Tuesday, 2 February 2010
వైద్య వ్యవస్థ - ఫ్రాన్స్ నమూనా
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మొదటిసారిగా 1950లలో మన వైద్య వ్యవస్థకు రూపురేఖలు దిద్దారు. సర్ జోసెఫ్ బోర్ కమిటీ సూచనలూ దీంట్లో ప్రధాన భూమిక వహించాయి. నిజానికి ఆనాటికి అదొక ముందడుగే. దానికి కేంద్ర బిందువు - ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణ: జనాభా ప్రాతిపదికన తగిన సంఖ్యలో ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, జిల్లా స్థాయిలో రెండవ అంచె రిఫరల్ ఆస్పత్రులు, రాష్ట్రస్థాయిలో మూడవ అంచె స్పెషాలిటీ ఆస్పత్రులు, వైద్య విద్యకు బోధనా సదుపాయాల ఏర్పాటు. ఆ తర్వాత వేసిన కమిటీలు కొన్ని చేర్పులు, మార్పులతో మెరుగులు దిద్దినా ఆ పునాది మీదనే అవన్నీ ప్రభుత్వ రంగంలోనే అదంతా.
ఈలోగా దేశంలో ప్రైవేటు వైద్య రంగం పుంజుకుంది. డాక్టర్ల సంఖ్యలో, రోగులకు సేవలు అందించే మోతాదులో, దాదాపు మూడింట రెండొంతులు ప్రైవేట్ రంగం ఆక్రమించింది. ఇటీవల ప్రైవేట్ రంగంలోనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు పెద్ద సంఖ్యలో వచ్చాయి. ఆధునిక సౌకర్యాలలో విదేశాలతో పోటీపడే స్థాయిలో ఉంటున్నాయి. ప్రభుత్వ రంగంలో కన్నా ప్రైవేట్ రంగంలోనే వైద్య కళాశాలలు ఎక్కువగా పెరుగుతూ వచ్చాయి. 1991లో వచ్చిన నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణల కారణంగా విద్యా, వైద్య రంగాలకు ప్రభుత్వ కేటాయింపులు గణనీయంగా తగ్గుతూ వచ్చాయి. ఫలితంగా ప్రభుత్వ రంగ వైద్య సేవలు రాశిలోను, వాసిలోను పడిపోతూ వచ్చాయి. మరోవైపు ఆదాయాలలో అంతరాలు పెరుగుతూ వచ్చాయి. సాధారణ ప్రజలకు మెరుగైన వైద్యం మాట అటుంచి, కనీస వైద్యం అందడం దుర్లభమవుతోంది. పోషకాహారలోపం, శానిటేషన్, వ్యాధి నిరోధక చర్యలు (preventive Measures/Public Health) అధ్వానస్థితికి చేరుకున్నాయి. ప్రజారోగ్యం సాధారణ ప్రజలకు అందని చందమామగా మారిపోయింది. మానవాభివృద్ధి సూచికలు దారుణంగా పడిపోతున్నాయి. సాధారణ ప్రజల్లో ముఖ్యంగా, పట్టణ, గ్రామీణ పేదలు, గిరిజన ప్రాంతవాసుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వాలు అరకొర చర్యలతో సరిపెడుతున్నాయి. ఆరోగ్యశ్రీ వంటి ప్రైవేటు ఇన్సూరెన్సు పథకాలు, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్పులు, కార్పొరేట్ రంగానికి రాయితీలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. అమర్త్యసేన్‌లాంటి సామాజిక ఆర్థికవేత్తలు పలువురు ఆందోళన వెలిబుచ్చారు. దేశీయ వైద్య ఆరోగ్య వ్యవస్థకు మౌలిక ప్రత్యామ్నాయం కోసం ఆలోచన ప్రారంభమైంది. ఈ దిశగా 2008 సెప్టెంబరు 8న ఢిల్లీలో ఒక వేదిక ఏర్పాటయింది. దానిలో world Care Council India, Business Alliance, The Hindu, Public Health Foundation of India తదితర స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు. దీనికి సారథిగా పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అధినేత డా|| శ్రీనాథరెడ్డి ఉన్నారు. ఈయన ఎఐఐఎంఎస్‌లో హృద్రోగ నిపుణులుగా దీర్ఘకాలం పనిచేసి పదవీ వివరమణ చేసి ఉన్నారు. పద్మభూషణ్ అవార్డు పొందడమే కాక మన ప్రధాన మంత్రికి పర్సనల్ ఫిజిషియన్‌గా కూడా ఉన్నారు. వీరంతా ఒక సంవత్సరం పాటు దేశంలోని వివిధ సంస్థల నిపుణుల, ప్రజారోగ్య కార్యకర్తల సలహాలు తీసుకునేందుకు ఒక ప్రశ్నాపత్రాన్ని పంపి వారి అభిప్రాయాలను సేకరించనున్నారు. వారి సలహాలను 2010 అక్టోబర్ 10న ప్రభుత్వం నియమించిన పార్లమెంటరీ కమిటీకి సమర్పిస్తారు.
