ లేవని పేర్కొంది. బ్యాంకులు అమలుచేసినా, ప్రభుత్వం అమలుచేసినా ఈ రుణం షరతులేమీ లేనిది కాదని స్పష్టమవుతుంది. నిజానికి ప్రభుత్వమే తాను నేరుగా అమలుచేయడానికి జంకుతున్న అనేక ఫైనాన్స్ రంగ సంస్కరణలను ఈ రూపంలో తీసుకు రావడానికి ప్రపంచ బ్యాంకు రుణాన్ని వినియోగిం చుకుంటోందన్న అనుమానం కలుగుతుంది. ఫైనాన్స్ రంగంలో ఎలాంటి సంస్కరణలు ప్రవేశపెట్టాలో సిఫార్సు చేసేందుకు ప్రభుత్వం రఘురాం రాజన్ కమిటీని, పెర్సీ మిస్ట్రీ కమిటీని నియ మించింది. ఫైనాన్స్‌రగంలో తలపెట్టే మార్పులకుచొరవ తీసుకో వలసింది రిజర్వుబ్యాంకు. కాని ఇక్కడ ప్రభుత్వమే అలాంటి కమిటీలను నియమించింది. ఈ కమిటీ నేతలు, సభ్యులు అంతా ప్రపంచ బ్యాంకు ఆదేశిత సరళీకృత ఆర్ధిక విధానాలకు నమ్మిన బంటు లాంటి వారు. అందుచేతనే రూపాయి మారకం రేటు తీవ్రమైన ఆటుపోట్లకు గురికాకుండా రిజర్వు బ్యాంకు తీసుకునే చర్యలు స్వేచ్ఛామార్కెట్ విధానాలకు విరుద్ధమైనవన్న విమర్శలతోనే రఘురాం రాజన్ కమిటీ సిఫార్సులు మొదలయ్యాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రాధాన్యతా రంగాలకు ఇచ్చే రుణాలను రఘురాం కమిటీ తీవ్రంగా విమర్శించింది. గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు అసమర్ధమైనవని, వాటి స్థానంలో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల తరహాలో నడిచే లోకల్ ఏరియా బ్యాంకులను ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులను, దేశ విదేశీ ప్రైవేటు రంగ బ్యాంకులను సమాన స్థాయిలో పోటీ పడే అవకాశం కల్పించాలనే పేరుతో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాలను విక్రయించాలని కూడ సిఫార్సు చేసింది. ఈ రకమైన సిఫార్సులను ప్రభుత్వం నేరుగా అమలుచేయడానికి సాహసించలేదు. ప్రత్యేకించి యుపిఏ-1 హయాంలో వామపక్షాల భయంతో ఆ పనికి పూనుకోలేదు. ఇప్పుడు కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అన్న రీతిలో ప్రపంచ బ్యాంకు రుణానికి పాల్పడింది.
ప్రభుత్వరంగ బ్యాంకులలో పెట్టుబడుల పునాదిని పెంచాల్సిన అవసరం ఇప్పుడు ఎంత మాత్రం లేదు. బేసెల్-2 నిబంధనల ప్రకారం పెట్టుబడి సమృద్ధి (క్యాపిటల్ ఎడికెసీ) నిష్పత్తి 9 శాతం ఉండాలి. కాని మన బ్యాంకుల్లో అది 12 శాతానికి మించి ఉంది. ఇంకా కచ్చితంగా చెప్పుకోవాలంటే క్యాపిటల్ ఎడికెసీ నిష్పత్తి 2007 మార్చి నాటికి 12.3 శాతం, 2008 మార్చి నాటికి 13 శాతం ఉండగా, 2009 మార్చి నాటికి మరింతగా పెరిగి 13.2 శాతానికి చేరుకుంది. ఈ నిష్పత్తి కేవలం ఒక పాత తరహా ప్రైవేటు బ్యాంకులో 9 శాతం, ఒక విదేశీ బ్యాంకులో 10 శాతం ఉంది. మిగతా అన్ని బ్యాంకుల్లోను ఇది అంత కన్నా ఎక్కువగానే ఉంది. ప్రభుత్వరంగ బ్యాంకులను విడిగా తీసుకున్నపుడు 2008 మార్చినాటికి క్యాపిటల్ ఎడికేసీ రేషియో 12.5 శాతంగా ఉంది. ఒక వైపున ప్రపంచ ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతున్న సమయంలో భారత ప్రభుత్వ రంగ బ్యాంకుల పెట్టుబడి పునాది పెరుగుతూ ఉండటాన్ని గమనిస్తాము. అందుచేత ప్రపంచ బ్యాంకు చెబుతున్నట్లు ప్రపంచ ఆర్ధిక సంక్షోభం పర్యవసానాలను తట్టుకోవడానికి అవసరమైన రుణాలు అందించే సామర్ధ్యాన్ని బ్యాంకులకు కల్గించేందుకు ఇలాంటి రుణం అవసరమని ఎంత మాత్రం భావించజాలం.