Wednesday, 19 January 2011

వికీలీక్స్‌ దెబ్బకు ట్యునీసియా నియంత ఠా !!



1881 నుంచి ఫ్రెంచి కబంధ హస్తాల్లో చిక్కుకొని 1956లో స్వాతంత్య్రం పొందిన ఉత్తర ఆఫ్రికా దేశమైన ట్యునీసియాలో కొత్త అధ్యాయానికి తెరలేచింది. పిడుగుపాటు వంటి అక్కడి అనూహ్య పరిణామాలు అనేక మందికి ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అమెరికా, ఐరోపాలోని సామ్రాజ్యవాదుల మద్దతుతో గత 23 సంవత్సరాలుగా అధికారం వెలగబెడుతున్న నియంత జైనెల్‌ అబడిన్‌ బెన్‌ అలీ గత నెల రోజులుగా అక్కడి యువజనులు, కార్మికులు, ఇతరులు సాగిస్తున్న ఉద్యమాల తాకిడికి తట్టుకోలేక శుక్రవారంనాడు దేశం వీడి సౌదీ అరేబియాకు పారిపోయాడు. బెన్‌ అలీ నీడలో ట్యునీసియాను దోచుకున్న ఆయన బంధుమిత్రులు, ఆశ్రితులను జనం ఇప్పుడు వేటాడుతున్నారు. అలీ అల్లుడు డీలర్‌గా ఉన్న కంపెనీ అమ్మిన కార్లను కూడా జనం తగుల బెడుతున్నారంటే ప్రజాగ్రహం ఎంతగా కట్టలు తెంచుకుందో అర్థమవుతోంది. మాజీ మంత్రులతో సహా అనేక మందిని అరెస్టు చేశారు. బెన్‌ అలీ భార్యలలో ఒకరు కత్తిపోట్ల గాయాలతో ఆసుపత్రిలో మరణించినట్లు వార్తాసంస్థలు పేర్కొన్నాయి.




ఉత్తర ఆఫ్రికాలోని అరబ్బు రాజ్యమైన ట్యునీసియా మొత్తం జనాభా కోటి. బెన్‌ అలీ కుటుంబపాలన అవినీతికి మారుపేరుగా మారింది. పులిమీద పుట్రలా నూతన ఆర్థిక విధానాలతో విదేశీ కంపెనీల దోపిడీ పెరిగింది. దాంతో నిరుద్యోగం తాండవమాడుతోంది. ఏ క్షణంలో అయినా పేలటానికి సిద్ధంగా ఉన్న స్థితిలో వికీలీక్స్‌ పత్రాలు ఆ పరిణామాన్ని మరింత వేగిరపరిచాయి. అందువల్లే వికీలీక్స్‌ దెబ్బకు కూలిపోయిన తొలి పాలకుడిగా బెన్‌ అలీ చరిత్రకెక్కాడు. విదేశీ పెట్టుబడిదారులకు స్వర్గంగా, చౌక శ్రమశక్తి దొరికే ప్రాంతంగా ట్యునీసియాను బెన్‌ అలీ తయారు చేశాడు. అలాంటివారికి ఈ పరిణామం పిడుగుపాటే. సిడీ బౌజిడ్‌ అనే పట్టణంలో విశ్వవిద్యాలయ డిగ్రీ కలిగి ఉండి ఉద్యోగం దొరక్క పండ్లు అమ్ముకొంటున్న మహమ్మద్‌ బౌజిజి అనే యువకుని ఆత్మాహుతి ట్యునీసియన్లలో ఆగ్రహ జ్వాలలను రగిల్చింది. అక్కడి ఉద్యమానికి ఇదే నాంది పలికింది. ఆ యువకుడు అనుమతి లేకుండా రోడ్డుపై పండ్లమ్ముతున్నాడని పోలీసులు అడ్డుపడ్డారు. దాంతో తీవ్ర నిరాశకు గురై ఆత్మాహుతికి పాల్పడ్డాడు. దీనికి నిరసనగా దేశమంతటా ప్రదర్శనలు జరిగాయి. దీనికి వికీలీక్స్‌ సమాచారం మరింత ఆజ్యం పోసింది. తనకు రోజులు మూడాయని అర్థ్ధం చేసుకున్న బెన్‌ అలీ ఆఖరి ఎత్తుగడగా తాను మారానని ప్రజలను నమ్మించే యత్నం చేశాడు.