ఈ సమస్యపై దేశవ్యాప్త విస్తృతచర్చ జరగవలసి ఉంది. వివిధ దేశాల్లో ఉన్న ప్రజారోగ్య వ్యవస్థలను అధ్యయనం చేయడం వల్ల మన దేశ ప్రత్యేక పరిస్థితులకు ఏదైనా మంచి నమూనా దొరుకుతుందేమో చూడవలసి ఉంది. మాజీ సోషలిస్టు దేశాల్లో వైద్యం నూటికి నూరుపాళ్లు ప్రభుత్వ రంగంలోనే ఉండేది. ఇప్పుడు క్యూబాలో కూడా ఆ నమూనా కొనసాగుతున్నది. దీనిలో ఉన్న సుగుణం దేశంలో ప్రతి పౌరునికి ఒక చట్టబద్ధమైన హక్కుగా వైద్యసేవలు అందుతాయి. ఆ సేవలు పంచనక్షత్ర స్థాయిలో ఉండకపోవచ్చు. కాని పూర్తి అవసరాల మేరకు రోగికి పైసా ఖర్చు లేకుండా వైద్య సదుపాయం లభిస్తుంది. 1948 ఇంగ్లాండులో వైద్యరంగం పూర్తిగా జాతీయం చేయబడింది. దాన్ని ఎన్‌హెచ్‌ఎస్ అని పిలుస్తారు. ఇంచుమించు అదే నమూనా ఇటీవల కెనడా అవలంబించింది. ఈ దేశాల ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు సర్వేలు తెలియజేస్తున్నాయి. చిన్న చిన్న ఇబ్బందులు, లోపాలు లేకపోలేదు. అవి బ్యురాక్రసీ ప్రవేశం, వైద్యుల, నిధుల కొరత వల్ల ఏర్పడినవే ఈ స్వల్పమైన ఇబ్బందులు. కుటుంబాలు నిర్దిష్టమైన జి.పి (జనరల్ ప్రాక్టీషనర్) దగ్గరకే వెళ్లవలసి రావడం, అతని/ ఆమె ద్వారా మాత్రమే స్పెషలిస్టు వద్దకు గాని, హాస్పిటల్‌కు గాని రెఫరల్ పొందవలసిరావడం, అంతగా తొందరలేని కొన్ని సాధారణ ఆపరేషన్లకు ఎక్కువకాలం ఆగవలసిరావడం, ప్రతిసారి అపాయింట్‌మెంట్ తీసుకోవలసి ఉండటం ఇలాంటివి కొన్ని చెబుతుంటారు. అయినా ఇటీవల ఆ వ్యవస్థను మార్పు చేయాలని కొందరు సూచించినప్పుడు ఆ దేశ ప్రధాని గార్డన్‌బ్రౌన్‌తో సహా ప్రతిపక్ష నాయకుడు కూడా చాలా గట్టిగా వ్యతిరేకించడం గమనార్హం. తమ దేశం గర్వించదగ్గ ఒక వైద్య వ్యవస్థగా వారు దాన్ని పేర్కొన్నారు. మార్గరెట్ థాచర్ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వానికి ఖర్చు ఎక్కువ అవుతుందనే నెపంతో ఆమె కొన్ని మార్పులు చేయాలని చూస్తే దేశ ప్రజలంతా ముక్త కంఠంతో వ్యతిరేకించారు. ఇవి ఆదర్శవంతం కావచ్చు కాని మన దేశ ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. ఒకటి : ఆర్థిక భారం. రెండోది: ఇప్పటికే విస్తృతంగా ఉన్న వివిధ రకాల ప్రైవేట్ రంగం. మూడు : వైద్యులు, నర్సులు తదితర పారామెడికల్ సిబ్బంది (జనాభాతో పోల్చినపుడున్న) కొరత. అమెరికా నమూనా అత్యంత ఖరీదైంది. అసమానమైనది. ఇన్సూరెన్స్ కబంధ హస్తాల్లో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో కొన్ని యూరోపియన్ దేశాల్లో ఉన్న నమూనాలను అధ్యయనం చేయడం అవసరం కావచ్చు. వాటిలో ఫ్రాన్స్, జర్మనీ, స్విట్లర్లాండ్, నార్వే, స్వీడన్ ప్రధానమైనవి. వీటన్నింటిలోనూ ఫ్రాన్స్‌లో ఉన్న వైద్య వ్యవస్థ మెరుగైనదిగా పలువురి ప్రశంసలు