పెట్టుబడి పునాదిని పెంచడం నిజంగానే ఒక సమస్య అయినా, దానిని సమకూర్చుకోవడానికి ప్రపంచబ్యాంకు రుణం పరిష్కారం కాదు. ఈ విషయంలో చైనాను ఆదర్శంగా తీసుకోవచ్చు. చైనా తన మూడు అతి పెద్ద బ్యాంకులకు పెట్టుబడి పునాదిని విశిష్టమైన రీతిలో పెంచుకున్నది. ఇండిస్టియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, ది బ్యాంక్ ఆఫ్ చైనా, చైనా కన్‌స్ట్రక్షన్ బ్యాంక్‌ల పెట్టుబడులను ఒకే దఫాగా పెంచేసింది. ఇటీవలనే 2008 నవంబరులో అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా పెట్టుబడిని కూడ పెంచింది. దీనికోసం కాస్త కూస్తో కాదు 40 బిలియన్ డాలర్లను వెచ్చించింది. ఇదంతా దానికి ఎక్కడి నుండి వచ్చింది అని ఆశ్చర్యం కలగవచ్చు. తన అపారమైన విదేశీ మారక నిల్వలనుండి కావలసిన మొత్తాన్ని కేటాయించింది. ప్రభుత్వరంగ ఆధ్వర్యంలోనే సెంట్రల్ హుజిన్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ అనే దానిని ఏర్పాటు చేసి వాణిజ్య బ్యాంకుల్లో ఈక్విటీ పెట్టుబడులను కలిగి ఉండే అధికారాన్ని కల్పించింది. అవసరమైన మొత్తంలో విదేశీ మారక నిల్వలను ఈ ప్రభుత్వరంగ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థకు బదలాయించింది. ఫలితంగా బ్యాంకులు తమ ఈక్విటీని ఈ సంస్థకు విక్రయించడం ద్వారా అవసరమైన పెట్టుబడులు పొందాయి. బదిలీ అయిన ఈక్విటీ ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలోనే ఉంది కాబట్టి బ్యాంకులపై ప్రభుత్వ ఆధీనానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. చైనా ప్రభుత్వం నాలుగు వేలకోట్ల డాలర్ల భారీ మొత్తాన్ని బ్యాంకులపై తన ఆధిపత్యానికి ఎలాంటి భంగం కలగని రీతిలో సమకూర్చుకుంటే, భారత ప్రభుత్వం కేవలం 300కోట్ల డాలర్ల కోసం (అది కూడ రెండు దఫాలుగా) ప్రపంచ బ్యాంకును దేబిరించింది. చైనా మాదిరి వ్యవహరించడానికి మనకూ అవకాశాలు దండిగా ఉన్నాయి. మన వద్ద ఉన్న 26వేల 500కోట్ల బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వల్లో ఈ 300కోట్ల డాలర్లు ఒక మొత్తమే కాదు. అయినా భారత ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నదంటే దాని ఉద్దేశాల పట్ల కచ్చితంగా సందేహం కలుగుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ స్వతంత్రంగా నిలబడటానికి వెన్నుదన్నుగా నిలిచిన ప్రభుత్వరంగ బ్యాంకులను దెబ్బతీయడానికి మాత్రమే ఈ చర్య దోహదపడుతుంది.
No comments:
Post a Comment