తాను ఇక శాశ్వత అధ్యక్షుడిగా ఉండబోనని, మీడియా, ఇంటర్నెట్‌పై ఆంక్షలు పూర్తిగా ఎత్తివేస్తానని, 2014లో జరిగే ఎన్నికల్లో పోటీ చేయబోనని ఈ ఒక్కసారి తన మాటలపై నమ్మకం ఉంచండంటూ విజ్ఞప్తి చేశాడు. తిరుగుబాటు ద్వారా అధికారం స్వీకరించినప్పటి నుంచి ఇదే కబుర్లు చెబుతున్న ఆ నియంత మాటలను జనం ఏమాత్రం విశ్వసించలేదు. ట్యునీసియా రాజ్యాంగం ప్రకారం 75 ఏళ్లు పైబడినవారు అధ్యక్ష పదవికి అనర్హులు. ఇప్పుడు అలీ వయస్సు 74. అందువల్ల తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని జనం డిమాండ్‌ చేశారు. రాజధాని ట్యునీస్‌, ఇతర ముఖ్యప్రాంతాలను జనం ముట్టడిస్తారన్న భయంతో అటువైపు దారితీసే రోడ్లు, రైలు మార్గాలన్నిటిని ప్రభుత్వం గత కొద్ది రోజులుగా మూసివేసింది. దీంతో జనం పోలీస్‌ స్టేషన్లపై దాడికి వెళ్లగా మీ ఆగ్రహం మామీద కాదు బెన్‌ అలీ బంధువుల రాజప్రాసాదాలు, ఆస్తులపై చూపండని పోలీసు అధికారులు చెప్పినట్లు వార్తలొచ్చాయి. బెన్‌ అలీ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ఈనెల 12న పోలీసు మంత్రిని తొలగించాడు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మూడులక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్నాడు. ఈ ఆపదమొక్కులేవీ ఫలించలేదు. 13న ఆందోళన రాజధానికి పాకింది. ఆ మరుసటి రోజే బెన్‌ అలీ పరారయ్యాడు.




ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంటున్న సమయంలో ట్యునీసియా కమ్యూనిస్టుపార్టీ నాయకుడు హమ్మా హమ్మామీని అపహరించారు. ఈ నెల 12న చోటుచేసుకున్న ఈ దుశ్చర్యను బెల్జియం, ఫ్రెంచి కమ్యూనిస్టుపార్టీలు ఖండించాయి. ట్యునీసియన్ల ఉద్యమానికి మద్దతుగా, హమ్మామీ అపహరణకు నిరసనగా పారిస్‌లోని ట్యునీసియా రాయబార కార్యాలయం ఎదుట ఫ్రెంచి కమ్యూనిస్టుపార్టీ నాయకత్వంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. బెన్‌ అలీ, కుటుంబ అవినీతి అక్రమాల గురించి అమెరికాతో సహా పశ్చిమ దేశాలన్నింటికీ ఎప్పటినుంచో తెలుసునని అమెరికా రాయబారుల వర్తమానాలను ఉటంకిస్తూ వికీలీక్స్‌ వెల్లడించింది. ట్యునీసియాలో వికీలీక్స్‌ వివరాలను ప్రచురించే అవకాశం లేకపోవటంతో లెబనాన్‌ పత్రిక అల్‌ అక్బర్‌ వీటిని సవివరంగా అందచేసింది. బెన్‌ అలీ పారిపోవటంతో అతని అనుచరుడు, ప్రధాని మహమ్మద్‌ ఘన్నవుషీ ప్రభుత్వ టీవీలో ఒక ప్రకటన చేస్తూ పార్లమెంట్‌ స్పీకర్‌ ఫావుద్‌ మెబెజా నాయకత్వంలో జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాడు. బెన్‌ అలీ నిషేధించిన కమ్యూనిస్టుపార్టీ, ఇస్లామిక్‌ పార్టీ మినహా మూడు ప్రతిపక్షాలతో ఈ మేరకు చర్చలు జరుపుతున్నారు. అయితే బెన్‌ అలీ మద్దతుదార్ల నాయకత్వంలో ఏర్పడే ఈ ప్రభుత్వం నిలబడుతుందా? ప్రజలు దీనిని అనుమతిస్తారా అన్నది ప్రశ్న.




