Thursday, 24 September 2009

ఎవరి కోసం ఈ యుద్ధోన్మాదం ?

ప్రభుత్వ నిధులను భోంచేస్తూ, మాజీ ఉన్నతాధికారుల సారథ్యంలో నడుస్తున్న సంస్థలు కూడా ఈ రకమైన ఉన్మాదాన్ని రెచ్చగొట్టటంలో తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. ఎంత విచారకరం! ఇటీవల సర్కారీ సంస్ధ ఒకటి తను నడిపే పత్రికలో అరుణ్‌శౌరి వ్యాసాన్నొకదానిని ప్రచురించింది. చైనాను శత్రువుగా తప్ప మరో రకంగా చూసే గుణమే ఈయనకు లేదు. ఉద్యోగ విరమణ చేసిన సైనికాధిóకారులు కొందరు ఈ మేధావుల సరసన చేరి ప్రసారమాధ్యమాన్ని వేదికగా చేసుకుని ప్రస్తుత దుష్ప్రచారానికి మహోత్సాహంతో తోడ్పడుతున్నారు.

1913లో ఎవరు లాభపడతారు? అన్న శీర్షికన వ్లదిమీర్‌ లెనిన్‌ సుప్రసిద్ధ వ్యాసాన్ని ప్రావ్దా పత్రిక ప్రచురించింది. ''నిర్దిష్టమైన ప్రతిపాదనల్ని, చర్యల్ని, ఇతరత్రా అంశాలను ఏ రాజకీయ లేదా సామాజిక బృందాలు, శక్తులు లేదా కూటములు ముందుకు తెస్తున్నాయో వెనువెంటనే బహిర్గతం కానప్పుడు, ఎవరైనాగాని వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే, లాభం పొందేదెవరు? అన్నదే.......ఒకానొక ప్రత్యేకత కలిగిన అభిప్రాయాలను ఎవరు నేరుగా వ్యక్తం చేశారా అన్నది ముఖ్యం కాదు. ఈ అభిప్రాయాలు, ప్రతిపాదనలు, చర్యల ద్వారా ఎవరు లాభపడతారన్నదే' ప్రధానం'. భారత్‌, చైనా సంబంధాల గురించి ఇటీవలి కాలంలో రకరకాల కట్టుకథలు ప్రచారంలోకి వచ్చాయి. యుద్ధోన్మాదాన్నీ, పొరుగు దేశంపట్ల విద్వేషాన్నీ రెచ్చగొట్టటమే ఈ ప్రచారోద్దేశం. ఇలాంటి విపరీత ప్రచారం ద్వారా భారత్‌కుగానీ, చైనాకుగానీ ఒరిగేదేవిూ ఉండదనేది స్పష్టం. ఏమాత్రం స్థిరత్వంలేని ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో అభివృద్ధి, పెరుగుదలకు సంబంధించి తమవైన మార్గాలలో ఆసియాలోని ఈ రెండు దేశాలు ముందుకు సాగిపోతున్నాయి. అంతేగాక, ఇటు భారత్‌గానీ లేదా అటు చైనా గానీ తాము ఎంపిక చేసుకున్న జాతీయ అభివృద్ధి విధానాల నుంచి వైదొలగలేదు. యుద్ధమే సంభవిస్తే ఉభయ దేశాల కీలక ప్రయోజనాలకు ఎనలేని నష్టం వాటిల్లుతుంది. అయినప్పటికీ మన కార్పొరేట్‌ ప్రసారమాధ్యమం అలుపూసలుపూ లేకుండా యుద్ధభేరీలను మోగిస్తూనే ఉన్నది. యుద్ధం తథ్యం అంటూ అనేక కట్టుకథలను ప్రచారంలో పెడుతున్నది.


ఇలాంటి బాధ్యతారహితమైన ప్రవర్తనకు కేవలం ప్రసార మాధ్యమానికి చెందిన వారినే నిందించాల్సిన అవసరం లేదు. ప్రేతాత్మలను ఆవాహన చేయడంలోనూ, సైతానును స్మరించడంలోనూ వారికున్న శక్తియుక్తులు మనకు తెలుసు. వారు క్షణికమైన ఊహా ప్రపంచంలో విహరిస్తున్నారు. తమ ఉనికిని కాపాడుకునేందుకు వారి భాండాగారంలో జనులను ఆకర్షించే రకరకాల కుయుక్తులు ఉన్నాయి. ప్రభుత్వ నిధులను భోంచేస్తూ, మాజీ ఉన్నతాధికారుల సారథ్యంలో నడుస్తున్న సంస్థలు కూడా ఈ రకమైన ఉన్మాదాన్ని రెచ్చగొట్టటంలో తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. ఎంత విచారకరం! ఇటీవల సర్కారీ సంస్ధ ఒకటి తను నడిపే పత్రికలో అరుణ్‌శౌరి వ్యాసాన్నొకదానిని ప్రచురించింది. చైనాను శత్రువుగా తప్ప మరో రకంగా చూసే గుణమే ఈయనకు లేదు. ఉద్యోగ విరమణ చేసిన సైనికాధిóకారులు కొందరు ఈ మేధావుల సరసన చేరి ప్రసారమాధ్యమాన్ని వేదికగా చేసుకుని ప్రస్తుత దుష్ప్రచారానికి మహోత్సాహంతో తోడ్పడుతున్నారు. కనుక, మన జాతీయ భద్రతా సలహాదారు వలె బాధ్యతనంతా ప్రసారమాధ్యమంపై నెట్టివేయకుండా మరింత లోతుగా ఈ విషయాన్ని పరిశీలిద్దాము. ప్రభుత్వం కూడా తన ఇంటిని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. కాస్త వివరంగా చెప్పుకోవాలంటే మూడు తరహాలకు చెందినవారు యుద్ధోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. విదేశాంగ, రక్షణ విధానాలకు సంబంధించిన పాత ముఖాలను గుర్తుపట్టటం కష్టమేమీ కాదు. వీరు మొదటి కోవకు చెందుతారు. చైనా ప్రమాదం అంతకంతకూ పెరుగుతుందన్న వీరి నమ్మకం తిరుగులేనిది. ఇలాంటి పరిస్థితిలో అమెరికావైపు చేరడం మినహా భారత్‌కు మరో మార్గాంతరం లేదన్నది వీరి వాదన. దేశంలోనూ, విదేశాలలోనూ భారత ప్రభుత్వ అధికారులుగా వివిధ స్ధాయిలలో పనిచేసిన వీరు మేధావులు, ఆధునికులు, స్పష్టతగలిగిన వారు. చైనాకు వ్యతిరేకంగా ''టిబెట్‌ తురుపుముక్క''ను భారత్‌ ఉపయోగించాలన్న వారి వాదన సహజంగానే ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఇలా చెప్పేవారు తమను తాము 'వాస్తవిక వాదులమని' చెప్పుకుంటారు. కాని టిబెట్‌ విషయాన్ని చూపి చైనాపై ఒత్తిడి తీసుకురాగలమని భావించటం అమాయకత్వమే అవుతుంది. ఒకవేళ చైనా కూడా ఇదేతరహాలో చిల్లరమల్లర తురుపు ముక్కలను ఉపయోగిస్తే అప్పుడు ఈ ఆట కాస్తా వికటిస్తుంది. టిబెట్‌ కల్లోలం మొదలైన గత రెండు సంవత్సరాలలో వెలువడిన పది పన్నెండు వ్యాసాలకు సమాధానంగా వచ్చిన భారత్‌ 'విచ్ఛిన్నం' అన్న చైనీయుని వ్యాసం ఎంత గందరగోళాన్ని సృష్టించిందీ మనకు తెలుసు.


