మేధో సంపత్తి హక్కుల వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. గతంలో సమర్పించిన నివేదికనే కమిటీ 2009 ఏప్రిల్‌లో తిరిగి సమర్పించింది. పార్లమెంటు సమావేశాలు వాయిదా పడిన తరుణంలో దీనిని సమర్పించడంలో ఉద్దేశం దేశంలో ప్రజలచే ఎన్నుకోబడిన అత్యున్నత పార్లమెంటు పరిశీలన నుంచి తప్పించుకోవడమేనని స్పష్టమవుతోంది. దీనిని ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించరాదు.
ప్రపంచ వాణిజ్య సంస్ధ (డబ్ల్యుటిఓ) ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందంపై పద్నాలుగేళ్ళ క్రితం భారతదేశం సంతకం చేసింది. దానిపైనే కాకుండా దానికి అనుబంధంగావున్న పలు ఒప్పందాలపై కూడా సంతకాలు చేసింది. ఇలాంటి వాటిల్లో వాణిజ్య సంబంధింత మేధో సంపత్తి హక్కుల (ట్రిప్స్) ఒప్పందం ఒకటి. ట్రిప్స్ ఒప్పందం 'మేధో సంపదకు' రక్షణ కల్పిస్తుంది. అంటే, మనకున్న సరికొత్త ఆలోచనలు నూతన సృష్టికి దారితీసినట్లయితే పేటెంట్లు, కాఫీరైట్స్, ట్రేడ్‌మార్క్ తదితరాల ద్వారా దానిపై యాజమాన్యం లభిస్తుంది. ఈ సందర్భంగా ఒక సంగతి గుర్తు చేసుకోవలసి ఉన్నది. అదేమంటే, డబ్ల్యుటిఓ పరిధిలోకి ట్రిప్స్‌ను తీసుకు రాకూడదంటూ ఉరుగ్వే దఫా గాట్ చర్చలలో భారత్ సహా పలు వర్ధమాన దేశాలు ఉద్ఘాటించాయి. ఈ సందర్భంగా అమెరికా, ఐరోపా, జపాన్‌ల నుంచి ఈ దేశాలు తీవ్ర ఒత్తిడినే ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రపంచంలోని అన్ని దేశాలు తమ చట్టాలలో మేధో సంపద హక్కుల అంశాన్ని చేర్చాలంటూ అమెరికా తదితర దేశాలు పట్టుపట్టాయి. తమకున్న ప్రయోజనాల రీత్యా ఈ అంశాన్ని బడా ఔషధ కంపెనీలు, సాప్ట్‌వేర్ కంపెనీలు దీన్నొక యుద్ధంగా మార్చివేశాయి. అసమానుల మధ్య జరిగిన ఈ యుద్ధంలో వర్ధమాన దేశాలు పరాజయం పాలుకాగా, ట్రిప్స్ వాస్తవ రూపం దాల్చింది. ఇతర వర్ధమాన దేశాలు భారత్‌ను విడిచిపెట్టటంతో సంతకాలు చేయక తప్పలేదని మన ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించింది. మన దేశం చర్చలలో సరిగ్గా పాల్గొన్నదా లేదా అన్న విషయాన్ని చర్చించటానికి ఇది సమయం కాదు. అయితే ట్రిప్స్ ఒప్పందం జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమంటూ భారతప్రభుత్వం తన వైఖరిని ప్రకటనల రూపంలో వెల్లడించింది.