ట్యునీసియాలో బెన్‌ అలీని వ్యతిరేకించే శక్తులకు మిలిటరీ మద్దతు ఇస్తున్నట్లుగా అధికారిక మీడియా వార్తలు సూచిస్తున్నాయి. అలీ మద్దతుదార్లపై మిలిటరీ దాడులు చేస్తోంది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన పోలీసులను, ఉన్నతాధికారులను విధుల నుంచి తప్పించింది. బెన్‌ అలీ దేశం నుంచి పారిపోతూ జనంపై కాల్పులకు ఇచ్చిన ఉత్తర్వులను మిలిటరీ ధిక్కరించినట్లు అరబ్‌ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అనేక చోట్ల పోలీసుల బారి నుంచి జనాన్ని మిలిటరీ కాపాడినట్లు కూడా చెబుతున్నారు. గత నెల రోజులుగా ధరల పెరుగుదల, అవినీతికి వ్యతిరేకంగా ఉత్తరాఫ్రికాలోని ట్యునీసియా, లిబియా, అల్జీరియా, ఈజిప్టు తదితర దేశాలలో జనం పెద్దయెత్తున వీధులలోకి వస్తున్నారు. ట్యునీసియాలో ప్రదర్శకులపై జరిపిన కాల్పుల్లో 23 మంది మరణించారని అధికారులు ప్రకటించగా 66 మంది దాకా మరణించినట్లు అనధికారిక సమాచారం తెలియజేస్తోంది. తన పూర్వపు వలస ట్యునీసియాలో పరిణామాలపై ఫ్రెంచి ప్రభుత్వం మౌనం వహించటం అనేక మందిని ఆశ్చర్య పరిచింది. బెన్‌ అలీని నియంతగా వర్ణించేందుకు కూడా అది సిద్ధ పడలేదు. ఊహాగానాల ప్రకటనలు చేయటం కంటే నిదానంగా వాస్తవ పరిస్థితులను విశ్లేషించటం ఉత్తమం. మనం పాఠాలు చెప్పేవారిగా ఉండకూడదని ఫ్రెంచి విదేశాంగ మంత్రి మిచెల్లి అలియట్‌ వ్యాఖ్యానించారు. అమెరికా రాయబారి తన రహస్య వర్తమానంలో బెన్‌ అలీ నాయకత్వంలోని ట్యునీసియా ఒక పోలీసు రాజ్యంగా ఉంది. సభలు, సమావేశాల స్వేచ్ఛలేదు. తీవ్రమైన మానవహక్కుల సమస్యలున్నాయని పేర్కొన్నారు.






అయినా, అమెరికా బెన్‌ అలీని తన మిత్రుడిగానే పరిగణించింది. 2014 అధ్యక్ష ఎన్నికల్లో బెన్‌ అలీ తప్పుకున్నా, ఆయన భార్య లైలాను ఆ కుర్చీలో కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడని తెలిసింది. ఇప్పటికే రాజ్యాంగేతర శక్తిగా ఎదిగిన లైలా, ఆమె సోదరుడు బెల్‌ హసన్‌ ట్రెబెలిసీ తెర వెనక నుంచి చక్రం తిప్పుతూ వచ్చారు. బెన్‌ అలీ అల్లుడు షకీర్‌ ఎల్‌ మత్రి కూడా అధ్యక్ష పదవిపై కన్నేశాడు. అమెరికా రాయబారి 2009 మే 26న ఏర్పాటు చేసిన ఒక విందుకు ఆయన హాజరై రెండు గంటల పాటు చర్చలు జరిపినట్లు వికీలీక్స్‌ పత్రాలు వెల్లడించాయి. తమ కుటుంబ సభ్యులపై కంటే అమెరికాపై ఆధారపడటం మంచిదని అనేక మంది పాలక అరబ్బులు భావించినట్లుగా బెన్‌ అలీ అల్లుడు కూడా అమెరికన్లతో మంతనాలు జరిపాడు. అతనే వారసుడు కావచ్చని కూడా రాయబారులు తమ వర్తమానాల్లో పేర్కొన్నారు. అయితే గ్వాంటనామో బే ఖైదీలను తమ దేశానికి పంపవద్దని, తాము చిత్రహింసలు పెట్టేందకు వ్యతిరేకమని బెన్‌ అలీ అమెరికా అధికారులకు ఒక సందర్భంలో చెప్పటంతో అప్పటి నుంచి అలీపై అమెరికా గుర్రుగా వుంది. నియంతలను తన అవసరాలకు వినియోగించుకోవటం, వారు జనంలో గబ్బుపట్టిన తరువాత కొత్త ముఖాలను తెరపైకి తేవటం సామ్రాజ్యవాదులకు ముఖ్యంగా అమెరికాకు కొట్టిన పిండి.




ట్యునీసియా పరిణామాలపై ఏ ధనిక దేశం కూడా పెద్దగా స్పందించలేదు. తమ ప్రయోజనాలను దెబ్బతీసే శక్తులేవైనా అధికారానికి వచ్చే అవకాశాలున్నపుడే అవి రంగంలోకి దిగుతాయి. ఇప్పుడు ట్యునీసియా పరిణామాలలో ఎవరు ప్రజా ప్రతినిధులుగా ముందుకు వస్తారో చూడాల్సి ఉంది. ఇరాన్‌ మాదిరి ఉద్యమం ఇస్లామిక్‌ శక్తుల చేతుల్లోకి పోతుందా?లాటిన్‌ అమెరికా మాదిరి ప్రజాతంత్ర, వామపక్ష శక్తులను ముందుకు తెస్తుందా?
Note : prajasakti Editorial

No comments:

Post a Comment