రెండవ విషయం మరొకటి ఉన్నది. పౌర నాయకత్వం చైనా ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేస్తున్నదని, ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు మన సైనిక బలగాలకు పెద్దయెత్తున ఆర్థిక, భౌతిక వనరులను అందుబాటులో ఉంచాలంటూ సైనికాధికారులుగా ఉద్యోగ విరమణ చేసిన కొంతమంది ఉత్సాహపరులు చెప్తున్నారు. మొత్తం సైనిక దళాలన్నీ కార్పొరేట్‌ ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. భారతదేశం విషయానికివస్తే జిడిపీలో 7 శాతం రక్షణ బడ్జెట్‌కు పోతున్నది. తిండికీ, తుపాకీకి మధ్య వనరుల పంపకంపై ప్రాచీన కాలం నుంచీ వివాదం సాగుతున్నది. అయినా రక్షణ బడ్జెట్‌ అతిగా ఉంటున్నదని భారతీయులు ఏనాడూ ఆక్షేపించలేదు. అమెరికా నుంచి ఆయుధాలు కొనాలంటూ సైనికదళాలలో ప్రచారం సాగటం కలవరపరిచే విషయం. ఇలాంటి పరిస్థితిలో అమెరికన్‌ ఆయుధ బేహారులు ఈ దేశంలోని తమ ఖాతాదారులపై మత్తుమందు చల్లటంలో వింతేమున్నది? మూడవదేమంటే, మనకు మితవాద హిందూత్వ జాతీయవాదులున్నారు. జాతీయ భద్రతకు తమను తాము సంరక్షకులుగా ప్రకటించుకునే ఈ బాపతు భారతదేశం అగ్రరాజ్యంగా ఎదగకపోవడానికి చైనానే అడ్డుపడుతోందని వాదిస్తారు. ప్రపంచ రాజకీయాలలో అగ్రరాజ్యాధిపత్యం అంతరించి పోయిందన్న స్పృహ వీరిలో బొత్తిగా కొరవడింది. వీరు ఎప్పుడూ రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతుంటారు. ఇదొక సమస్య. గత ఏడాది ఆరెస్సెస్‌తో చైనా ఒక అవగాహనకు వచ్చింది. ఆరెస్సెస్‌కు చెందిన సీనియర్‌ నాయకునికి బీజింగ్‌ ఆతిథ్యం ఇచ్చింది. పాలక పార్టీకన్నా వారు ఒకటి రెండు పాయింట్లు ఎక్కువే సాధించారని దీనిని బట్టి చెప్పవచ్చు. చైనా 'దుష్టపన్నాగాల' గురించి ప్రచారం చేయటంలో పైన తెలిపిన మూడు రకాలవారు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. త్వరలోనే యుద్ధం రాగలదని, భారతదేశం తన రక్షణ సామర్ధ్యాన్ని పెంచుకోవటానికి తగినంత సమయం లేదని వారు నమ్మబలుకుతున్నారు. అత్యాధునికమైన 126 యుద్ధ విమానాల కొనుగోలుతో సహా అపరిష్కృతంగా వున్న ఆయుధ సేకరణ అంశాలపై ప్రభుత్వం సత్వరమే నిర్ణయం తీసుకోవాలని వీరు కోరుతున్నారు.ఈ విషాదభరిత హాస్య నాటకం అంతం లేకుండా కొనసాగుతుండడంతో ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ జోక్యం చేసుకుని వీరి యుద్ధోన్మాదంపై చన్నీళ్ళు చల్లారు. చైనా సరిహద్దులో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నదంటూ ఆర్మీ ప్రధానాధిపతి దీపక్‌ కపూర్‌ ప్రకటించారు. రకరకాలుగా చెవులు కొరుక్కుంటున్న తమ వారిని సైనిక ప్రధానాధికారి అదుపు చేయాల్సి ఉంటుంది. ప్రసారమాధ్యమానికి ఉప్పందించటం ద్వారా ఉత్తుత్తి యుద్ధాలు చేసే అలవాటు అమెరికన్‌ కమాండర్లకు బాగా ఉన్నది. కాని భారతీయులమైన మనకు ఈ కుటిల సంస్కృతిని అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు.