పేటెంటు ఉత్తర్వు-2004
ఒక్కసారి 2004 ప్రథమ పాదానికి వెళ్దాము. ఆనాటి బిజెపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 1970ల నాటి పేటెంబ్ చట్టానికి సవరణలను ఖరారు చేసింది. ఒకసారిగాని ట్రిప్స్ ఒప్పందంపై సంతకం చేస్తే దేశీయంగా వున్న పేటెంట్ చట్టాన్ని సవరించి తీరాల్సిందే. ఇందుకుగాను భారత్‌వంటి వర్ధమాన దేశాలకు పదేళ్ళ గడువు ఇచ్చారు. అంటే 2005 జనవరి నాటికి పేటెంటు చట్టాన్ని సవరించాలన్న మాట. ట్రిప్స్ ఒప్పందం ప్రధానంగా ఔషధ, సాఫ్ట్‌వేర్ రంగాలను దెబ్బతీసేదిగా ఉన్నది. 1970 నాటి భారతీయ పేటెంటు చట్టం ప్రకారం పేటెంటు పరిధిలోకి ఔషధాలు రావు. కాని ఇప్పుడు ట్రిప్స్ ఒప్పందాన్ని అనుసరించి ఔషధాలకు కూడా పేటెంటు వర్తిస్తుంది. ఈ ఒప్పందంలో కొన్ని వెసులుబాట్లున్నాయి. పేటెంటు హక్కు కల్పిస్తున్నప్పటికీ ఔషధాలను అందరికీ అందుబాటులో ఉంచే అవకాశం ఉన్నది. 2004 నాటికి ఎన్డీయే ప్రభుత్వం ముందున్న పరిస్థితి ఇది. కాని ఈ మేరకు ఎన్డీయే తయారు చేసిన ముసాయిదా ఎందుకూ పనికి రాలేదు. అదృష్టవశాత్తు 2004 ఎన్నికలలో ఎన్డీయే ఓడిపోయింది. దానితో ఈ సవరణలు పార్లమెంటులో చర్చకు రాలేదు.
2004 డిసెంబరు 26న భారతదేశం సునామీ ప్రమాదంలో చిక్కుకున్నది. వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సమయంలోనే యుపిఏ ప్రభుత్వం భారతీయ పేటెంటు చట్టానికి ఉత్తర్వు రూపంలో సవరణలను ముందుకు తీసుకువచ్చింది. ఈ ఉత్తర్వు మునుపటి ఎన్డీయే దారిలోనే ఉన్నది. పార్లమెంటులో ఎలాంటి చర్చకూ అవకాశం ఇవ్వకుండానే దీనిని ఆమోదించాలని ప్రభుత్వం ప్రయత్నించింది. ఇది తాను తయారు చేసిన ముసాయిదాయే కనుక ఎన్డీయే కూడా దీనికి సుముఖంగానే ఉన్నది. 2004 నాటి పేటెంట్ సవరణ ఉత్తర్వు తీవ్ర విమర్శలనే ఎదుర్కొన్నది. ఈ సవరణలు అమలులోకి వస్తే లక్షలాది భారతీయులకు కొత్తరకాల మందులు అందకుండా పోతాయి. కనుకనే ఈ సవరణలకు వ్యతిరేకంగా అనేక సంస్ధలు ఆందోళనకు దిగాయి. ఒక్క భారతదేశంలోనే కాక ప్రపంచమంతటా వివిధ సంస్ధల ఆధ్వర్యంలో ప్రదర్శనలు సాగాయి. అంతేకాక, సవరించిన భారతీయ చట్టం అమలైతే భారతీయ కంపెనీలు చౌక ధరలకు మందులను అమ్మలేవు. ప్రస్తుతం ఆసియా, ఆఫ్రికా దేశాలలో ఈ మందులు అమ్ముడవుతున్నాయి. మార్క్సిస్టు పార్టీ నేతృత్వంలో వామపక్షాలు కూడా గొంతు కలపటంతో ఈ ఉద్యమానికి మరింత వూపు వచ్చింది.
ఎన్డీయే మద్దతు ఉండటంతో యుపిఏ ప్రభుత్వంలో ఎలాంటి చలనమూ లేకుండా పోయింది. ప్రభుత్వాన్ని కలవరపరిచే ఉద్దేశంతో పార్లమెంటులో ఈ ఉత్తర్వును వ్యతిరేకించాలని 2005 మార్చిలో బిజెపీ నిర్ణయించటంతో యుపిఏలో కదలిక వచ్చింది (2004లో తన ప్రభుత్వం తయారు చేసిన సవరణలనే వ్యతిరేకించాలని బిజెపీ నిర్ణయించింది!). పార్లమెంటులో ఓటమిని తప్పించుకునేందుకై యుపిఏ ప్రభుత్వం విధిలేక వామపక్షాలతో చర్చలకు అంగీకరించింది. మొత్తంమీద వామపక్షాలు, ఇతర బృందాలు చేసిన ప్రతిపాదనలు సవరణలలో చోటుచేసుకున్నాయి. రెండు అంశాలపై మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదు. ఇందులో ఒకటేమంటే, కొత్తగా కనిపెట్టిన రసాయన మూలకాలకే పేటెంట్లు వర్తించేలా వాటిపై ఆంక్షలు విధించాలనడం. సూక్ష్మాంగాలపై పేటెంట్లు లేకుండా చేయాలన్నది మరొకటి. ఈ ప్రతిపాదనలను నిపుణుల బృంద పరిశీలనకు పంపుతానని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ విధంగా పార్లమెంటులో భారతీయ పేటెంటు చట్టం ఆమోదం పొందింది.