అందుకుంటున్నది. ప్రఖ్యాత ఆర్థికశాస్త్రవేత్త 2008 నోబెల్ బహుమతి గ్రహీత పాల్‌కృగ్‌మన్ దీన్ని 'ఎక్స్‌లెంట్'గా ఒక వ్యాసంలో పేర్కొన్నాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2001లో ప్రపంచవ్యాప్తంగా చేసిన సర్వేలో దానిని 'ద బెస్ట్'గా వర్ణించింది. అయినా ఈ నమూనా మన దేశానికి మక్కీకి మక్కీగా పనికి వస్తుందని ఈ వ్యాసకర్త అనుకోవడం లేదు. కాని లోతుగా అధ్యయనం చేస్తే మన ప్రత్యేక పరిస్థితులకు ఏమైనా అన్వయం చేసుకోవచ్చునేమో. ఆర్థిక సామాజిక, వైద్య రంగ నిపుణులు పరిశీలించవచ్చు.
ఫ్రాన్స్ వైద్య విధానం
ఫ్రాన్స్ దేశపు ప్రజారోగ్య వ్యవస్థ (Health Care System) ను పరిశీలించేముందు ఆ దేశానికి సంబంధించిన కొన్ని గణాంకాలు తెలుసుకోవడం వల్ల కొంత ప్రాథమిక అవగాహన ఏర్పడుతుంది. అలాగే మన దేశ గణాంకాలతోనూ అత్యంత సంపన్నవంతంగా పేరున్న అమెరికా గణాంకాలతోనూ కూడా పోల్చి చూసుకోవచ్చు. ప్రాన్స్ ప్రజారోగ్య వైద్య వ్యవస్థలో ఉన్న ప్రధాన ఆకర్షణీయ అంశాలు : క్లుప్తంగా ఇలా చెప్పుకోవచ్చు. 1. మిగతా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తక్కువ తలసరి ఖర్చుతో ఎక్కువ ఫలితాలు సాధించవచ్చు. 2. మానవాభివృద్ధి సూచికలు ఇతర దేశాలకన్నా చివరికి అమెరికా కన్నా కూడా మెరుగ్గా ఉన్నాయి. 3. ప్రభుత్వరంగం, ప్రైవేటు రంగం రెంటిని సమర్థవంతంగా ఇముడ్చుకుని ఉపయోగించుకోవచ్చు. 4. ఇన్సూరెన్సు ఆధారితమైనా ఇన్సూరెన్సు కంపెనీలు దాదాపు పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీలోనే ఉన్నాయి. ప్రతి వ్యక్తికీ బీమా కల్పించే బాధ్యత వాటి మీద వుంది. 5. రోగికి తన డాక్టరును తన హాస్పిటల్‌ను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. 6.తక్షణవైద్యం లభిస్తుంది. 7.అన్నింటి పైనా ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. ఇక, వివరాలలోకి వెళితే...
ఫలితాలు
అక్కడి ఆరోగ్య సేవా వ్యవస్థను చాలా మంది మెచ్చుకోవడానికి ప్రధాన కారణం మెరుగైన జీవన ప్రమాణ సూచికలు (Health Care Indices). ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రజారోగ్యం మీద తన స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి)లో 11శాతం ఖర్చు పెడుతుంది. ఇది యూరోపియన్ దేశాల్లో కంటే కాస్త ఎక్కువే కాని, అమెరికాతో పోల్చితే చాలా తక్కువ. అమెరికా ఖర్చు జి.డి.పిలో 16 శాతం కాని ఫలితాల్లో ఉన్న తేడా గమనించతగ్గది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ రేటింగ్‌లో ఫ్రాన్స్ మొదటిస్థానంలో ఉంటే అమెరికా 37వ స్థానంలో ఉంది.
- ఫ్రాన్స్ శిశుమరణాల రేటున ప్రతి వెయ్యి జననాలకు 3.9, అమెరికాలో 7, భారత్‌లో 60.