వాస్తవానికి, భారత్‌-చైనా సంబంధాలు ఇటీవలి సంవత్సరాలలో నిలకడగా విస్తరిస్తుండటంతోపాటు, పరిణతి చెందుతున్నాయి. ఎప్పటికప్పుడు ఉన్నతస్ధాయిలో రాజకీయ అభిప్రాయాల మార్పిడి, అంతకంతకూ వృద్ధి చెందుతున్న వాణిజ్య సంబంధాలు, సరికొత్త వ్యూహాత్మక చర్చలు, సైనిక సహకారం తదితర అంశాలు ఉభయ దేశాల మధ్య సాన్నిహిత్యాన్నీ, విశ్వాసాన్నీ పెంపొందించాయి. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవటానికి ఈ వాతావరణం చక్కని భూమికగా ఉపయోగపడనున్నది. రష్యా-చైనాల మధ్య సాధారణ పరిస్థితి నెలకొనటానికి కూడా ఈ పద్ధతే ఉపయోగపడింది. చైనాతో భారత్‌కున్న సంక్లిష్ట సంబంధాలను కొనసాగించటానికిగాను యుపిఏ ప్రభుత్వం చేపట్టిన దానికన్నా ఉత్తమమైన విధానం మరొకటి లేదు. ప్రధానమైన మరో అంశమేమిటంటే, ఈనాడు భారత్‌ అనుసరిస్తున్న చైనా విధానం అత్యున్నతస్ధాయిలో చేపట్టినది. విదేశాంగ కార్యదర్శిగావున్న నిరుపమా రావు అత్యుత్తమ దౌత్యవేత్త, చైనా వ్యవహారాలలో ఎంతో నైపుణ్యం గడించిన వారు. ఇంతకన్నా మంచి వ్యక్తిని రాజకీయ నాయకత్వం సంపాదించలేదు. అయితే సమస్య ఎక్కడ ఉన్నది? భారత్‌-చైనాల మధ్యవున్న సుహృద్భావ సంబంధాలు దెబ్బతినడం వల్ల ఎవరు లాభపడతారు? ఈ సందర్భంగా ఒక్క మాట గుర్తు చేయాలి. ప్రపంచంలోనే చైనా రెండవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉన్నది. సమీప భవిష్యత్‌లో భారతదేశం మూడవ స్థానాన్ని ఆక్రమించే సూచనలు ఉన్నాయి. వ్యూహాత్మక రీత్యా చూసినపుడు అత్యంత కీలకమైన అంశాలలో, అంటే, వాతావరణ మార్పులు, దోహ దఫా చర్చలు, మతపరమైన తీవ్రవాదం, ఉగ్రవాదం వంటివాటిల్లో ఉభయ దేశాలు ఉమ్మడిగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. దీని ప్రభావం ఆసియాపై బలంగా ఉంటుంది. వాస్తవానికి కొన్ని విషయాలలో ఈ పరిణామం ఇప్పటికే మొదలైంది. ఈ పరిణామం కారణంగా ప్రపంచ రాజకీయ రంగం తూర్పు వైపు మారే అవకాశం ఉండటంతో పాశ్చాత్య దేశాలు కలవరపడుతున్నాయి. వాస్తవానికి భారతదేశంపై దండెత్తటం వల్ల చైనా బావుకునేదేమీ ఉండదు. పైగా నష్టమే ఎక్కువ. ఆర్థికాభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగాలన్న దాని విధానాలకు విఘాతం కలుగుతుంది. అంతేకాక, అంతర్జాతీయంగా బాధ్యతాయుత శక్తిగావున్న ప్రతిష్టకు భంగం వాటిల్లుతుంది. పొరుగు దేశాలతో చైనా స్నేహ సంబంధాలు సమతూకంతో ఉన్నాయని మయన్మార్‌ వ్యవహారాన్ని చూస్తే అర్థమవుతుంది. భారత మాత కంఠానికి ''ముత్యాల ఉరితాడు''ను చైనా సిద్ధం చేస్తున్నదంటూ అమెరికాకు చెందిన ఓ అపరిపక్వ వయస్కురాలు చేసిన నిర్ధారణలనే మన దేశంలోని మేధావులు పదేపదే వల్లిస్తున్నారు. చివరిగా మరొక ముఖ్యమైన విషయాన్ని చెప్పుకోవాలి. అదేమంటే, చైనా చాలా మెలకువతో వ్యవహరిస్తున్నది. పాకిస్తాన్‌ను కీలక పొత్తుదారుగా చేసుకుని మన ప్రాంతంలో శాశ్వతంగా తిష్టవేయాలనే అమెరికా పన్నాగం నుండి ఈ యుద్ధోన్మాదం ప్రజల దృష్టిని మళ్ళిస్తున్నది. ఆప్ఘనిస్ధాన్‌, ఉగ్రవాదం వంటి విషయాలపై రష్యా, భారత్‌, చైనాలు ఉమ్మడి వైఖరిని తీసుకోవాలన్న ఆలోచనను ఇది అస్థిరపరుస్తున్నది. బయటిదేశం నుంచి ముప్పు ఉందని చూపినట్లైతే అంతిమంగా అది అమెరికాతో భారత్‌ సైనిక సహకార విస్తృతికి ప్రాతిపదికగా ఉపయోగపడుతుంది. లెనిన్‌ మహాశయుడు ఈ పరమ సత్యాన్ని ఎంత చక్కగా చెప్పాడు!

Note:Article took from Prajasakthi paper written by BadraKumar

No comments:

Post a Comment