మషేల్కర్ కమిటీ
అనుకున్నట్లుగానే ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. దీనిని పేటెంటు చట్టంపై సాంకేతిక నిపుణుల బృందం (టిఇజి) అని పిలిచారు. డాక్టర్ ఆర్.జి. మషేల్కర్ ఈ కమిటీకి నేతృత్వం వహించారు. సిఎస్‌ఐఆర్ మాజీ డైరక్టర్‌గా ఈయన పనిచేశాడు. కార్పొరేట్ ప్రసారమాధ్యమంలో ఒక భాగం ఈయనపట్ల సానుభూతితో ఉన్నది. దేశంలోని అత్యున్నత శాస్త్రీయ సంస్ధలను ఆధునికీకరించాడన్న పేరు ఆయనకు ఉన్నది. ఈయన హయాంలోనే సిఎస్‌ఐఆర్ కార్పొరేట్ సంస్ధగా మారిందని చెప్తారు. భారతీయ శాస్త్రానికీ, భారతీయులకూ పేటెంట్లు ఉపయోగపడగలవన్న అభిప్రాయంతో ఆయన ఉన్నారు. ఆయనను ఎంపిక చేసుకోవటంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ఉద్దేశాలు లేకపోలేదు. డాక్టర్ మషేల్కర్ అయితే భారతీయ పేటెంటు చట్టం అవసరం లేదనటానికి తగిన ఆధారాలు చూపగలడని, వాస్తవంలో రబ్బరు స్టాంపులా పనిచేస్తాడని ప్రభుత్వం భావించింది. 2006 డిసెంబరులో ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. సవరణలు అవసరం లేదని ఈ నివేదిక పేర్కొన్నది. కొన్ని రోజుల తరువాత ఈ నివేదికను విడుదల చేశారు. లండన్‌కు చెందిన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇన్‌స్టిట్యూట్ ఈ కమిటీకి సమర్పించిన పత్రమే ఎలాంటి మార్పులేకుండా కమిటీ నివేదికగా వెలువడినట్లు వెల్లడైంది. ఈ కమిటీకి అస్త్రా జెనెకా, గ్లాక్సో స్మిత్ క్లిన్ తదితర బహుళజాతి సంస్ధలు పెద్దయెత్తున విరాళాలు ఇచ్చాయి. దీనినిబట్టి కూడా ఈ కమిటీ స్వభావం అర్థమవుతున్నది. 'అనుకోకుండా సాంకేతిక అవకతవకలు' నివేదికలో చోటు చేసుకున్నాయంటూ డాక్టర్ మషేల్కర్ స్వయంగా అంగీకరించాడు.
ప్రజలలో ఆందోళన పెరగటంతో కమిటీ అధ్యక్ష పదవికి మషేల్కర్ రాజీనామా చేశారు. కమిటీ తన నివేదికను వెనక్కు తీసుకున్నది. వాణిజ్య మంత్రిత్వ శాఖ మాత్రం తన వెబ్‌సైట్‌లో పాతచ నివేదికనే ప్రదర్శిస్తున్నది. ప్రభుత్వం మాత్రం దీని గురించి ఏమీ మాట్లాడటం లేదు. కమిటీ మరలా గత ఏప్రిల్‌లో మరో నివేదిక సమర్పించినట్లు ప్రకటన వెలువడింది. అయితే ఈ కొత్త నివేదికలో పెద్దగా మార్పులేమీ లేవని తెలుస్తున్నది. పేటెంటు చట్టాలలో నిపుణునిగా పేర్గాంచిన ప్రొఫెసర్ కార్లొస్ కోరియా చెప్పిన దానిని సందర్భశుద్ధి లేకుండా ఈ నివేదికలో చాలా ఎక్కువగా ఉటంకించడం జరిగింది. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత నివేదికను సమర్సించడం జరిగింది. అంటే పార్లమెంటును తప్పించుకోవాలని ప్రభుత్వం చూస్తున్నదన్నమాట. ఏదియేమైనా తిరిగి సమర్పించిన ఈ నివేదికను పార్లమెంటులో చర్చకు పెట్టాలి. అప్పుడే పార్లమెంటుకు తగిన గౌరవమిచ్చినట్లవుతుంది.
No comments:
Post a Comment