- ఫ్రాన్స్‌లో సగటు జీవన ప్రమాణ (జి.డి.పి) 80 సంవత్సరాలు. అమెరికాలో 77 సంవత్సరాలు / భారత్‌లో 63 సంవత్సరాలు
-తలసరి ఆస్పత్రి పడకల సంఖ్య, డాక్టర్ల సంఖ్య అమెరికాలో కంటే ఫ్రాన్స్‌లో ఎక్కువ.
- ఫ్రాన్స్‌లో మధుమేహం, గుండెజబ్బులతో చనిపోయే వారి శాతం అమెరికాలో కంటే చాలా తక్కువ.
- నివారించదగ్గ శ్వాసకోశ వ్యాధుల వల్ల చనిపోయే వారి సంఖ్య ఫ్రాన్స్‌లో లక్ష జనాభాకు 31.2 అయితే అమెరికాలో 61.5 శాతం.
ఆశయాలు
దేశ ప్రజల్లో ప్రతి ఒక్కరికి వైద్య సదుపాయం అందుబాటులో ఉండాలి. అతి తక్కువ ఆదాయాలు గలవారికి, అసలు ఆదాయంలేని వారికి అండగా నిలుస్తుంది. వైద్య సదుపాయాల్లో తేడా ఏమీ ఉండదు. ఇంటి పెద్ద (Bread Winner) కుఉన్న ఇన్సూరెన్స్ తన మీద ఆధారపడే కుటుంబ సభ్యులందరికీ రక్షణ కల్పిస్తుంది. పౌరులకు తమ వైద్య ఖర్చు గురించిన అవగాహన బాధ్యత ఉండాలంటే కొద్ది శాతం (10 - 20శాతం) తాము కూడా భరించాలి. చీటికి మాటికి డాక్టర్ల దగ్గరకు వెళుతూ ఈ పథకాన్ని దుర్వినియోగపర్చకుండా ఈ ''కో-పేమెంట్'' ఉపయోగపడుతుందనే భావన
ఇన్సూరెన్స్
వైద్య ఖర్చులో అత్యధిక భాగానికి 80శాతం వరకూ జాతీయ బీమా వర్తిస్తుంది. తక్కిన కొద్ది భాగానికి ప్రైవేట్ ఇన్సూరెన్స్ ప్రీమియం పరిశ్రమాధిపతి లేదా ప్రభుత్వం కడతాయి. శ్రామికుడి వాటా తక్కువ.జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీలకు స్వయం నియంప్రతిపత్తి (Autonomy) ఉంటుంది.కాని పూర్తి ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది (మన ఎల్‌ఐసి, జిఐసి మాదిరిగా). సప్లిమెంటరీ ఇన్సూరెన్స్‌లో మాత్రం ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ సంస్థలు, కొద్ది సంఖ్యలో పూర్తి ప్రైవేటు కంపెనీలు ఉన్నాయి. జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీలు 4-5 ఉంటాయి. ఒకటి పరిశ్రమలలోనూ, ఇతర కమర్షియల్ కంపెనీలలోనూ పనిచేసే వేతన జీవులు, సేవలు చేసేవారికి. రెండోది : వ్యవసాయ రంగంలోని పనివారికి. మూడోది: నిరుద్యోగులు, విద్యార్థులకు. నాలుగోది: స్వతంత్ర వృత్తిదారులకు, వీటిని వేరు వేరు కంపెనీలు కవర్ చేస్తాయి.పరిశ్రమల్లో పనిచేసేవారికి, తదితర వేతన జీవులకు - ఉద్యోగ వేతనంలో 12 శాతం పరిశ్రమే ఇన్సూరెన్స్‌ను కడుతుంది. ఉద్యోగి తన వేతనంలో 0.75 మాత్రమే దానికి జత చేస్తాడు. పౌరుడు, డాక్టరు లేక డెంటిస్ట్ దగ్గరకు వెళితే లేక ఆస్పత్రిలో ఉండవలసి వస్తే ఆయా ఫీజుల్లో 70-80 జాతీయ ఇన్సూరెన్స్ భరిస్తుంది. కొన్ని ప్రత్యేక కేసుల్లో 100 శాతం ఖర్చు కూడా భరించవచ్చు. మిగతాది పేషెంట్ కట్టవచ్చు. దీనినే ''కో - పేమెంట్'' అంటారు. లేక దాని కోసం ముందుగానే ''సప్లిమెంటరీ ఇన్సూరెన్స్'' తీసుకునే సదుపాయం ఉంది. దీనికి చాలా కంపెనీల మధ్య పోటీతో అతి తక్కువ ప్రీమియంతో బీమా పొందవచ్చు. 87 శాతం ప్రజలు ఈ సప్లిమెంటరీ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment